- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటో డ్రైవర్ నుంచి.. టెన్నిస్ ఆటగాడిగా.!
భారత్‌కు అంతర్జాతీయ వీల్‌చైర్ టెన్నిస్ టోర్నీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ స్థాయి అథ్లెట్

దిశ, ఫీచర్స్: పేదరికం జీవితాన్ని నేర్పుతుంది. లక్ష్యం కోసం పోరాడటం నేర్పుతుంది. హుబ్లీకి చెందిన బసవరాజ్ కుందరగికి ఇదే నేర్పింది. అతనొకప్పుడు ఆటో డ్రైవర్. ఇప్పుడు భారత్‌కు అంతర్జాతీయ వీల్‌చైర్ టెన్నిస్ టోర్నీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ స్థాయి అథ్లెట్. దీన్నిబట్టే చెప్పొచ్చు ఆయన కష్టం.. పట్టుదల.. గెలుపు ఎలాంటివో.!
కోచ్.. కోర్ట్ లేకున్నా..
2018 వరకు బసవరాజ్‌కు టెన్నిస్ అంటే ఏమిటో కూడా తెలియదు. ఆటో నడుపుతూ బతికేవాడు. వాళ్లన్న శంకర్ లింగా.. ఇంకా కొందరు బసవరాజ్‌కు వీల్ చైర్ టెన్నిస్ గురించి చెప్పారు. వాళ్లే గురువులుగా మారి ప్రోత్సహించారు. అలా బసవరాజ్ వీల్‌చైర్ టెన్నిస్ ఆడటం ప్రారంభించాడు. వాస్తవానికి ఆయన ఆడటమైతే షురూ చేశాడు కానీ.. పూర్తిగా ఆటపై పట్టులేదు. కనీసం కోచ్ ఎవరో.. ఎక్కడుంటారో కూడా తెలియదు. కోర్టు లేదు.. మంచి వీల్‌చైర్ లేదు.. కోచ్ లేడు. చాలామంది రాజకీయ నాయకులకు మెయిల్స్ చేశాడు. కానీ ఏ ఒక్కరి నుంచి సానుకూల స్పందన రాలేదు.
అదొచ్చాక లైఫ్ ఛేంజ్..
ఆటోను కాదు.. వీల్‌చైర్ టెన్నిస్‌లో మునిగి తేలాలనుకుంటున్న బసవరాజ్‌కు అన్నివైపుల నుంచీ దారులు మూసుకుపోయాయి కానీ.. ఒకరు ముందుకొచ్చారు. సరైన సమయంలో అతడికి గోస్పోర్ట్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. వాళ్లు తనను కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు. ఆ సపోర్ట్ వల్లే ఆటలోనూ.. జీవితంలోనూ నిలబడ్డాడు బసవరాజ్. సాధారణ వీల్‌చైర్‌లో టెన్నిస్ ఆడటమంటే కొంత కష్టం. కానీ స్పోర్ట్స్ వీల్‌చైర్ వచ్చాక అతడి జీవితమే మారిపోయింది. అది తేలికగా ఉండేది. వేగంగా కదిలే సౌకర్యం ఉంది. ఇవన్నీ తనకు మరింత ఆత్మవిశ్వాసాన్నిచ్చాయి.
లక్ష్యం 2028..
అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినా బసవరాజ్ నేను ట్రోఫీ కోసం ఎప్పుడూ ఆడలేదు. అనుభవం కోసం.. నైపుణ్యం పెంచుకోవడం కోసమే నేను ఆట ఆడతాను అని చెప్తుంటాడు. అతడు బలంగా నమ్మే ఇంకొకటి ఏంటంటే.. ఒక్క రోజులో ఏదీ గెలవలేం. అలసిపోకుండా.. ఓపికతో ప్రతీరోజూ ప్రాక్టీస్ చేస్తేనే విజయం సాధ్యమని చెప్తాడు. ఇప్పటి వరకు భారత్ నుంచి పారాలింపిక్స్ లేదా ఏషియన్ గేమ్స్‌లో వీల్‌చైర్ టెన్నిస్‌లో ఎవరూ పాల్గొనలేదు. 2028లో తానే మొదటి భారత పారాలింపియన్ అవుతానని.. ఎంతోమంది యువకుల్ని ఈ ఆటలోకి తీసుకొస్తాని ధీమాగా చెప్తున్నాడు.






