పెళ్లికి ఎందుకంత తొందర?

by Sujitha Rachapalli |

వయసొచ్చాక పెళ్లి గోల ఎప్పుడూ ఉండేదే.. కానీ వయసొచ్చిందని పెళ్లి చేసుకోవడం కాదు.. ఎవరిని చేసుకోవడమనేదే ఇంపార్టెంట్.. ఎలాంటి వ్యక్తిని చూజ్ చేసుకున్నావనేదే మ్యాటర్

పెళ్లికి ఎందుకంత తొందర?
X

దిశ, ఫీచర్స్ : ఓ పిల్ల ముప్పై ఏండ్లచ్చినయ్.. నీకన్న చిన్న పిల్లకు పెండ్లి అయింది.. నువ్వెప్పుడు చేసుకుంటవ్.. నీతోని పుట్టిన పోరగండ్లు ఇద్దరు ముగ్గురిని కన్నరు.. వాళ్లు కూడా పెండ్లీడుకు వచ్చిండ్రు.. నువ్వు మాత్రం పెండ్లి కాకుండనే ముసల్దానివి అయ్యేటట్లు ఉన్నవ్.. పక్కింటి వెనుకింటి ముసలమ్మలు ఆటపట్టించే విధానం ఇది. దీంతో తల్లిదండ్రులు కూడా వెంటనే పెండ్లి చేసేస్తే అయిపోతది అనుకుంటరు. కానీ ఎప్పుడు పెళ్లి చేసుకున్నామనే కంటే ఎవరిని చేసుకున్నామనేదే ముఖ్యమంటున్న తాజా అధ్యయనం.. 30 ఏండ్లు వచ్చేశాయనో, నడి ఈడు మీద పడిందనో మ్యారేజ్‌కు ఓకే అంటే లైఫ్ శాటిస్‌ఫాక్షన్ తగ్గిపోతుందని హెచ్చరిస్తుంది. మీకు ఒక పర్సన్ నిజంగా కనెక్ట్ అయినప్పుడే చేసుకోవాలని సూచిస్తుంది.

ఇదేమీ జీవిత లక్ష్యం కాదు..

సమాజం ఎప్పుడూ పక్కనునోళ్ల వైపు వేలెత్తి చూపడం సాధారణం. ముఖ్యంగా స్త్రీలపై.. ఒక నిర్దిష్ట వయస్సులో వివాహం చేసుకోవాలనే ఒత్తిడిని పెంచుతుంది. వయసుకొచ్చాక కూడా పెళ్లి కాలేదంటే ఇక వయసు పెరుగుతున్న కొద్దీ ఇక పెళ్లి కాదనే ముద్ర వేస్తుంది. ఈ భయంతో కొందరు గంతకు తగ్గ బొంత అన్నట్లుగా సర్దుకుపోతారు. ఈ సామాజిక నిర్మాణం సాంప్రదాయాలు, కుటుంబ అంచనాలు, సాంస్కృతిక నిబంధనల నుంచి వస్తుంది. వివాహాన్ని ఒక నిర్దిష్ట సమయంలో సాధించాల్సిన లక్ష్యంగా చిత్రీకరిస్తాయి. అయితే అధ్యయనాలు మాత్రం నూరేళ్ల బంధం అని పిలువబడే పెళ్లి బంధంలో సంతృప్తి వయస్సుతో సంబంధం కలిగి ఉండదని.. అనుకూలత, భావోద్వేగ పరిపక్వత, విలువలతో ముడిపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. పెద్దలు అన్నట్లుగా జీవిత లక్ష్యం అస్సలు కాదని సూచిస్తున్నాయి.

రాంగ్ పర్సన్‌ ఎంట్రీ..

జర్నల్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీలో ప్రచురితమైన 2018 అధ్యయనం ప్రకారం... జీవన లక్ష్యాలు, విలువలు, వివాదాల పరిష్కార నైపుణ్యాలలో అనుకూలత ఉన్న జంటలు.. వివాహ వయస్సుతో సంబంధం లేకుండా ఎక్కువ సంతృప్తిని కలిగి ఉన్నారు. ఈ ఒత్తిడి స్త్రీలను మాత్రమే కాకుండా పురుషులను కూడా ప్రభావితం చేస్తుంది.. కానీ స్త్రీలపై ఈ సొసైటీ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సంతానోత్పత్తి సంబంధిత ఆందోళనలు, పిల్లలు పుడుతారో లేదో అనే బాధ, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన, జీవసంబంధమైన గడియారం గురించిన సాంస్కృతిక ఆలోచనలు ఇందుకు కారణం. ఈ ఒత్తిడి వ్యక్తులను తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి దారితీస్తుంది. ఇవన్నీ రాంగ్ పర్సన్‌ను ఎంచుకునేందుకు దారితీయవచ్చు. ఫలితంగా భావోద్వేగ ఒత్తిడి, సంబంధాలలో అసంతృప్తి, విడాకులు, దీర్ఘకాలిక పశ్చాత్తాపం వంటివి ఎదురవుతాయి.

అంత స్పీడ్ ఎందుకు?

ఈ సమస్యను లోతుగా పరిశీలిస్తే.. వివాహానికి సంబంధించిన సమయ ఒత్తిడి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని హరిస్తుంది. భాగస్వామి ఎంపికలో నాణ్యత కంటే వేగాన్ని ప్రాధాన్యతగా మారుస్తుంది. పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ బులెటిన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. భావోద్వేగ పరిపక్వత, స్వీయ అవగాహన ఎక్కువగా ఉన్న వ్యక్తులు స్థిరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని నిర్మించే అవకాశం ఎక్కువగా ఉంది. యుక్త వయస్సులో ఉన్నా.. మధ్య వయస్సులో ఉన్నా పార్ట్‌నర్ విషయంలో బెస్ట్ డెసిషన్ తీసుకోగలరు. ముఖ్యంగా వివాహం చేసుకోవడానికి ఆలస్యం చేసే వ్యక్తులు తరచూ ఎక్కువ ఆర్థిక స్థిరత్వం, వృత్తిపరమైన విజయం, వ్యక్తిగత గుర్తింపును సాధిస్తారు. ఇవన్నీ పెళ్లి జీవితంలో సంతృప్తిని మరింత పెంచుతాయి.

మీ భవిష్యత్ మీ చేతుల్లోనే..

యునైటెడ్ స్టేట్స్‌లో నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం 30 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకున్న జంటలలో విడాకుల రేటు తక్కువగా ఉంది. ఎక్కువ అనుభవం, జీవన లక్ష్యాలలో స్పష్టత కలిగి ఉండటమే ఇందుకు కారణం. ఒత్తిడి వల్ల తొందరపాటు వివాహాలు జరిగినప్పుడు.. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ లేక.. ఎమోషనల్‌గా అన్నింటికి సిద్ధంగా లేకపోవడం వల్ల సంబంధాలు బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి ఎప్పుడు వివాహం చేసుకోవాలనే దాని కంటే ఎవరిని వివాహం చేసుకోవాలనే దానిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు చూజ్ చేసుకునే వ్యక్తి మీ భవిష్యత్ ఆనందం, వ్యక్తిగత వృద్ధిని నేరుగా ప్రభావితం చేయగలరు. వివాహం అనేది ఒక గడువు కాదు.. ఈలోపే చేసుకోవాలనే గీత కూడా కాదు.. అర్థవంతమైన భాగస్వామ్యం కోసం చేసే ఎంపికగా మారాలని సూచిస్తున్నారు నిపుణులు.

Next Story