ఉస్సేన్ బోల్ట్ ఆఫ్ యానిమల్స్.. భూప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జీవి

by Disha Web Desk 7 |
ఉస్సేన్ బోల్ట్ ఆఫ్ యానిమల్స్.. భూప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జీవి
X

దిశ, ఫీచర్స్ : భూ ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు 'చిరుత'. అసాధారణ వేగానికి ప్రసిద్ధి చెందిన ఈ యానిమల్ స్పోర్ట్స్ కారును కూడా సిగ్గుపడేలా చేస్తుందంటే అతిశయోక్తి కాదు. భారత్‌లో అంతరించిన ఈ చిరుతలు మళ్లీ తిరిగొచ్చాయి. గ్వాలియర్‌, సియోపూర్‌లోని కున్నో నేషనల్ పార్క్‌లో వీటి కోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణుల బదిలీ ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం ఎనిమిది చిరుతలను నమీబియాలోని సవన్నాస్ నుంచి ఇక్కడికి తరలించారు. ప్రధాని నరేంద్ర మోడీ తన పుట్టినరోజున వీటిని భారతీయ వన్యప్రాణులకు పరిచయం చేయగా.. ఈ నేలపై కొత్త జీవితాన్ని ప్రారంభించిన ప్రత్యేక జంతు జాతి గురించిన మరింత సమాచారం..

ప్రత్యేకంగా అనుకూలీకరించిన B747 జంబో జెట్ విమానంలో ఈ బిగ్ క్యాట్స్‌ను గ్వాలియర్‌కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF)‌కు చెందిన చినూక్ హెలికాప్టర్స్‌.. కున్నో నేషనల్ పార్క్‌లోని వాటి కొత్త ఆవాసానికి తరలించాయి. ఎనిమిది చిరుతల్లో ఐదు ఆడ, మూడు మగ కాగా.. ఆడ చిరుతలు 2 నుంచి 5 ఏళ్ల వయసు కలిగి ఉండగా, మగ చిరుతలు 4.5 నుంచి 5.5 ఏళ్ల వయసు గలవి.

జంతుజాతిలో ఉస్సేన్ బోల్ట్ :

చిరుత శాస్త్రీయ నామం అసినోనిక్స్ జుబాటస్. భూప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఈ జంతువు మూడు సెకన్ల వ్యవధిలో సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అయితే ఆ వేగానికి పరిమితులు ఉన్నాయి. నేషనల్ జియోగ్రఫీ ప్రకారం.. ఇవి కేవలం 30 సెకన్ల పాటు అద్భుతమైన వేగాన్ని కొనసాగించగలవు. అయితే వేటాడే క్రమంలో లక్ష్యంగా చేసుకున్న జీవిని మట్టుపెట్టేందుకు ఈ వేగం సరిపోతుంది. వీటికి గల ప్రత్యేకమైన నిర్మాణాత్మక అనుసరణలు సర్క్యూట్‌లో వాటి పేస్‌కు అదనపు ప్రయోజనాన్ని జోడిస్తాయి. ఇక పులి లేదా జాగ్వార్‌తో పోల్చితే.. చిరుతలకు ఫ్లెక్సిబుల్ వెన్నెముకపై చిన్న కాలర్‌బోన్, తుంటి ఉంటుంది. విస్తరించబడిన రెటీనా ఫోవా.. షార్ప్ విజన్‌ను అందించి వేగం, సమయ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది.

మభ్యపెట్టడంలో టాప్ స్కిల్స్ :

స్మిత్‌సోనియన్స్ నేషనల్ జూ అండ్ కన్జర్వేషన్ బయాలజీ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.. చిరుతలు సన్నని, పొడవాటి కాళ్లు కలిగిన శరీరాలతో పాక్షికంగా ముడుచుకునే పంజాలను కలిగిఉంటాయి. ఎదిగిన చిరుతలు పసుపు లేదా లేత గోధుమరంగులో పొట్టి, ముతక బొచ్చుతో పాటు ఒంటిపై ముదురు నలుపు రంగులో గుండ్రని లేదా ఓవల్ మచ్చలతో కనిపిస్తాయి. ఇక తోక నాలుగు నుంచి ఆరు నల్లని వలయాలతో గుబురుగా ఉండే తెలుపు లేదా నలుపు రంగుతో విభిన్నంగా ఉంటుంది. ఈ విశిష్టమైన నమూనాలు సవన్నాస్(గడ్డి మైదానాలు)కు అనుకూలతను కలిగిస్తాయి. ప్రత్యేక బొచ్చు కారణంగా ఇవి పర్యావరణంలో కలిసిపోయి వేటలో ఇతర జీవులను సులభంగా మభ్యపెట్టగలవు. కానీ ఫైటింగ్ విషయంలో కొన్ని బలహీనతలున్నాయి. పులులు లేదా సింహాలతో పోలిస్తే దీనికి పెద్ద దంతాలు లేవు. ఈ లోపం సొంత జాతిలోనే దాన్ని వీక్ ఫైటర్‌గా చేస్తుంది.


