- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇతరులను సంతోష పెట్టాలనే ఆరాటం.. స్వీయ నష్టానికి దారితీస్తుందా?
కొందరు స్నేహితులకు, సన్నిహితులకు ఆనందం, ఓదార్పు, ఉత్సాహం అందించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ లోలోన వీరు కఠినమైన మానసిక యుద్ధాలను ఎదుర్కొంటూ ఉంటారు.

దిశ, ఫీచర్స్ : మీరెప్పుడైనా గమనించారా? కొందరు వ్యక్తులు నిజానికి తమ ఇబ్బందులకంటే ఇతరుల ఇబ్బందులను చూసి ఎక్కువగా చలిస్తుంటారు. తాము కష్టపడినా పర్లేదు కానీ ఇతరులను కష్టాల నుంచి గట్టెక్కించాలని, వారిని సంతోష పెట్టాలని, వారి ముఖంలో చిరునవ్వు చూడాలని ఆరాట పడుతుంటారు. అయితే సైకాలజీ ప్రకారం ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు (people-pleasers) వాస్తవానికి తాము సంతోషంగా ఉండి ఉండకపోవచ్చు. లేదా అప్పటికే కష్టాలు, బాధలు అనుభవించి ఉండవచ్చు. తమలాంటి చేదు అనుభవం ఇతరులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో కూడా ఇలా చేస్తుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు ఈ అతి మంచితనమే స్వీయ నష్టానికి, ఇతరుల దృష్టిలో చులకన భావానికి దారితీయవచ్చునని కూడా పేర్కొంటున్నారు.
ఇతరులను సంతోష పెట్టే ప్రయత్నంలో తామను తాము పట్టించుకోరు కొందరు. తమలోని లోతైన భావాలను, బాధలను, భావోద్వేగాలను దాచుకుంటూ ఉంటారని కూడా మానసిక నిపుణులు అంటున్నారు. స్నేహితులకు, సన్నిహితులకు ఆనందం, ఓదార్పు, ఉత్సాహం అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నప్పటికీ, లోలోన వీరు కఠినమైన మానసిక యుద్ధాలను ఎదుర్కొంటూ ఉంటారు. బాధలో, బాధ్యతలో ఉండే మంచీ చెడూ, ముఖ్యంగా సమస్యలు, బాధల ద్వారా అనుభవించిన డీపెస్ట్ పెయిన్‌ను అనుభవించి ఉంటారు కాబట్టి, ఇతరుల ముఖంలో చిరునవ్వు తేవడానికి ప్రయత్నిస్తుంటారు. నిజానికి వీరి ముఖంలో కనిపించే నవ్వు, ప్రవర్తనలో కనిపించే హాస్యం, దయ వంటి బాహ్య రూపం వెనుక, తాము ఎదుర్కొంటున్న లోతైన సమస్యల తుఫాను దాగి ఉంటుంది. కానీ దానిని ఎప్పటికీ బయటపెట్టరు. అయితే కాలక్రమేణా ఈ స్వీయ త్యాగ ధోరణి (Self-sacrificing attitude) స్వీయ సమస్యలకు, స్వీయ నష్టాలకు దారితీయవచ్చు అంటున్నారు నిపుణులు.
తమ సన్నిహితులను, స్నేహితులను, పరిచయస్తులను సంతోష పెట్టాలనే మనస్తత్వం మంచిదే కానీ. ఇక్కడ అతి మంచితనమే కష్టాలు తెచ్చి పెడుతుంది. ఎందుకంటే ఈ తరహా వ్యక్తులు ఇతరులకోసం తమ సొంత అవసరాలను త్యాగం చేస్తుంటారు. ఈ పరిస్థితి తర్వాత కాలంలో స్వీయ నష్టాలకు కారణం కావచ్చు. ముఖ్యంగా ఒంటరితనం, మానసిక విచ్ఛిన్న భావన(Feeling of mental breakdown)కు దారితీయవచ్చు. తమ భావోద్వేగ అవసరాలను నిరంతరం విస్మరించడం వల్ల, మానసిక అలసట, ఆందోళన లేదా డిప్రెషన్ వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి రావచ్చు. అలా జరగకూడదంటే ఈ వ్యక్తులు తమను తాము గౌరవించుకోవడం, స్వీయ-సంరక్షణ(Self-care)కు ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. చుట్టూ ఉన్నవారు కూడా ఇలాంటి వ్యక్తుల సంతోషం కోసం ఆరా తీయడం, వారిని ఆదరించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వీరు సాధారణంగా తమ సమస్యలను పంచుకోరు. ఇతరుల కోసం జీవించే క్రమంలో తమ కోసం కూడా సమయం కేటాయించుకుంటే, వీరి మానసిక శ్రేయస్సు మెరుగుపడుతుంది.






