నేవీలో ఫస్ట్ ఉమన్ ఫైటర్.. పైలట్ ఆస్థా పూనియా

by Daayi Srishailam |   (  Updated:2025-07-16 15:29:35  IST  )

ఆ కలే ఆమెను ఇండియన్ నేవీలో ఫస్ట్ ఉమన్ ఫైటర్ పైలట్‌గా నిలబెట్టింది.

నేవీలో ఫస్ట్ ఉమన్ ఫైటర్.. పైలట్ ఆస్థా పూనియా
X

దిశ, ఫీచర్స్: ఉత్తరప్రదేశ్‌లోని ఎటువంటి వైమానిక స్థావరం లేని ప్రాంతంలో జన్మించిన ఆస్థా పూనియా.. ఆకాశంలో విమానాలు ఎగురుతుంటే ఆనందంతో బయటకు పరుగెత్తేది. ఆ క్షణాలు ఆమెలో ఒక గొప్ప కలను నాటాయి. ఆ కలే ఆమెను ఇండియన్ నేవీలో ఫస్ట్ ఉమన్ ఫైటర్ పైలట్‌గా నిలబెట్టింది.

బ్రేక్ చేసింది

2025 జూలై 3న 24 ఏళ్ల సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియా ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ ను సాధించి భారత నౌకాదళ చరిత్రలో మొదటి మహిళా ఫైటర్ పైలట్‌గా నిలిచింది. ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య వంటి విమాన వాహక నౌకల నుంచి ఎగిరే అత్యాధునిక మిగ్-29కె యుద్ధ విమానాలను నడపడానికి సిద్ధంగా ఉంది. ఈ విజయం ఆమె వ్యక్తిగతమైంది కాదు. భారత నౌకాదళంలో లింగ వివక్ష అడ్డంకులను ఛేదించిన ఒక చారిత్రక సంఘటనగా చెప్పుకోవచ్చు. దశాబ్దాలుగా భారత సైన్యంలో మహిళలకు నిషేధమున్న యుద్ధ పాత్రలను బ్రేక్ చేసి ఫైటర్ పైలట్‌గా కొత్త మార్గాన్ని చూపించింది.

కఠోర సాధన

ఫైటర్ పైలట్ కావడమంటే కేవలం విమానం నడపడమే కాదు. ఇందుకు కఠినమైన శిక్షణ, శారీరక దృఢత్వం, మానసిక సామర్థ్యం, తక్షణ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అవసరం. ఆస్థా ఈ సవాళ్లన్నింటినీ ఎదుర్కొని విజయం సాధించింది. ఫైటర్ పైలట్‌గా మారడానికి ముందు నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధి, శారీరక ఫిట్‌నెస్ డ్రిల్స్, నావికా క్రమశిక్షణ, సముద్ర ఆపరేషన్లు వంటివి నేర్చుకుంది. విశాఖపట్నంలోని ఐఎన్‌ఎస్ దేగా వద్ద రెండవ బేసిక్ హాక్ కన్వర్షన్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసింది. ఇది హాక్ 132 జెట్ ట్రైనర్ విమానంపై నిర్వహించబడుతుంది.

వింగ్స్ ఆఫ్ గోల్డ్

రెండవ బేసిక్ హాక్ కన్వర్షన్ కోర్సులో భాగంగా ఆస్థా.. అధునాతన విమాన చలనాలు, యుద్ధ సాంకేతికతల్లో నైపుణ్యం పొందింది. ఈ విజయంతో ఆమెకు ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ అవార్డు లభించింది. ఈ అవార్డు ఆస్థా ఫైటర్ పైలట్‌గా అధికారికంగా చేరినట్లు సూచిస్తుంది. గతంలో మహిళా అధికారులు హెలికాప్టర్లు, మారిటైమ్ రెకనైసెన్స్ విమానాలను నడిపేవారు. కానీ ఆస్థా ఫైటర్ స్ట్రీమ్‌ను ఎంచుకుంది. ఇది అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ స్ట్రీమ్‌లో భాగంగా మిగ్-29కె వంటి యుద్ధ విమానాలను నడుపుతారు. ఇవి విమాన వాహక నౌకల నుండి ఎగురుతాయి.

సాధారణ కుటుంబ నేపథ్యం..

ఆస్థా ఫైటర్ పైలట్ కావడం వల్ల ఒకవైపు తనలోని ప్రతిభ నిరూపిస్తే.. మరోవైపు మహిళలు కూడా పురుషులకు ధీటుగా శారీరక దృఢత్వం కలిగి ఉంటారనీ, మానసిక చురుకుదనం కలిగి ఉంటారనీ, ఒత్తిడిలో తక్షణ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటుందని, జి-ఫోర్స్ వాతావరణంలో పనిచేసే శక్తి కలిగి ఉంటారని నిరూపించింది. లింగ సమానత్వం, సమగ్రతలో గణనీయమైన పురోగతి సాధించింది. సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియా ఒక సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి జాతీయస్థాయిలో గౌరవించే స్థాయికి వెళ్లిందంటే యువతకు, మహిళలకు ఏ విధంగా స్ఫూర్తినిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

Next Story