Be Strong!!.. ద్వేషపూరిత వ్యక్తులతో పనిచేసేటప్పుడు జాగ్రత్త

by Disha Web Desk 7 |
Be Strong!!.. ద్వేషపూరిత వ్యక్తులతో పనిచేసేటప్పుడు జాగ్రత్త
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా పనిచేస్తున్న ప్రదేశంలో మీరు ఎంత సమర్థవంతులైనా, పనిలో నైపుణ్యం ప్రదర్శిస్తున్నా కొందరు వ్యక్తులు ఓర్చుకోలేరు. ప్రతిచోటా ఇలాంటివారు ఒకరైనా ఉంటారని మానసిక నిపుణులు చెప్తుంటారు. మీరు ఎక్కడున్నా, ఏ విధమైన ఉద్యోగం చేస్తున్నా ద్వేషపూరిత ఆలోచన కలిగిన వ్యక్తి ఒక్కరైనా తారస పడుతుంటారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, మాటలతోనో, చేతలతోనో మిమ్మల్ని డామినేట్ చేసేందుకు ట్రై చేస్తుంటారు.

అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసులో ఏదో చెడు ఆలోచన పెట్టుకుని, సఖ్యంగా మెలుగుతూనే మెంటల్‌గా, ప్రొఫెషనల్‌గా దెబ్బతీయాలని చూస్తుంటారు. ఇలాంటి వారిని ముందుగానే గుర్తించి సున్నితంగా తిరస్కరించి దూరం పెట్టాలని సూచిస్తున్నారు నిపుణులు. అలా చేస్తేనే వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి మేలు జరుగుతుందని చెప్తూ.. టాక్సిక్ పీపుల్ పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో కొన్ని టిప్స్ అందించారు.

1. ఫిర్యాదు చేయకండి

మీపట్ల ప్రతికూల దృక్పథంతో ఉన్న వ్యక్తుల గురించి ఫిర్యాదు చేయకండి. వారితో కలిసి సమావేశాలకు వెళ్లాల్సి వస్తే, అక్కడ మీ పనితీరు, మీరు అనుసరించే విలువైన సూత్రాల గురించి రివీల్ చేయకండి. వ్యక్తిగత, వృత్తిపరమైన రహస్యాలను పంచుకోవద్దు. మీ సమర్థతను, నైపుణ్యాన్ని తక్కవ చేయాలని, దెబ్బతీయాలని ఆలోచించే వారికి ఈ పాయింట్స్ చెబితే మిమ్మల్ని మంచివారిగానో లేదా కలివిడితనం కలిగిన వారిగానో పరిగణించరు. పైగా మీ రహస్యాలన్నీ తెలుసుకుని మీకు హాని చేస్తారు. బాస్, కొలిగ్స్‌కు మీ మీద లేనిపోని చాడీలు చెప్పి బలహీన పరిచే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాటిని ముందుగానే నివారించడం మంచిది.

2. నైతికతను కాపాడుకోండి

కొందరు మీ గురించి తప్పుగానో లేదా తక్కువ చేసో మాట్లాడుతుంటారు. మీ ముందు బాస్ గురించి ప్రతికూల భావన కలిగించేలా చెప్తుంటారు. మీకు విసుగెత్తించే లేదా కోపం తెప్పించే మాటలు చెప్తుంటారు. ఎమోషనల్‌కు గురిచేసేలా ప్రేరేపిస్తుంటారు. ఇలాంటప్పుడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు.. మిమ్మల్ని పైస్థాయి వ్యక్తులపై, లేదా కొలిగ్స్‌పై ఉసిగొలిపే మాటలకు రెచ్చిపోవద్దు. ప్రశాతంగా ఉండాలి. మీ నైతికతను దెబ్బతీసే ఏ మాటలను, పనిని మీరు ఆహ్వానించవద్దు, అనుసరించవద్దు.

