బిడ్డతో.. పర్వతారోహణ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.!

by Daayi Srishailam |

స్త్రీలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

బిడ్డతో.. పర్వతారోహణ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.!
X

దిశ, ఫీచర్స్: మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలోని తమియా అనే చిన్న గిరిజన గ్రామంలో జన్మించిన భావనా దేహరియాకు అక్కడి కొండలు, లోయలు చిన్నతనంలోనే సాహస జీవితాన్ని పరిచయం చేశాయి. ఆమె ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరంపై నిలబడి తల్లిగా కొత్త శిఖరాలను అధిరోహిస్తూ స్త్రీలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఫస్ట్ మధ్యప్రదేశియన్

2019 మే 22న.. 33 ఏళ్ల భావనా దేహరియా మధ్యప్రదేశ్ నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ. ఈ ప్రయాణం అంత ఈజీ కాదు. లాస్ట్ మినిట్లో ఆమె ఆక్సిజన్ మాస్క్ లీక్ అవడంతో 90 నిమిషాల పాటు తీవ్రమైన శ్వాస సమస్యలను ఎదుర్కొంది. అయినా ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో శిఖరాన్ని చేరుకుంది. ఆ తర్వాత మౌంట్ కిలిమంజారో, ఆస్ట్రేలియాలోని మౌంట్ కోసియుస్కో, 2025 జనవరి 22న దక్షిణ అమెరికాలోని సెర్రో అకాంకాగువా, యూరప్‌లోని 5,642 మీటర్ల ఎత్తయిన మౌంట్ ఎల్బ్రస్, హిమాలయాల్లోని మౌంట్ మణిరాంగ్, మౌంట్ యునమ్ శిఖరాలను జయించింది.

చంకన బిడ్డతో..

2021లో భావనా తల్లయింది. సాధారణం తల్లిగా మారిన తర్వాత వారి వ్యక్తిగత ఆసక్తులను, సాహసాలను విడిచిపెట్టాల్సి వస్తుంది. కానీ భావనా ఆ ఆలోచనను తిరస్కరించింది. తన సాహస ఆకాంక్షలను వదులుకోలేదు. బిడ్డ సంరక్షణ, రాత్రిపూట నిద్రలేని గంటల మధ్యలో కూడా ఆమె తన శిక్షణను కొనసాగించింది. ఒక చేతిలో బిడ్డను, మరో చేతిలో పర్వతారోహణ సామగ్రిని నిర్వహిస్తూ తల్లితనం, సాహసం రెండూ సమన్వయం చేయవచ్చని నిరూపించింది. తన అనుభవాలను ఇతరులకు, ముఖ్యంగా గిరిజన, వెనుకబడిన నేపథ్యాల నుంచి వచ్చే యువతులకు స్ఫూర్తిగా మార్చింది.

బ్రాండ్ అంబాసిడర్‌

పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాల ద్వారా యువతులను క్రీడలు, పర్వతారోహణ, బహిరంగ నాయకత్వం వైపు ప్రోత్సహిస్తోంది. మధ్యప్రదేశ్‌లో "ఫిట్ ఇండియా" ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలైంది. 2022లో క్రీడలు, ఆరోగ్య రంగంలో ఆమె చేసిన కృషికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. ప్రేరణాత్మక వక్తగా యువతకు మార్గదర్శనం చేస్తోంది. మహిళలు అంటే ఇంట్లోనే ఉండాలి, ఇంటి పనే చేయాలి అనే ఆలోచన ఉన్నవారిని ఎందరినో తన విజయంతో మార్చేసింది. పెళ్లయి, తల్లయిన తమ లక్ష్యాలను విస్మరిస్తున్న మహిళలను తట్టిలేపింది.

సరికొత్త వారసత్వం

భావనా దేహరియా కథ అసాధారణమైన ధైర్యాన్ని, నిశ్శబ్ద దృఢత్వాన్ని ప్రతిబింబిస్తుంది. బిడ్డ నిద్రిస్తున్న సమయంలో శిక్షణ తీసుకోవడం, శిఖరాలను అధిరోహించిన తర్వాత తిరిగి తల్లితనం వైపు మళ్లడం వంటి చిన్న చిన్న అడుగులలో ఆమె ధైర్యం కనిపిస్తుంది. భారతీయ సాహస క్రీడలలో ఆమె కేవలం శిఖరాలను జయించడమే కాదు, సామాజిక అంచనాలను మార్చడంలోనూ ముందంజలో ఉంది. శిఖర జెండాలు, బిడ్డలకు చెప్పే కథల మధ్య భావనా ఒక కొత్త వారసత్వాన్ని రూపొందిస్తోంది. స్త్రీలు ఎక్కడి నుంచి వచ్చినా.. ఏ పాత్రను స్వీకరించినా తిరిగి లక్ష్యాన్ని చేరుకునే సామర్థ్యం ఉందని చాటి చెప్తోంది.

Next Story