- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కష్టపడినా లాభం లేదు.. సక్సెస్ సాధించలేం! యువతలో పెరుగుతున్న కొత్త ధోరణి..!!
సోషల్ మొబిలిటీపై నమ్మకం ఎక్కువగా క్షీణిస్తున్న దేశాల్లో అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటివి ముందుండగా, మిగతా అన్ని దేశాల్లోనూ ఎంతో కొంత విస్తరిస్తోందని సర్వే వెల్లడించింది.

దిశ, ఫీచర్స్ : ‘కష్టపడితేనే విజయం సాధించగలం’ అంటారు పెద్దలు. తరతరాలుగా అందరూ నమ్ముతూ వస్తున్న సత్యమిది. కానీ ఇటీవల యువతలో ఈ ఆలోచన మారుతోంది. కష్టపడినంత మాత్రానా సక్సెస్ సాధిస్తామని చెప్పలేమంటోంది. కష్టానికి, మెరుగైన ఫలితానికి సంబంధం లేదని భావిస్తోంది. క్రమంగా సోషల్ మొబిలిటీపై నమ్మకం సడలుతోంది. దీంతో ఒక విధమైన నిరాశా, నిస్పృహ, ఆందోళన యువతలో పెరిగిపోతోందని ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఒక సర్వే పేర్కొన్నది. సంపద సృష్టిలో, పంపిణీలో లోపాలు, పెరుగుతున్న నిరుద్యోగమే ఇందుకు కారణమని వెల్లడించింది.
ముఖ్యంగా బాగా కష్టపడితే విజయం సాధిస్తామన్న భావనను జెన్ జీలు వ్యతిరేకిస్తున్నారు. ఇది పాతతరం ఆలోచనగా పరిగణిస్తున్నారు. చెప్పడానికే తప్ప ఫలితముందడని ఫీలవుతున్నారు. ఈ విధమైన సోషల్ మొబిలిటీపై నమ్మకం ఎక్కువగా క్షీణిస్తున్న దేశాల్లో అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటివి ముందుండగా, మిగతా అన్ని దేశాల్లోనూ ఎంతో కొంత విస్తరిస్తోందని సర్వే వెల్లడించింది. ఇక అధునాతన దేశాల్లో మధ్యస్థంగా 28% మంది జెన్ జీలు, మిలీనియల్స్ మాత్రమే భవిష్యత్తులో తమ పిల్లలు తమకంటే మెరుగ్గా ఉంటారని నమ్ముతున్నారు. ఇది ఆర్థిక అసమానతలు, ఇండ్ల ధరలు, తగ్గుతున్న వనరులు, ఉద్యోగ అస్థిరత వంటి అడ్డంకుల వల్ల జరుగుతోందని సర్వేను విశ్లేషించిన నిపుణులు అంటున్నారు. రాను రాను జెన్ జీలలో నిరాశ, మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయని, ఇవన్నీ వ్యవస్తాగత మార్పుల అవసరాన్ని హైలెట్ చేస్తున్నాయని భావిస్తున్నారు.
2015 ప్యూ చారిటబుల్ ట్రస్ట్స్ నివేదిక ప్రకారం చూస్తే కూడా అమెరికాలో కేవలం 64% మంది మాత్రమే ఎకానమికల్ మొబిలిటీ (Economic mobility)అందుబాటులో ఉందని భావిస్తున్నారు. ఇటీవలి(2022) ప్యూ విశ్లేషణలో కూడా ఆఫ్రో-అమెరికన్, హిస్పానిక్ సముదాయాల్లో ఆర్థిక స్థితి క్షీణత ఎక్కువగా కనిపిస్తోంది. ఇవన్నీ కలిపి కష్టపడే తత్వంపై యువతలో వ్యతిరేకతకు, నిరాశకు, సోషల్ మొబిలిటీపై నమ్మకం క్షీణతకు దారితీస్తున్నాయి. మిగతా దేశాల్లో కూడా సంపద సృష్టిలో లోపాలు, సమాన అవకాశాల్లో క్షీణత, నిరుద్యోగం, భద్రతలేని ఉద్యోగాలు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు యువతలో కష్టపడితేనే విజయం సాధిస్తామన్న ఆలోచన క్షీణితకు దారితీస్తున్నాయి. పెద్దగా కష్టపడకున్నా కొందరు జీవితంలో ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన ఉదాహరణలు సైతం యువతను కలవర పెడుతూ కన్‌ఫ్యూజ్ చేసేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి ఎక్కడో ఒక దగ్గర కలిసి రావడం, స్వార్థం, పక్షపాతం డామినేట్ చేస్తూ, కష్టపడే వారిని అణచివేస్తున్నాయని జెన్ జీ(Generation Z)లు బలంగా నమ్ముతున్నారు. ఇది వారిలో నిరాశను, మానసిక ఒత్తిడిని, ఆందోళనను, డిప్రెషన్‌ను పెంచుతోంది. ఒకవైపు వృద్ధ తరం(older generation) వారు ఇప్పటికీ కష్టపడితేనే ఫలితం ఉంటుందని, విజయం సాధిస్తామనే ఆశాభావంతో ఉండగా, జెన్ జెడ్స్, మిలీనియల్స్ మాత్రం సందేహస్పద ధోరణిని ప్రదర్శిస్తూ వ్యవస్థాగత మార్పులకోసం(demanding systemic changes) డిమాండ్ చేస్తున్నారు. Link






