నాన్నతో కలిసి డిన్నర్ చేయడం.. పిల్లల చదువు, భవిష్యత్తును మార్చేస్తుందా?

by Javid Pasha |   (  Updated:2026-01-29 16:03:19  IST  )

నాన్నతో కలిసి కనీసం వారానికి నాలుగుసార్లు డిన్నర్ చేసే పిల్లలు మెరుగైన అకడమిక్ స్కిల్స్ కలిగి ఉంటారని తాజా అధ్యయనం పేర్కొన్నది.

నాన్నతో కలిసి డిన్నర్ చేయడం.. పిల్లల చదువు, భవిష్యత్తును మార్చేస్తుందా?
X

దిశ, ఫీచర్స్ : పేరెంట్స్‌కు పిల్లలపై ఉండే ప్రేమ ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఏం చేసినా పిల్లల ఆనందం కోసం, ఆరోగ్యం కోసం, వారి క్షేమం కోసం, మెరుగైన భవిష్యత్తుకోసం చేస్తుంటారు. ఎన్ని కష్టాలకైనా ఎదురొడ్డి పిల్లలే సర్వస్వంగా బతికేస్తుంటారు. అయితే ఇటీవల ఫ్లోరిడా యూనివర్సిటీ (University of Florida) నిర్వహించిన తాజా అధ్యయనం మాత్రం మరో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఏంటంటే.. తండ్రితో కలిసి డిన్నర్ చేసే పిల్లలు అకడమిక్‌గా మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఎక్కువ. చదువులో, పలు ఇతర విషయాల్లో మంచి సామర్థ్యాన్ని కనబరుస్తారు. ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉంటారు.

భాషా నైపుణ్యాలు కూడా..

నాన్నతో కలిసి తరచుగా లేదా కనీసం వారానికి నాలుగుసార్లు రాత్రి భోజనం చేసే పిల్లల్లో, అలా చేయనివారితో పోలిస్తే మెరుగైన అకడమిక్ తెలివితేటలు ఉంటాయని అధ్యయనం పేర్కొన్నది. అయితే ఇది గ్రేడ్స్‌తో సంబంధం లేకుండా కాగ్నిటివ్ అండ్ ఎమోషనల్ డెవలప్ మెంట్‌కు సంబంధించినదని నిపుణులు పేర్కొంటున్నారు. నాన్నతో కలిసి డిన్నర్ చేసే అలవాటు పిల్లల్లో మెరుగైన వోకాబ్యులరీ, భావోద్వేగ నియంత్రణ (emotional regulation) సామర్థ్యాలను పెంచుతుంది. ప్రవర్తనా పరమైన లోపాలను నివారిస్తుంది. అంతేకాకుండా డిన్నర్ చేసే సమయంలో సంభాషణలు పిల్లల భాషా నైపుణ్యాలను పెంచుతాయి. రీడింగ్, మ్యాథ్, సైన్స్‌లలో మెరుగైన సామర్థ్యాన్ని కనబర్చడంలోనూ ఇది పరోక్షంగా మేలు చేస్తున్నదని అధ్యయం స్పష్టం చేసింది.

కారణమిదే..

ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (UF/IFAS EDIS) ద్వారా వెలువడిన అధ్యయనాలు కూడా ఫ్యామిలీ మీల్స్‌ లేదా ఫ్యామిలీ డిన్నర్లు పిల్లల అకడమిక్ పనితీరును మెరుగు పరుస్తాయని, హోమ్‌వర్క్‌పై ఫోకస్, రీడింగ్ ఇంట్రెస్ట్‌ను పెంచుతాయని చెబుతున్నాయి. ముఖ్యంగా తండ్రి సమక్షంలో ఉండటం, మాట్లాడటం, మోటివేషన్ పొందడం వంటివి పిల్లల భావోద్వేగ అభివృద్ధిలో కీ రోల్ పోషిస్తాయి. ఇది వారి అకడమిక్ ప్రతిభకు, భావోద్వేగ స్థిరత్వానికి, మానసిక వికాసానికి సహాయపడుతుంది. అయితే అధ్యయనం కేవలం తండ్రితో కలిసి డిన్నర్ చేసే సంతానంపై ఫోకస్ చేసింది. కానీ తల్లి సమక్షంలో లేదా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరి సమక్షంలో కలిసి డిన్నర్ చేయడం కూడా పిల్లల్లో మెరుగైన భావోద్వేగ సామర్థ్యాన్ని, తెలివితేటలను పెంచుతాయని నిపుణులు అంటున్నారు.

Read More.. వావ్.. ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ వాకింగ్ చేస్తే ఇన్ని ప్రయోజనాలా?

Next Story