- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బయో బ్రిక్స్.. పర్యావరణహిత ఇంటి నిర్మాణానికి
హైదరాబాద్ నగరంలో ఇండ్ల నిర్మాణంలో కొత్త ఆలోచనలు రూపుదిద్దుకుంటున్నాయి

దిశ, హైదరాబాద్ బ్యూరో: పల్లె అయినా పట్నమైనా సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. శ్లాబుతో కట్టిందైనా లేక సిమెంట్, ఇనుప రేకులతో ఇతర మరేరకంగా నిర్మించిందైనా సొంత ఇల్లు ఉంటే ఆ తృప్తి వేరే లెవల్ లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల ఇండ్ల నిర్మాణంలో ప్రతి ఒక్కరి ఆలోచనలో వినూత్నమైన మార్పులు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆర్సీసీ శ్లాబులతో కట్టిన ఇండ్లు, విల్లాలు, బహుళ అంతస్తుల భవనాలు, కంటైనర్ ఇండ్లు ఎంతో ప్రాచుర్యం పొందాయి. గత కొంత కాలంగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇండ్ల నిర్మాణంలో కొత్త ఆలోచనలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇందులో భాగంగానే బయో బ్రిక్స్ ఇండ్లు అందుబాటులోకి వస్తున్నాయి.
బయో బ్రిక్స్ ఎలా ?
ఇంటి గోడల నిర్మాణంలో ఇటుకలది ప్రధాన పాత్ర. ఇవి లేనిదే ఇల్లు నిర్మాణం ముందుకు కదలదు. ఇప్పటి వరకు సిమెంట్, మట్టితో కాల్చిన ఇటుకలతో కట్టిన ఇండ్లను చూశాం. టెక్నాలజీ పెరుగుతుండడంతో వినూత్నంగా ఆలోచిస్తున్నారు. రైతుల పంట వేస్టేజ్ ను తయారు చేసేదే బయోబ్రిక్స్. ఇది రైతులకు కూడా ఆదాయ మార్గంగా మారనుంది. గ్రామాలలో రైతులు వరి, గోధుమ, చెరుకు, పత్తి తదితర పంటలను పండించి కర్రల నుంచి వేరు చేసిన తర్వాత వాటిని పడేయడమో, కాల్చేయడమో చేస్తారు . అయితే ఈ వేస్టేజ్ ను సేకరించి పర్యావరణానికి హానికరం కాని బయో బ్రిక్స్ ను ముందుగా ఒడిషాకు చెందిన ప్రియాభ్రత తయారు చేసి చూపించాడు. ఇతన భువనేశ్వర్ లో ఆర్కిటెక్చర్. ప్రజలకు ఏదైనా ఉపయోగపడాలనే సంకల్పంతో రీసెర్చ్ ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఐఐటీ స్కాలర్ గా డిజైన్ డిపార్ట్ మెంట్ లో ఉన్న సమయంలో రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాడు. అదే సమయంలో ‘ఐఐటీ హైదరాబాద్’ ‘బోల్డ్ యూనిక్ ఐడియా లీడ్ డెవలప్ మెంట్’ (బిల్డ్) పేరుతో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ లో పాల్గొని నిర్మాణ రంగంలో కొత్దదనాన్ని పరిచయం చేసే క్రమంలో అతని మెదడు నుంచి వచ్చిందే బయోబ్రిక్స్. వీటిని ఉపయోగించి ముందుగా ఐఐటీ క్యాంపస్ లో సెక్యూరిటీ రూం నిర్మించారు.
తయారీ ఇలా ...
బయో బ్రిక్స్ తయారీ కోసం ముందుగా రైతుల నుంచి పంట పండిన అనంతరం వేస్టేజ్ ను సేకరిస్తారు. పందొమ్మిదవ శతాబ్ధం ఆరంభంలో అంటే సుమారు వందేళ్ల క్రితం బంకమట్టిని వాడి గోడలు నిర్మించేవారు . అదే పద్ధతిలో పంట చెత్త, జిగురు గుణం ఉన్న మొక్కలతో కలిపి పేస్ట్ లా తయారు చేసి దానిని ఇటుక రూపంలోకి మారుస్తారు. ఇవి గట్టి పడిన అనంతరం తేలికగా మారుతాయి. వీటిని ఇంటి నిర్మాణంలో వాడుతారు. ఇంటి పై కప్పు కట్టే సమయంలో పీవీసీ షీట్ లపై ఈ ఇటుకలు వినియోగించి రూఫ్ వేస్తారు. ఇవి వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ గా కూడా పని చేస్తుండడంతో భవనానికి రక్షణగా ఉంటాయి . ముందుగా రైతుల నుంచి సేకరించి పంట వేస్టేజ్ ను సేకరించి తయారు చేసిన మిశ్రమాన్ని అచ్చులో పోసి రెండు రోజుల అనంతరం వాటిని కావాల్సిన సైజులలోకి మారుస్తారు . అనంతరం వీటిని సుమారు మూడు వారాల పాటు ఎండబెట్టి వినియోగిస్తారు. ఇప్పటి వరకు పంట చెత్తను పోగేసి కాలుస్తుండడంతో వాయు కాలుష్యంగా కూడా మారుతున్నాయి. తాజాగా బయోబ్రిక్స్ అందుబాటులోకి వస్తే వాయు కాలుష్యం తగ్గడంతో పాటు రైతులకు కూడా ఆదాయ వనరుగా మారుతుంది. ఈ ప్రాజెక్ట్ ను అందుబాటులోకి తీసుకురావడానికి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటోంది .






