నిర్మాణంలో నిర్లక్ష్యం.. గోడ కూలి ఏడుగురు మృతి

by Disha Web Desk 12 |
నిర్మాణంలో నిర్లక్ష్యం.. గోడ కూలి ఏడుగురు మృతి
X

దిశ, కుత్బుల్లాపూర్: ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్లక్ష్యానికి ఏడుగురు కార్మికుల ప్రాణాలు ఆవిరి అయ్యాయి. ఉపాధి కోసం పొట్ట చేతబట్టుకొని వలస వచ్చిన ఒడిస్సా, సతీష్ గడ్ రాష్ట్రాలకు చెందిన కార్మికుల బతుకులను హరిజన్ రిజ్ కన్స్ట్రక్షన్ కంపెనీ చిదిమేసింది. వివరాల్లోకి వెళ్లితే.. మేడ్చల్ జిల్లా బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో సర్వే నెంబర్ 345 పార్ట్,406 పార్ట్‌లో సుమారు రెండు వేల చదరపు మీటర్లు విస్తీర్ణంలో హరిజన్ రిజ్ కన్స్ట్రక్షన్ కంపెనీ సెల్లార్, స్టిల్ట్ +5 అప్పర్ ఫ్లోర్స్ హెచ్ఎండీఏ అనుమతితో రెసిడెంట్స్ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఈ భవంతి నిర్మాణంలో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన పలువురు కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికులు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రదేశంలోనే రేకుల షెడ్ వేసుకుని జీవిస్తున్నారు.

మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి భవంతి చుట్టూ నిర్మించిన రిటైనింగ్ వాల్ కార్మికుల రేకుల షెడ్స్ పై కూలింది. భారీ వర్షంలో ఒక్కసారిగా ఈ ఘటన జరగడం తో కార్మికులు హాహాకారాలు పెడుతూ షెడ్స్ నుండి కొందరు గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం మమత హాస్పిటల్ కు తరలించారు.మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. బుధవారం తెల్లవారుజామున శిథిలాల కింద చిక్కుకున్న ఏడుగురు ఒడిస్సా, సతీష్ గడ్ రాష్ట్రాలకు కు చెందిన కార్మికులు తిరుపతి మజీ (20), శంకర్ (22), రాజు (25),ఖుషి (25) w/o రాజు, రాము యాదవ్(34), గీత (32), హిమాన్షు (04) లు మృతి చెందారు. మృతులను పోస్ట్ మార్టం నిమిత్తం బాచుపల్లి పోలీసులు గాంధీ హాస్పిటల్ కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కార్మికుల హక్కులను హరించి.. కనీస వసతులు లేకుండా ప్రమాదకరంగా రేకుల షెడ్స్ వేయడంతోనే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కారణమైన బిల్డర్ ను అరెస్ట్ చేసి, హత్య,క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిజాంపేట్ బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీష్ డిమాండ్ చేశారు. హరిజన్ రిజ్ కన్స్ట్రక్షన్ కంపెనీ బిల్డర్ ఏ. అరవింద్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే ఏడుగురు కార్మికులు చనిపోయారు. కన్స్ట్రక్షన్ కంపెనీ లో పని చేస్తున్న కార్మికులకు నేషనల్ లేబర్ లాస్ ప్రకారం వసతులు కల్పించలేదు.మనుషుల కన్నా హీనంగా వారిని ట్రీట్ చేస్తూ కనీసం వారు నివసించడానికి వీలు కానీ రేకుల షెడ్స్ నిర్మించారు.కార్మికుల నివాసం కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్స్ భవంతి నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ కు ఆనుకుని ఉండడంతో భారీ వర్షానికి గోడ కూలి కార్మికులు చనిపోయారు. మృతుల కుటుంబాలను ఆదుకుని బిల్డర్ పై చట్ట పరమైన చర్యలు వెంటనే చేపట్టాలి.

Next Story