ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సరంలోకి..! ఎంజాయ్ చేసేద్దాం చలో చలో..!!

by Javid Pasha |   (  Updated:2025-12-31 06:48:52  IST  )

న్యూ ఇయర్ అంటేనే మార్పును స్వాగతించే మరో సందర్భం. యువతను, పెద్దలను సెలబ్రేట్ మూడ్‌లోకి తీసుకెళ్లే సమయం.

ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సరంలోకి..! ఎంజాయ్ చేసేద్దాం చలో చలో..!!
X

దిశ, ఫీచర్స్ : కొత్త సంవత్సరం వస్తోందంటేనే కొంగ్రొత్త ఐడియాలేవో మదిలో మెదులుతుంటాయి పలువురికి. కొందరు పెద్దగా పట్టించుకోరు కానీ.. చాలామందికి అదొక సెంటిమెంట్. మరుసటి సంవత్సరంలోకి అడుగు పెట్టే ముందు మస్తు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. న్యూ ఇయర్‌కు వెల్కం చెప్పే క్రమంలో31 నైట్ మనసుకు నచ్చినట్లు ఉంటూ సంతోషంగా గడపాలని భావిస్తుంటారు. అయితే 2025కు గుడ్ బై చెప్తూ.. 2026ను స్వాగతించే సందర్భాన్ని కూడా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలనే పిల్లలు, పెద్దలు, ముఖ్యంగా యువత ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చి ఉంటారు.

న్యూ ఇయర్ అంటేనే మార్పును స్వాగతించే మరో సందర్భం. యువతను, పెద్దలను సెలబ్రేట్ మూడ్‌లోకి తీసుకెళ్లే సమయం. యువతీ యువకుల మదిని మీటే సంతోషాల సంగీతం.. గత అనుభవాలకు, ఆలోచనలకు వీడ్కోలు చెప్పే సందర్భం. గతాన్ని సమీక్షించుకొని, గుణ పాఠాలు నేర్చుకుని అందమైన భవిష్యత్తును స్వాగతించేక సమయం. అందుకే కొత్త ఆలోచనలతో, కొంగ్రొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలో తాము కూడా కొత్తగా, ఆనందంగా, ఉన్నతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. హద్దుల్లేని ఆనందంతో తేలియాడుతూ అవసరమైన మార్పులవైపు అడుగేస్తూ కొత్త సంవత్సరాన్ని, కొత్త మార్పును స్వాగతిస్తారు. ప్రస్తుతం అదే ఉత్సాహంతో 2026లోకి అడుగు పెట్టేందుకు విదార్థులు, యువతీ యువకులు, పెద్దలు సరైన ప్లాన్‌తో ఇప్పటికే రెడీగా ఉన్నారు. నూతనోత్సహంతో నూతన సంవత్సరాన్ని ఎంజాయ్ చేస్తామంటున్నారు.

కొత్త ఆలోచనలతో, కొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే క్రమంలో ఈరోజు రాత్రికి(డిసెంబర్ 31) ఏం చేయాలి? మరుసటి రోజు అంటే జనవరి ఫస్టు నాడు ఎలా గడపాలి? ఈ సందేహాలకు సమాధనాలేమిటో జెన్‌జీలు ఇప్పటికే మీ మైండ్‌లో ఫిక్సయి ఉంటారు. కొత్త సంవత్సరాన్ని ఎంజాయ్ చేయాలన్న ఆలోచనతో ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు. గతంలో జరిగిందేదో జరిగింది. ఈ సంవత్సరం మాత్రం చాలా బాగుండాలని భావిస్తున్నామని అందరూ అంటున్నారు.

ఫస్టు రోజు ఏం చేద్దాం..?