3. హ్యాండిల్ యువర్ సెల్ఫ్

మిమ్మల్ని మీరు హాండిల్ చేసుకోవాలి తప్ప ప్రతి దానికీ ఇతరుల సలహా పాటించవద్దు. ఇతరుల నుంచి అభిప్రాయం తీసుకోవడం మంచిదే కానీ, మీపట్ల ప్రతికూల దృక్పథం కలిగిన ద్వేషపూరిత వ్యక్తుల నుంచి సలహాలు, సూచనలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. ఎందుకంటే మీకు సలహాలిస్తూనే మిమ్మల్ని హ్యాండిల్ చేసే స్థాయికి రావచ్చు. మిమ్మల్ని నియంత్రించే ప్రయత్నం చేయొచ్చు. అందుకే ఆచి తూచి వ్యవహరించడం ముఖ్యం.

4. డైరెక్ట్ కమ్యూనికేషన్

మీ పని విధానం, అభిప్రాయాలు, అనుమానాలు ఏమైనా ఉండవచ్చు. మీరు స్వతహాగా ఆలోచించి చేయండి. అనుమానాలుంటే బాస్‌ను గాని, వ్యక్తులను గాని నేరుగా సంప్రదించి సందేహాలు తీర్చుకోవాలి. అంతేగాని మీ చుట్టూ ఉండే ప్రతికూల దృక్పథం కలిగిన వ్యక్తులతో మాత్రం వద్దు. మీకు ఎవరితోనైనా ఇబ్బంది ఉంటే, లేదా భిన్నాభిప్రాయాలు ఉంటే వారిని దూరం పెట్టాలనుకున్నప్పుడు ఎలాంటి మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పేయండి. మీ ఉనికికి ప్రమాదకరమైన వారితో ఇలా వ్యవహరించడం తప్పు కాదు.

5. ఆరోగ్యకరమైన స్ట్రాటెజీస్

ద్వేషపూరితమైన వ్యక్తులను ఏ విషయంలోనైనా సంప్రదించాల్సి వచ్చినప్పుడు జాగ్రత్త. మీరు సానుకూల ఆలోచనతో చెప్పినప్పటికీ వారు ప్రతికూలంగానే ఆలోచిస్తుంటే జాగ్రత్త. మీ హుందాతనానికి, మీ ప్రొఫెషన్‌కు ఇబ్బందికరమైనది అనుకుంటే వారిని సంప్రదించకపోవడం బెటర్. మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసే, మీ ఉద్యోగ జీవితంపై, మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపే పరిస్థితులను నివారించుకోండి. సానుకూల వాతావరణం, హెల్తీ వాతావరణం క్రియేట్ చేసుకోండి. ఈ ఒత్తిడి నుంచి బయటపడేందుకు యోగా, ఎక్సర్‌సైజ్, సరైన నిద్రను పాటించండి.

6. అవసరమైతే సాయం తీసుకోండి

మీరు పనిచేస్తున్న ఆఫీసు, కంపెనీ లేదా మరేదైనా చోటు కావచ్చు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తేనో, వేధింపులకు, ఒత్తిడికి గురి చేస్తేనో భయపడకండి. మీరు పనిచేసే ఆఫీసులో హ్యూమన్ రిసోర్స్ (హెచ్ ఆర్) డిపార్టుమెంట్‌ను సంప్రదించవచ్చు. మీ సమస్యను వివరించి సాయం కోరవచ్చు. వారు చక్కటి పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఒత్తిడి నుంచి బయట పడేసి, వృత్తిపరమైన జీవితంలో సమర్థవంతంగా రాణించేందుకు తోడ్పడతారు. అలాగే మీరు మీ డాక్టర్‌నో, మానసిక నిపుణులనో సంప్రదించాల్సి వస్తే అక్కడ కూడా మీ సమస్యను వివరించి చక్కటి పరిష్కారం పొందవచ్చు.

READ MORE

Unknown Facts : మనం శరీరంలో కొన్ని అవయవాలు లేకపోయినా బ్రతకవచ్చని తెలుసా ?



Next Story

Most Viewed