అశ్విని గణపతి.. అల్ట్రా మారథాన్‌లో ఆమెకు సాటిలేరు.!

by Daayi Srishailam |

ఒక సామాన్య మహిళ తన శారీరక, మానసిక శక్తిని ఎలా ఉపయోగించి అసాధ్యాన్ని సాధ్యం చేసిందనే స్ఫూర్తినిస్తోంది.

అశ్విని గణపతి.. అల్ట్రా మారథాన్‌లో ఆమెకు సాటిలేరు.!
X

దిశ, ఫీచర్స్: బెంగళూరు యువతి అశ్విని గణపతి జపాన్‌లోని అత్యంత కఠినమైన 173 కిలోమీటర్ల అల్ట్రామారథాన్‌ను 45 గంటల్లో పూర్తి చేసి ఈ రేస్‌లో నెగ్గిన ఏకైక గైర్-జపనీస్ రన్నర్‌గా నిలిచింది. ఆమె సాధించిన ఈ విజయం కేవలం ఒక రేస్ గెలవడం మాత్రమే కాదు. ఒక సామాన్య మహిళ తన శారీరక, మానసిక శక్తిని ఎలా ఉపయోగించి అసాధ్యాన్ని సాధ్యం చేసిందనే స్ఫూర్తినిస్తోంది.

అడుగడుగునా సవాళ్లు

130 కిలోమీటర్లు పూర్తయినప్పుడు అశ్విని కాళ్లు వణుకుతున్నాయి. దాదాపు 36 గంటలుగా ఆమె నిరంతరం పరుగెత్తుతోంది. నిద్ర లేదు, సరైన ఆహారం లేదు, ఇంకా 43 కిలోమీటర్ల కఠినమైన పర్వత మార్గం మిగిలి ఉంది. ఆ క్షణంలో ఆమె రేస్‌ను వదిలేయాలని ఆలోచించింది. ఎవరైనా అలా ఆలోచించడం సహజమే. అయితే, చివరి చెక్‌పాయింట్‌లోని న్యాప్ రూమ్‌లో ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించిన సంఘటన గుర్తొచ్చింది. లేచి నిలబడి తన 8 కిలోల బ్యాక్‌ప్యాక్‌ను సరిచేసుకొని మళ్లీ పరుగు కొనసాగించింది. ఆ క్షణం ఆమె జీవితాన్ని నిర్వచించింది.

ఐటీ రంగాన్ని వదిలేసి

2025 జూన్‌లో జరిగిన డీప్ జపాన్ అల్ట్రా 100 రేస్‌లో అశ్విని ఏకైక గైర్-జపనీస్ రన్నర్‌గా ఈ రేస్‌ను పూర్తి చేసింది. 135 మంది రన్నర్లు ఈ రేస్‌లో పాల్గొనగా కేవలం 63 మంది మాత్రమే ఫినిష్ లైన్‌ను చేరుకున్నారు. అశ్విని 45 గంటల 42 నిమిషాల్లో ఈ రేస్‌ను పూర్తి చేసి 46 గంటల కట్-ఆఫ్ సమయానికి కొన్ని నిమిషాల ముందు ఫినిష్ లైన్‌ను దాటింది. అశ్వినికి అథ్లెట్ కావాలనేది తన చిన్నప్పటి కోరిక. తొమ్మిది సంవత్సరాల పాటు ఐటీ రంగంలో పనిచేసింది. కానీ అక్కడ సంతృప్తి లేదని ఎండ్యూరెన్స్‌లో బాగా రాణించాలని ముందడుగు వేసింది.

జపాన్ రేసుకు సిద్ధం

2019లో అశ్విని కర్ణాటకలోని మల్నాడ్ అల్ట్రా మారథాన్లో 110 కి.మీ మారథాన్ చేసింది. ఇదే తనకు మొదటి అల్ట్రామారథాన్‌. అప్పుడే 100- మైలర్ రేస్ గురించి కలలు కనడం ప్రారంభించింది. ఈ లక్ష్యాన్ని సాధించడం సులభం కాదు. పూర్తి సమయం కోచింగ్, శిక్షణపై దృష్టి పెట్టింది. వారానికి 70 నుంచి 90 కిలోమీటర్లు పరుగెత్తడం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మానసిక దృఢత్వంపై పనిచేయడం ప్రారంభించింది. బ్యాక్‌యార్డ్ అల్ట్రాలో 28 గంటల పాటు 187.8 కిలోమీటర్లు పరుగెత్తి రికార్డు సృష్టించింది. ఈ రేస్‌ జపాన్ రేస్‌కు ఆమెను సిద్ధం చేసింది.

అసాధారణ సవాల్

డీప్ జపాన్ అల్ట్రా 100 రేస్ సాధారణ రేస్ కాదు. ఇది 173 కిలోమీటర్ల కఠినమైన పర్వత మార్గం. 9000 మీటర్ల ఎత్తు, హఠాత్తు వాతావరణ మార్పులు ఈ రేస్‌ను అసాధారణంగా చేశాయి. ఒక పర్వతాన్ని ఎక్కిన తర్వాత మళ్లీ దాన్నే ఎక్కమనేవాళ్లట. అడవుల్లో ఎయిడ్ స్టేషన్లు చాలా దూరంలో ఉండేవి. కొన్నిసార్లు 28 కిలోమీటర్ల దూరంలో ఉండేవి. ఇది నిజంగా కఠినమైన రేస్ అని తెలుసుకొని ఇంకా కసితో ముందుకెళ్లింది. 135 మందిలో 72 మంది రేస్‌ను పూర్తి చేయలేకపోయారు. అశ్విని మాత్రం ముందుకు సాగి జపాన్‌ ఫినిష్ లైన్‌ను దాటి రికార్డు సృష్టించింది.

Next Story