సహజ నివాసం

ఈ చిరుతల సహజ నివాసాలు ఉత్తర ఆఫ్రికా, సాహెల్‌తో పాటు తూర్పు, దక్షిణాఫ్రికాలో కనిపిస్తాయి. ఇవి అనేక రకాల ఆవాసాల్లో జీవించగలవు కానీ బహిరంగ గడ్డి భూముల్లోనే ఎక్కువగా వృద్ధి చెందుతాయి. నమీబియాలో అయతే ఈ జంతువులు సవన్నా(గడ్డి భూములు), దట్టమైన వృక్షాలు, పర్వత భూభాగాల్లో నివసిస్తున్నట్లు కనుగొన్నారు. ఒకప్పుడు భారత్‌లోనూ సంచరించిన ఈ జీవులు 1950ల ప్రారంభం నుంచి అంతరించిపోయాయి. ఈ మేరకు దాదాపు 13 దేశాలు ఈ జాతులు అంతరించిపోతున్నట్లు నివేదించాయి. మాంసాహారులైన చిరుతలు తెల్లవారుజామున, మధ్యాహ్న వేటలో ప్రత్యేకత కలిగి ఉంటాయి. స్మిత్సోనియన్స్ నేషనల్ జూ అండ్ కన్జర్వేషన్ బయాలజీ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.. ఈ జంతువులు హార్టెబీస్ట్, ఓరిక్స్, రోన్, సేబుల్ కాకుండా స్ప్రింగ్‌బాక్, స్టీన్‌బాక్, డ్యూకర్స్, ఇంపాలా, గజెల్స్‌ను వేటాడతాయి.

టైగర్స్, జాగ్వార్స్, కౌగర్స్ కంటే భిన్నమైనవి :

వేగం విషయానికొస్తే చిరుతలకు సమీప ప్రత్యర్థి జాగ్వార్(మచ్చల చిరుత). ఇది గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. సాధారణంగా చిరుతలు ఆఫ్రికన్ సవన్నాస్‌లో కనిపిస్తుండగా.. జాగ్వార్లు ఎక్కువగా సరస్సులు, నదులు, లోతట్టు చిత్తడి నేలలకు దగ్గరగా ఉష్ణమండల లోతట్టు ఆవాసాల్లో నివసిస్తాయి. వీటిని నైరుతి అమెరికా నుంచి అర్జెంటీనాలోని గడ్డి భూముల వరకు చూడవచ్చు. ఇక జాగ్వార్లు లేని చోట పులికి ప్రయోజనం ఉంటుంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే పులులు జంతువులను వేటాడటంలో అత్యంత నైపుణ్యం ప్రదర్శిస్తాయి. అద్భుతమైన దృష్టి, వినికిడి సామర్థ్యాలను కలిగి ఉండే పులులు భారతదేశం, రష్యా, ఇండోనేషియాలో కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇవి అంతరించిపోతున్నప్పటికీ భారతదేశంలో మాత్రం వాటి జనాభా గణనీయంగా పెరిగింది. క్యాట్ జాతికి చెందిన మరో జంతువు కౌగర్. దీని శాస్త్రీయ నామం 'Puma concolor'. పర్వత భూభాగంలో నివసించే ఈ ప్రెడేటర్ గంటకు 80 కి.మీ వేగంతో ట్రెక్కింగ్ చేయగలదు. ఫ్లోరిడా చిత్తడి నేలలు, కెనడియన్ అడవులకే పరిమితమైన ఈ కౌగర్లు ఒంటరి జంతువులు. తమ సమూహ జీవులతో మంచి సంబంధాలు కలిగి ఉండవు. పిల్లల సంరక్షణలోనూ ఎలాంటి పాత్ర పోషించవు.

బ్రేవ్ స్పైడర్ మ్యాన్.. 48 అంతస్తుల ఆకాశ హర్మ్యాన్ని సేఫ్టీ లేకుండా..



Next Story

Most Viewed