- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్ద లింగమ్మ గెలుపు.. ఊపిరి పీల్చుకున్న అమరగిరి.!
అమరగిరి ఒకటి ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది

దిశ, ఫీచర్స్: గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా 2025వ సంవత్సరంలో ఒక బానిస విముక్తి పొందిన గ్రామం అమరగిరి. బాండెడ్ లేబర్ వ్యవస్థ గురించి తెలుసు కదా.? తాత అప్పు చేశాడని నాయినను.. నాయిన అప్పు తీర్చలేదని కొడుకును ఇలా కుటుంబాలకు కుటుంబాలనే ఏండ్లకొద్ది వెట్టి చాకిరీ చేయించుకునే విధానం ఇప్పటికీ అక్కడక్కడా సాగుతోంది. అలాంటి వాటిలో అమరగిరి ఒకటి. ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది.
అమరగిరి ఆనందం..
నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమరగిరి గ్రామంలో చెంచు తెగకు చెందిన 45 కుటుంబాలు ఉంటాయి. ఈ కుటుంబాలన్నీ బాండెడ్ లేబర్‌కు చెందినవే. అంటే రుణ బానిసత్వం అన్నమాట. పేదరికం.. కుల వ్యవస్థ.. చట్టాల అమలు లోపం వల్ల ఇలాంటి వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది. వ్యవసాయం.. ఇటుక బట్టలు.. రాళ్ల గనులు వంటి అసంఘటిత రంగాల్లో బానిసలుగా పనిచేస్తున్నారు. అలాంటి శ్రామిక సమూహం కనిపించే అమరగిరిలో ఇప్పుడు సంతోషాలు వెళ్లివిరుస్తున్నాయి. ఎందుకో తెలుసా.? ఆ ఊరి సర్పంచ్ ఇప్పుడు ఆ సమూహానికి చెందిన వ్యక్తే. ఆమె పేరే పెద్ద లింగమ్మ.
చారిత్రక విజయం..
పెద్దలింగమ్మ గెలుపు.. అమరగిరిలోని ఆ 45 కుటుంబాలకు స్వేచ్ఛ.. సాధికారతకు ప్రతీక. మూడు దశాబ్దాల బందీ బానిసత్వం తర్వాత ఇప్పుడు వాళ్లే గ్రామాన్ని పరిపాలిస్తున్నారు. పెద్ద లింగమ్మ సర్పంచ్ కావడందో అమరగిరి ఎప్పటిలా దుమ్ము ధూళితో కాదు ఆనందం.. స్వేచ్ఛ.. ఉత్సాహంతో నిండిపోయి నిండుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లు బానిసత్వంలో మగ్గిన మహిళలు చేతులు కలిపి నృత్యాలు చేస్తున్నారు. ఆనందంతో ఎగిరి గంతేస్తూ ఆనంద బాష్పాలు కారుస్తున్నారు. ఇన్నేండ్ల బానిసత్వం తర్వాత పెద్ద లింగమ్మ ఆ ఊరికి సర్పంచ్ అవడం నిజంగా ఆమెకు.. వాళ్ల సముదాయానికి ఇది చారిత్రక విజయంగా చెప్పొచ్చు.
దోపిడీ నీడలోనే బతికి..
సర్పంచ్ లింగమ్మతో పాటు 44 కుటుంబాలు మూడు దశాబ్దాల పాటు ఒక ప్రత్యేకమైన.. క్రూరమైన బందీ బానిసత్వంలో ఉన్నారు. స్థానిక వ్యాపారులు చేపల వ్యాపారాన్ని నియంత్రించి అప్పులు.. బలవంతంతో వీళ్లను శాశ్వత పేదరికంలో ముంచారు. మార్కెట్‌కు సరైన అవకాశం లేకుండా దారుణమైన దోపిడీకి గురై ఇన్నాళ్లూ దోపిడీ నీడలోనే బతికారు. 10 ఏళ్ల క్రితం ప్రభుత్వ విచారణలో మొత్తం గ్రామమే బందీ బానిసత్వంలో ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో 106 మందిని రక్షించి 65 విడుదల ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. బాధితులంతా కలిసి ''అమరగిరి రిలీజ్డ్ బాండెడ్ లేబరర్స్ అసోసియేషన్'' ఏర్పాటు చేశారు.
సముదాయ ధైర్యానికి గుర్తింపు..
విముక్తి సాధికారతకు మూలం అయింది. ప్రభుత్వ సహాయాలు పొంది చేపల ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించారు. ఇది వారి ఆర్థిక స్వాతంత్ర్యానికి బలమైన అడుగు అనుకోవచ్చు. ఇప్పుడిప్పుడే చేసిన కష్టం చేతికందుతున్న సమయంలో సర్పంచ్ ఎన్నికలొచ్చాయి. పేరుకు వాళ్ల కష్టం వాళ్లే పొందుతున్నా పాలనాధికారం ఇన్నాళ్లు వారి చేతుల్లో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఊరు ఊరంతా కలిసి పెద్ద లింగమ్మను సర్పంచ్‌గా నిలబెట్టి గెలిపించుకున్నారు. ఈ గెలుపు వ్యక్తిగత విజయం కాదు. సముదాయ ధైర్యానికి గుర్తింపు. ఒకప్పటి బాధితులు ఇప్పుడు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే నాయకత్వంలో ఉన్నారు.






