రూ. 300తో ఇంటినుంచి వెళ్లిపోయింది.. కట్ చేస్తే.. వందకోట్ల యజమాని!!

by Javid Pasha |

రూబన్స్ యాక్సెసరీస్‌తో రెండవసారి ప్రారంభమైన చినుకళ కెరీర్ జర్నీ ఆమెను భారత దేశంలో ఫేమస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిలిపింది.

రూ. 300తో ఇంటినుంచి వెళ్లిపోయింది.. కట్ చేస్తే.. వందకోట్ల యజమాని!!
X

దిశ, ఫీచర్స్ : కృష్టి, పట్టుదల, నిరంతర ప్రయత్నం ఉండాలే గానీ.. ఏదో ఒక రోజు అవి మిమ్మల్ని ఉన్నతశిఖారాలకు చేరుస్తాయంటారు నిపుణులు. ఒక సాధారణ మహిళ అయిన చినుకళ (Chinu Kala) జీవితంలోనూ సరిగ్గా అదే జరిగింది. కనీసం మూడుపూటలా భోజనం చేయలేని నిరుపేద కుటుంబం ఆమెది. కాగా తన 15 ఏళ్ల వయసులో ఏదైనా ఉపాధి వెతుక్కుందామని, కేవలం రూ. 300 తీసుకొని ఇటి నుంచి బయలు దేరింది. కట్‌చేస్తే ఇప్పుడామె సంపాదిస్తున్న వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లు. ఇంతకీ ఎలా సాధ్యమైంది? ఆమె సక్సెస్ జర్నీ ఎలా కొనసాగింది? చూద్దాం పదండి!

రైల్వే స్టేషన్‌లో నిద్రించి..

మహారాష్ట్రలోని ఓ చిన్న పల్లెటూరిలో జన్మించింది చినుకళ. ఆమె కుటుంబ పేదరికంతో ఎన్నో కష్టాలను అనుభవించింది. తల్లిదండ్రులకు చదివించే స్థోమత కూడా లేకపోవడంతో పదో తరగతి మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అలా ఒకరోజు తన ఫ్యామిలీ అనుభవిస్తున్న ఆర్థిక సమస్యలు చూసి చలించిపోయింది చినుకళ. తమ కుటుంబమంతా సంతోషంగా బతకాలంటే ఏదో ఒకటి చేయాలని భావించింది. ఒక రోజు రూ. 300 తీసుకొని ఏదైనా పని వెతుక్కుందామని ఇంటి నుంచి ముంబై బయలు దేరింది. అక్కడికి వెళ్లాక ఏం చేయాలో, ఎక్కడికి వెళ్లాలో తోచక రైల్వేస్టేషన్‌లోనే ఉండిపోయింది. తర్వాత ఒక రోజు రూ. 25 చెల్లించి డార్మిటరీలో బస చేసింది. తర్వాత ఒక చిన్నపాటి మార్కెటింగ్ ఏజెన్సీలో సేల్స్ గర్ల్‌గా ఉద్యోగం చూసుకుంది. అక్కడ యాజమాన్యం అప్పగించిన వస్తువలను డోర్ టు డోర్ సేల్ చేయడమే ఆమె పని.

రూ. 3 లక్షలతో మరోసారి..

అసలే అమ్మాయి. పైగా చిన్న వయసు కావడం వల్ల చినుకళ సేల్స్ జాబ్‌లో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కానీ ఆమె తన కుటుంబ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని కష్టమనిపించినా తన ఉద్యోగం కొనసాగించింది. అలా మొదలైన ఆమె జీవితం 2002లో ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఎందుకంటే ఆమెకు ‘టాటా కమ్యూనికేషన్స్’లో మరో జాబ్ ఆఫర్ వచ్చింది. అందులో చేరి కెరీర్ పట్ల బాగా ఫోకస్ చేసిన ఆమె. ఆ తర్వాత మోడలింగ్, జ్యువెలరీస్‌పై ఆసక్తి పెంచుకొని ఆ రంగాల్లో ఉపాధి క్రియేట్ చేసుకోవాలని భావించింది. ఇంకేముంది 2014లో రూ. 3 లక్షలు పెట్టుబడి పెట్టి, బెంగుళూరులో 36 అడుగుల చిన్న కియోస్క్‌తో రూబన్స్ యాక్సెసరీస్‌ను ప్రారంభించింది. ఇది ఆమెకు బాగా కలిసి వచ్చింది. రోజు రోజుకూ ఆదరణ పెరిగడంతో నమ్మకమైన, నాణ్యమైన జ్యువెలరీ బ్రాండ్‌గా ప్రసిద్ధి చెందింది.

ఫేమస్ ఎంటర్ ప్రెన్యూర్‌గా

రూబన్స్ యాక్సెసరీస్‌తో రెండవసారి ప్రారంభమైన చినుకళ కెరీర్ జర్నీ ఆమెను భారత దేశంలో ఫేమస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిలిపింది. ఊహించని రీతిలో సక్సెస్ వైపు దూసుకెళ్లింది. ప్రస్తుతం రూ.100 కోట్లకు పైగా టర్నోవర్ సాధిస్తున్న విలువైన జ్యువెలరీ బ్రాండ్‌గా నిలిచింది. అంతేకాకుండా మైట్రాలో బెస్ట్‌సెల్లర్, షార్క్ ట్యాంక్ ఇండియాలో ఫీచర్ అయి ఫండింగ్ సాధించింది. 75% సేల్స్ ఆన్‌లైన్ ఆర్డర్లద్వారానే వస్తున్నాయి. చినుకళ వయసు ఇప్పుడు 44 ఏళ్లు, ఆమె నెటవర్త్ మొత్తం రూ. 40 కోట్లకు పైగానే ఉంది. కాగా ఆమె లైఫ్ జర్నీ, ఆమె సాధించిన విజయం నేటి యువతకు, ముఖ్యంగా ఆధునిక మహిళలకు ఎంతో స్ఫూర్తిగా, ప్రేరణగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Next Story