- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిర్‌పోర్టు లేకుండా.. నడిచే విమానం.. మన హైదరాబాద్‌లోనే..
నిలువుగా ఎక్కి నిలువుగా దిగగలిగే సామర్థ్యం.. పర్వతాలు, విపత్తు ప్రభావిత ప్రాంతాల్లోకి నేరుగా సరుకులు.. రక్షణ రంగం కోసం ప్రత్యేక వేరియంట్.. పైలట్ అవసరం లేకుండా సేవలు

దిశ, ఫీచర్స్: హైదరాబాద్‌కు చెందిన ‘బ్లూజ్ ఏరోస్పేస్’ స్టార్టప్ ఒక అద్భుతమైన విమానాన్ని రూపొందిస్తోంది. ఇది సాధారణ విమానం కాదు. నిలువుగా ఎగరగలిగే (వీటీఓఎల్) విమానం. ఎయిర్‌పోర్టు రన్‌వే లేకుండానే ఎక్కి దిగగలిగే ఈ విమానం ప్రధానంగా కార్గో లాజిస్టిక్స్ కోసం తయారవుతోంది.
సరుకు రవాణా..
బ్లూజ్ ఏరోస్పేస్‌ను మారుతి అమర్‌దీప్ శ్రీ వాత్సవాయ, ఉత్తమ్ కుమార్ ధర్మపురి అనే ఇద్దరు ఇంజనీర్లు స్థాపించారు. ఇద్దరికీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో 17-18 ఏళ్ల అనుభవం ఉంది. బోయింగ్, జనరల్ ఎలక్ట్రిక్, కాలిన్స్ ఏరోస్పేస్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీల్లో పని చేశారు. భారతదేశంలోని ప్రైవేట్ స్పేస్ స్టార్టప్‌లలో కూడా అనుభవం ఉంది. సాధారణ విమానాలు, రోడ్లు, ఎయిర్‌పోర్టులపై ఆధారపడకుండా సరుకు రవాణా చేయగలిగే వ్యవస్థను రూపొందించాలనేది వారి ఆలోచన. దీన్ని దృష్టిలో ఉంచుకొని సరిహద్దు ప్రాంతాల్లో ఉపయోగపడే స్టార్టప్ తీసుకొస్తున్నారు.
300 కిలోమీటర్లు..
బ్లూజ్ ఏరోస్పేస్ ముఖ్యంగా పర్వతాలు, రిమోట్ ఏరియాల్లో సరుకులు త్వరగా చేర్చడానికి ఉపయోగపడనుంది. రోడ్లు లేని, ఆపదలు ఎదురయ్యే ప్రాంతాల్లో కూడా సరఫరా సులభం చేయడమే దీని లక్ష్యం. 2022లో స్థాపించిన ఈ స్టార్టప్ ఇప్పటికే ప్రోటోటైప్‌ను విజయవంతంగా పరీక్షించింది. దీని ప్రధాన మోడల్ ‘బ్లూజ్ రీచ్’ సుమారు 100 కేజీల వరకు బరువు మోసుకొని 250 నుంచి 300 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలదు. నిలువుగా ఎక్కి నిలువుగా దిగగలిగే సామర్థ్యం కారణంగా రన్‌వే అవసరం లేదు. సరిహద్దు ఫార్వర్డ్ పోస్టులు, పర్వత ప్రాంతాలు, విపత్తు ప్రభావిత ప్రాంతాల్లోకి నేరుగా సరుకులు చేర్చవచ్చు.
హైబ్రిడ్ డిజైన్..
రక్షణ రంగం కోసం కూడా ఒక ప్రత్యేక వేరియంట్‌ను రూపొందిస్తున్నారు. బ్లూజ్ ఏరోస్పేస్ విమానం సాధారణ డ్రోన్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. హైబ్రిడ్ డిజైన్‌తో ఎక్కువ రోటర్లతో నిలువుగా ఎగురుతుంది. ఫిక్స్‌డ్ వింగ్ లాగా ముందుకు వేగంగా వెళ్తుంది. దీంతో ఎక్కువ దూరం.. ఎక్కువ బరువు మోయగలుగుతుంది. ప్రస్తుతం బ్యాటరీతో పరీక్షలు జరుగుతున్నా భవిష్యత్తులో హైడ్రోజన్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ఉపయోగించాలనేది వీరి ఆలోచన. హైడ్రోజన్ బ్యాటరీల కంటే ఇది ఎక్కువ శక్తినిస్తుంది. ఎక్కువ దూరం వెళ్తుంది. పర్యావరణానికి హాని చేయదు.
తర్వాత ప్యాసింజర్లే..
ఈ విమానం పూర్తిగా స్వయంచాలక విధంగా పని చేసేలా డిజైన్ చేస్తున్నారు. దీంతో ఎక్కువమంది పైలట్లు అవసరం లేకుండా పెద్ద స్థాయిలో సరఫరా చేయవచ్చన్నమాట. 2026-27 నాటికి మార్కెట్‌లోకి తీసుకురావాలనేది వాళ్ల ప్లాన్. మొదట సరుకు రవా్ణాపై దృష్టి పెట్టినప్పట్టకీ తర్వాత ప్యాసింజర్ వేరియంట్ కూడా తయారు చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచి మొదలైన ఈ ప్రయాణం భారతదేశ రక్షణ, లాజిస్టిక్స్ రంగాలను మార్చేసే సామర్థ్యం కలిగి ఉంది. సాధారణ ప్రజల నుంచి సైనికుల వరకు ఎవరికైనా ఈ సాంకేతికత ఉపయోగపడనుంది.