న్యూ ఇయర్‌లో మొదటి రోజు ఎలా గడిస్తే ఆ ఏడాదంతా అలాగే గడుస్తుందనే భ్రమ లేదా సెంటిమెంట్ నేటి యువతలో, పెద్దల్లో కూడా ఎక్కువే. అందుకే ఫస్టురోజు తాము సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఒక జనవరి ఒకటో తేదీన పొద్దున్న ఎన్ని గంటలకు లేవాలి? ఎంత చేపు చదవాలి? జిమ్‌కు ఎన్ని గంటలకు వెళ్లాలి? ఏ టెంపుల్‌కి వెళ్లాలి? మొదటి రోజు ఏ పని ముందుగా పూర్తి చేయాలి? వాకింగ్ ఎంత సేపు చేయాలి? పార్టీ ఎక్కడ చేసుకోవాలి? ఫ్రెండ్స్‌తో, కుటుంబ సభ్యులతో ఎలా గడపాలి? అనేది నిర్ణయించుకుని 2026కు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు చాలామంది. ‘మొదటి రోజే లేటుగా లేశామంటే.. ఇక ఆ సంవత్సరమంతా బద్దకస్తులుగా మారతామేమో అందుకే అలాంటి పనిమాత్రం చేయను’ అంటున్నారు కొందరు యువతీ యువకులు. సొంత ఆలోచనకు పదును పెట్టి, జీవితాన్ని ఆనందమయం చేసే సొంత నిర్ణయాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నామని కూడా చాలామంది చెబుతున్నారు. ముఖ్యంగా న్యూ ఇయర్ రోజు ఎటువంటి తప్పులకు, పొరపాట్లకు, తప్పుడు ఆలోచనలకు అవకాశం ఇవ్వొద్దంటున్నామనేది అత్యధికమంది నోటి నుంచి వెలువడుతున్న మాట.

వీటికి దూరంగా..

కొత్త సంవత్సరం కాబట్టి మీ సెంటిమెంట్లను ఎవరు కాదంటారు. మీ ఇష్టం అంటున్నారు పెద్దలు, నిపుణులు కూడా కాకపోతే ఓ పద్ధతిగా సెలబ్రేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలకు, కార్యకలాపాలకు ఆ ఆరోజు దూరంగా ఉండండి అంటున్నారు. మీ మనసును బాధించే జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవద్దు, మీ మీద మీరు నమ్మకంతో, ఆత్మ విశ్వాసంతో, మీకు నచ్చిన విధంగా ఆనందంగా గడపండి అని చెబుతున్నారు. యువత, పెద్దలు కూడా ఇదే కోరుకుంటున్నారు. కొత్తసంవత్సరం ఆరోజును ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపాలని భావిస్తున్నారు.

సోషల్ మీడియాతో..

కొత్త సంవత్సరం సందర్భంగా మీరు ఇతరులకు విషెస్ చెబుతూ పోస్టులు పెడితే పర్లేదు. కానీ ఆరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పోస్టులు, తీవ్రమైన విమర్శలు, మీకు నచ్చని అభిప్రాయాలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తాయి. ఎవరైనా వాటిని పోస్ట్ చేయవచ్చు. వాటిని చూసి మీరు చలించకుండా ఉండేవాళ్లైతే పర్లేదు. కానీ నిరాశకు గురయ్యే మనస్తత్వం అయితే గనుక సోషల్ మీడియాకు దూరంగా ఉండటమే బెటర్ అంటున్నారు నిపుణులు. ఒక వేళ సోషల్ మీడియాను స్క్రోల్ చేసినా అవసరమైన వాటికి మాత్రమే రియాక్ట్ అవండి. ఎందుకంటే అక్కడ మీ మూడ్ ఆఫ్ చేసే పోస్టు ఏదైనా ఉంటే ఫీలవుతారు కదా! కొత్త సంవత్సరం రోజు బాధ పడటం దేనికి! అందుకే సోషల్ మీడియాను దూరం పెట్టడం లేదాఅవసరం మేరకు మాత్రమే వాడుకోవడం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

డిసెంబర్ 31 నైట్..

