కొవ్వును మాత్రమే గుర్తించి కరిగించే నానో మెటీరియల్‌‌.. ఇక ఆ సమస్యలన్నింటికీ చెక్ !

by Javid Pasha |   (  Updated:2025-08-29 06:32:20  IST  )

P-G3 అనేది ఒక పాజిటివ్ ఛార్జ్ కలిగిన నానోపార్టికల్. ఇది కొవ్వు కణాలలోని నెగటివ్ ఛార్జ్ స్ట్రక్చర్‌ను లక్ష్యంగా చేసుకుంటుంది.

కొవ్వును మాత్రమే గుర్తించి కరిగించే నానో మెటీరియల్‌‌.. ఇక ఆ సమస్యలన్నింటికీ చెక్ !
X

దిశ, ఫీచర్స్ : శరీరంలో కొవ్వు పేరుకుపోవడం అనేక అనారోగ్యాలకు దారితీస్తుందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చాలామందిలో అధిక బరువు, గుండె జబ్బులకు ఇదే ప్రధాన కారణం. ముందుగానే కొవ్వు పెరుగుదలను గుర్తించలేకపోవడం కూడా మరో ప్రధాన సమస్యగా మారుతోంది. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టగల అద్భుత సాంకేతిక పరిష్కారాన్ని కనుగొన్నారు కొలంబియా యూనివర్సిటీకి చెందిన పరికశోధకులు. ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండానే కొవ్వు మాత్రమే గుర్తించి నాశనం చేయగల P-G3 అనే అత్యాధునిక ‘నానో మెటీరియల్‌’ను డెవలప్ చేశారు.

ఇతర కణాలకు ఇబ్బంది లేకుండా

శాస్త్రవేత్తలు కొత్తగా అభివృద్ధి చేసిన P-G3 పదార్థాన్ని ‘బొటాక్స్ ఫర్ ఫ్యాట్’ అని కూడా పిలుస్తున్నారు. ఈ నానో మెటీరియల్‌ను ఇంజెక్షన్ ద్వారా శరీరంలోని కొవ్వును లక్ష్యంగా చేసుకొని పంపినప్పుడు అది, శరీరంలోని ఇతర కణాలకు ఏమాత్రం హానిక చేయకుండా, నాశనం చేయకుండా కొవ్వును మాత్రమే తగ్గించే వినూత్న పద్ధతిని అందిస్తుంది. కొవ్వును తగ్గించే చికిత్సలకు సంబంధించి ఇప్పటి వరకున్న సాంప్రదాయ పద్ధతులు కొవ్వు కణాలను పూర్తిగా నాశనం చేస్తాయి. కానీ P-G3 అనేది అలా కాదు. ఇది కేవలం ప్రమాదకరమైన, అనారోగ్యకరమైన కొవ్వు కణాలను చిన్నవిగా, మరింత సమర్థవంతంగా మార్చడం ద్వారా పనిచేస్తుంది. ఈ కణాలు శిశువులు లేదా ఉన్నత స్థాయి అథ్లెట్లలో ఉండే కొవ్వు కణాలను పోలి ఉంటాయి. ఇవి శరీరంలో శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి.

ఎలా పనిచేస్తుంది?

P-G3 అనేది ఒక పాజిటివ్ ఛార్జ్ కలిగిన నానోపార్టికల్. ఇది కొవ్వు కణాలలోని నెగటివ్ ఛార్జ్ స్ట్రక్చర్‌ను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ లక్షణం P-G3ని ఒక GPS-గైడెడ్ చికిత్స మాదిరి పనిచేయడానికి సహాయపడుతుంది. అంటే ఇది కేవలం శరీరంలోని నిర్దిష్ట ప్రాంతాలలోని కొవ్వు కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని, శరీరంలోని ఇతర భాగాలకు హాని కలిగించకుండా ట్రీట్మెంట్ అందిస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఇప్పటికే ఎలుకలపై నిర్వహించిన ప్రైమరీ ప్రయోగాలలో P-G3 ఉపయోగించడంవల్ల బరువు తగ్గడంతో పాటు జీవక్రియ ఆరోగ్యంలో మెరుగుదల కనిపించింది. అయితే ఇది ఇంకా మార్కెట్లోకి అందుబాటులోకి రాలేదు. P-G3 కోసం పేటెంట్‌లు పెండింగ్‌లో ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.

Next Story