- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్ట్రీట్ లైట్లకు బదులుగా గ్లోయింగ్ ప్లాంట్స్..! బయో టెక్నాలజీలో అద్భుతం
చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన గ్లోయింగ్ ప్లాంట్స్‌లో రసాయనిక చర్యలు జరిగి, సహజంగానే తమంతట తాము వెలుగుతూ వెలుతురునిస్తాయి.

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతికత అద్భుతాలు చేస్తోంది. ఇప్పటికే బయోటెక్నాలజీ రంగంలోనూ ఇది విస్తరిస్తోంది. అయితే రీసెంట్‌గా చైనీస్ శాస్త్రవేత్తలు ఫైర్ ఫ్లైస్ (మిణుగురు పురుగులు) డీఎన్ఏను ఉపయోగించి సరికొత్త గ్లోయింగ్ ప్లాంట్స్‌ను డెవలప్ చేశారు. వీధుల్లో విద్యుత్ దీపాలకు ప్రత్యామ్నాయంగా వెలుతురును విరజిమ్మే సాంకేతిక పరిశోధనల్లో భాగంగా వీటిని అభివృద్ధి చేశారు.
చెట్లు ఎందుకు వెలుతురునిస్తాయి?
చైనాలోని మ్యాజిక్‌పెన్ బయో (Magicpen Bio) అనే కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన గ్లోయింగ్ ప్లాంట్స్‌లో రసాయనిక చర్యలు జరిగి సహజంగానే తమంతట తాము వెలుగుతాయి. ఎందుకంటే.. బయోల్యూమినెసెన్స్ అనే ప్రక్రియ ద్వారా వీటిని క్రియేట్ చేశారు. ఇందులో భాగంగా ఫైర్ ఫ్లైస్ నుంచి, ఇతర ప్రకాశించే జీవుల (శిలీంధ్రాలు) నుంచి జన్యువులను మొక్కల్లోకి చేర్చారు. కాగా ఇవి ఎలక్ట్రిసిటీ లేదా బ్యాటరీలు అవసరం లేకుండా కాంతినివ్వడం ద్వారా భవిష్యత్తులో స్ట్రీట్‌లైట్స్ అవసరం లేకుండానే, కేవలం చెట్ల ద్వారా మాత్రమే వెలుతురును పొందే అవకాశం ఏర్పడనుందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఆర్కిడ్స్, సన్‌ఫ్లవర్స్, క్రిసాన్తమమ్స్ వంటి మొక్కలు సహజంగానే వెలుతురునిస్తాయి.
మొక్కలు నాటితే చాలు..
ప్రస్తుతం ఈ మొక్కలు వెలుగుతున్నప్పటికీ, వాటి నుంచి వెలువడే కాంతి చాలా తక్కువగా ఉంటున్నది. ఇంకా పూర్తిస్థాయిలో రోడ్లు, వీధి దీపాలు లేదా నగరాల్లో వీధి లైట్లకు బదులుగా కేవలం ఈ మొక్కలు లేదా చెట్లను మాత్రమే ఉపయోగించే పరిస్థితి ఇప్పటికిప్పుడు లేదు. అయినప్పటికీ ఈ పరిశోధన చాలా ఆసక్తికరమైందని, భవిష్యత్తులో మరింత ప్రకాశవంతమైన మొక్కలను తయారు చేయడం ద్వారా వీధి దీపాలకు ప్రత్యామ్నాయంగా అనేకచోట్ల కేవలం మొక్కలను మాత్రమే నాటితే సరిపోవచ్చునని సాంకేతిక నిపుణులు అంటున్నారు. పైగా ఇవి పర్యావరణానికి అనుకూలమైన లైటింగ్ వ్యవస్థలుగా ఉంటాయి. అంతేకాకుండా జన్యు ఇంజనీరింగ్ ద్వారా వేర్వేరు జీవుల లక్షణాలను కలిపి కొత్త అవకాశాలు సృష్టించడానికి ఇది చక్కటి ఉదాహరణ. సస్టైనబుల్ టెక్నాలజీ రంగంలో గొప్ప మైలు రాయి. చూడాలి. భవిష్యత్తులో ఈ బయోటెక్నాలజీ ప్రయోగం ఏ మలుపు తిరగనుందో!






