- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేసవంటే మాకు మామిడి పండ్లే!
మామిడి - పండు తింటుంటే రసం మూతి, చేతులకంటేది.. అమ్మ తిడితే.. నాన్న వెనకేసుకొచ్చేటోడు.. ఆ స్వీట్ మొమొరీస్ గుర్తొస్తే నోరూరుతుంది.. అట్ల చిన్న పిల్లాడిలా మళ్లీ తినాలనిపిస్తుంది..

దిశ, ఫీచర్స్ : ఇప్పుడంటే.. ఎప్పుడంటే అప్పుడు మామిడి పండ్లు దొరుకుతున్నాయి. కానీ ఒకప్పుడు మామిడి పండ్లు ఎండా కాలంలో మాత్రమే ఉండేవి. ఇప్పటిలా హైబ్రీడ్ లేకపోయేది. సహజ సిద్ధంగా కాసిన పండ్లే అన్నీ. మావిండ్లు అని ప్రత్యేకంగా ఉండేవి. పిల్లలు ఈ మావిండ్లళ్ల దొంగచాటున పండ్ల కోసం స్కూలు ఎగ్గొట్టి పోయేది.
మామిడి జుర్రుతుంటే..
చిన్నప్పుడు సాయంత్రం భోజనం అయిపోగానే అమ్మ, నాన్న, అన్న, నేను, చెల్లె ఇంటి ముందు ఆవరణలో కూర్చునేవాళ్లం. తోట నుంచి నుంచి తెచ్చిన మామిడి పండ్లు ఒక పెద్ద బుట్టలో ఉండేవి. ఒక్కొక్కరం ఒక్కొక్కటి తీసుకొని మంచిగా కడుక్కొని తినేవాళ్లం. పండ్లు తినేటప్పుడు ఎవరూ మాట్లాడకపోయేది. ఎందుకంటే ముచ్చట పెడితే వెనకబడి పోతామనే ఫీలింగ్ ఉండేది. పండ్లు తింటుంటే రసం మొత్తం మూతికి, చేతులకు అంటేది. మామిడి పండ్లు జుర్రుతుంటే అది నోరువెంట కారేది. ఆ క్షణాలు మాకు కేవలం మామిడి పండ్లు తినడమే కాదు.. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే ఒక ఆచారంగా అనిపించేది.
మళ్లీ చేసుకోవాలనిపిస్తోంది..
మామిడి పండు కొరకగానే రసమంతా చేతులు, నోటి చుట్టూ కారుతుంటే మా అమ్మ ఒక్క తీరుగా మొత్తుకునేది. ‘ఏం తినుడదీ.. గట్లనేనా తినేది. బట్టలమీద.. మూతికి.. చేతులకు మొత్తం ఒసరు కారుతుంది. ముందు నువ్వయితే పొయ్యి ఆ చేతులు కడుక్కోపోరా.. ఇంటికి ఎవరైనా వస్తే ఇజ్జతివోతది’ అని గట్టిగా అరుస్తూ చెప్పేది. ‘పోని తియ్.. పోరగాళ్లకేం తెలుసు. తిను బిడ్డ అమ్మ అట్లనే అంటదిగానీ నువ్వయితే తిను’ అని నాన్న వెనకేసుకొచ్చేది. ఆ సమయంలో మేము ఒకరినొకరు చూసుకొని నవ్వుకునేవాళ్లం. ఆ రసాలు మా బాల్యానికి చిహ్నంగా మారాయి. ఇప్పుడు మా పిల్లలు మామిడి పండ్లు తింటుంటే ఆ స్వీట్ మెమొరీస్ గుర్తుకొచ్చి ఆ సరదాలను మళ్లీ చేసుకోవాలనిపిస్తుంది.
అన్నీ మరచిపోయి..
మామిడి పండ్లు తినడం నిజంగా అదొక ఆట.. ఒక సరదా. నాన్న ‘పండ్లు బాగున్నయా’ అని అడిగితే.. ‘నాది సూపర్ నాన్నా’ అని అందరికంటే ముందు నేనే అనేవాడిని. ‘నాదైతే ఇంకా సూపర్ ఉంది తెల్సా’ అని మా చెల్లె అనేది. ఇలా పోటీలు పడుతూ ఒంటిమీద మామిడి పండ్ల ఒసరు కారకుండా తినడానికి ప్రయత్నించేవాళ్లం. కానీ అది జరగకపోయేది. వెంటనే అమ్మ ముఖం చూసేవాళ్లం. మమ్మల్ని.. మా ముఖాల్లోని భయాలను చూసి అమ్మానాన్న ఒకరినొకరు చూస్తూ నవ్వుకునేవాళ్లు. వాళ్లను చూసి మేమూ నవ్వేవాళ్లం. ఆ ఆనందాల మధ్య మేం పాఠశాల ఒత్తిడి, ఇంటి పనులు, రోజువారీ బాధలు అన్నీ మరచిపోయి సంతోషంగా గడిపేవాళ్లం.
ఆ క్షణాలు గుర్తుకొస్తే..
వేసవంటే మాకు మామిడి పండ్లే. ఎండలు మండుతున్నా.. ఎంత ఇబ్బందిగా ఉన్నా.. మామిడి పండ్లనైతే మరవకపోతుంటిమి. అవి కనిపించగానే నోరూరేది. మార్కెట్లో బంగినపల్లి, పేడిమామిడి, రసాలు, తోతాపరి వంటి రకాలుండేవి. ప్రతి మామిడితో ఒక్కొక్క జ్ఞాపకం ఉంది. వేసవి సెలవులొచ్చి పాఠశాల మూతబడితే మా సరదా మామిడి పండ్లతోనే కొనసాగేది. ఇప్పుడు పెద్దవాళ్లమైనా.. ఆ రోజుల్లోని మామిడి సాయంత్రాలు గుర్తు వచ్చినప్పుడల్లా నోరు ఊరుతుంది. మార్కెట్‌లో మామిడి పండ్లు చూస్తే ఆ చిన్నప్పటి నవ్వులు.. కుటుంబం కలిసి కూర్చున్న ఆ క్షణాలు గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు కుటుంబం చెదిరిపోయింది. ప్రతి ఒక్కరు తన పనుల్లో మునిగిపోయాం. కానీ ఆ సరదా జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.
- వెంకటరమణ, ఉపాధ్యాయుడు, మేడ్చల్