డిసెంబర్ 31 నైట్ కావచ్చు. జనవరి ఫస్టు రోజు కావచ్చు. ఏదైతేనేం న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకొని బోరింగ్ లైఫ్ గడపడం అస్సలు ఇష్టం ఉండదు ఎవరికి కూడా. యువత కూడా ఇదే అంటోంది. విద్యార్థులైతే చదువులో మరింత రాణించేందుకు ఆసక్తి చూపుతామంటున్నారు. ఉద్యోగులైతే తమ వృత్తిలో మరిన్ని నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తామని చెబుతున్నారు. ఆ విధమైన ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా తమ తమ ప్రొఫెషన్ల గురించి, ఫైనాన్షియల్ ప్లాన్ల గురించి, పర్సనల్ రెజల్యూషన్స్ గురించి ఆలోచిస్తూ మంచి నిర్ణయాలు తీసుకునే పనిలో యువత, పెద్దలు తలమునకలై ఉన్నారనుకోండి.

విషెస్ చెప్తూ.. వెల్కం చెప్తూ..

ఒకప్పుడు న్యూ ఇయర్‌కు వారం రోజుల ముందే గ్రీటింగ్స్ కార్డ్స్ కొనుక్కొని లేదా లెటర్లపై రాసి బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెబుతూ పంపేవాళ్లమని పెద్దలు తరచూ చెబుతుంటారు. కానీ ఇప్పుడా పరిస్థితులు మారాయి. స్మార్ట్‌ ఫోన్లు చేతిలో ఉండగా లేఖలు రాసేందుకు ఈ జనరేషన్ ఇష్టపడటం లేదు. ఉత్తరాలు రాయడం, పుష్ప గుచ్ఛాలు ఇవ్వడం జాన్తానై అంటోంది యూత్. మొబైల్ ఫోన్లోనే అందమైన డిజైనింగ్ క్రియేట్ చేసి వాట్సాప్‌లో విషెస్ చెప్పేస్తామని లేదా మెసేజ్ పంపుతామని కొందరు అంటుంటే.. అందరికీ పేరు పేరును విషెస్ చెప్పుకుంటూ కూర్చుంటే టైమ్ వేస్ట్, విషెస్ చెప్తూ జస్ట్ స్టేటస్ పెట్టుకుంటే సరిపోతుందని మరికొందరు అంటున్నారు. ఇక ఇష్టమైన వాళ్లకు, దూరంగా ఉన్న కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి విషెస్ చెప్పేస్తామంటున్నారు ఇంకొందరు. ఏది ఏమైనా నయాసాల్ మస్త్ జోష్ అంటూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేందుకు అందరూ రెడీ అవుతున్నారు.

న్యూ ఇయర్ సందర్భం.. నిపుణుల సూచన

*31 ఫస్ట్ నైట్, అలాగే జనవరి ఫస్ట్ రోజు ఆనందంగా గడిపేయండి. ప్రతికూల ఆలోచనలకు స్వస్తి చెప్పండి.

*మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. అందుకు అవసరమైన వెదర్ క్రియేట్ చేసుకోండి.

*ఇష్టమైన వాళ్లతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి. ఎవరినీ నొప్పించే పనులు చేయకండి.

*అతి ఏదైనా మీ మూడ్ పాడు చేస్తుంది. కాబట్టి అతిగా డ్రింక్ చేయడం, అనవసర పొరపాట్లకు అవకాశం ఇవ్వడం వంటివి చేయకండి.

*విలువైన సమయాన్ని వృథా చేయకండి.

*మీ పట్ల ఎవరైనా అయిష్టత ప్రకటించినా పట్టించుకోకండి. మీకు మీరు నచ్చితే చాలు.

*పరస్పర గౌరవ భావాలతో మెలగండి. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీరూ ఆనందంగా ఉండండి.

*మీ ఆరోగ్యంపట్ల అశ్రద్ధ చేయకండి.

*మీ స్నేహితులతో, పేరెంట్స్‌తో, ఆత్మీయులతో సంతోషంగా మాట్లాడండి. రెట్టింపు ఉత్సాహంతో విషెస్ చెప్పండి.

*31 నైట్, అలాగే జనవరి ఫస్టు నాడు ట్రాఫిక్, పార్టీలు, పబ్బులు, ఎంజాయ్‌మెంట్ వంటి విషయాల్లో పోలీసుల సూచనలను, నిబంధనలను పాటించండి.

Next Story