ప్రమాదాలను పసిగట్టే స్మార్ట్‌షూస్‌.. అంధుల కోసం ఆవిష్కరణ!

by Javid Pasha |

సాంకేతిక నిపుణులు కొత్తగా రూపొందించిన స్మార్ట్‌షూస్‌‌లో వాటర్‌ప్రూఫ్ అల్ట్రాసోనిక్ సెన్సార్లు ఉంటాయి. ఎదురుగా ఉన్న అడ్డంకులను గుర్తించి హెచ్చరిస్తాయి.

ప్రమాదాలను పసిగట్టే స్మార్ట్‌షూస్‌.. అంధుల కోసం ఆవిష్కరణ!
X

దిశ, ఫీచర్స్ : అంధులు లేదా తీవ్రమైన దృష్టిలోపం ఉన్నవారు ఎక్కడికైనా నడిచి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. తాము నివాసముండే పరిసరాల్లో తిరగడానికి సైతం అవస్థలు పడుతుంటారు. ఎదురుగా గుంతలున్నా, ఏవైనా జంతువులు వస్తున్నా కనబడక ప్రమాదాల బారిన పడుతుంటారు. అయితే ఇలాంటి వారికోసం ఒక కొత్త ఆవిష్కరణకు తెరతీసింది ఆస్ట్రియాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ.. ఏంటంటే.. గ్రాజ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీతో కలిసి చూపులేని వారికోసం ప్రత్యేక స్మార్ట్ షూస్‌ను అభివృద్ధి చేసింది. ఇవి అంధులకు ఏ విధంగా మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వాటర్ ప్రూఫ్ అల్ట్రాసోనిక్ సెన్సార్లు..

ఆస్ట్రియా కంపెనీ, గ్రాజ్ యూనివర్సిటీ నిపుణులు కలిసి రూపొందించిన స్మార్ట్‌షూస్‌‌లో వాటర్‌ప్రూఫ్ అల్ట్రాసోనిక్ సెన్సార్లు ఉంటాయి. ఇవి షూ ముందు భాగంలో(Toe area) ఫిట్ చేయబడి ఉండటాయి. అంతేకాకుండా ఇవి ధరించి నడుస్తున్న వ్యక్తి ముందుభాగంలో 4 మీటర్ల (సుమారు 13 అడుగుల) దూరం వరకు గోడలు, రాళ్లు, గుంతలు ఇలా ఏ అడ్డంకులు ఉన్నా గుర్తించి వైబ్రేషన్ ద్వారా హెచ్చరిస్తాయి. అడ్డంకి దగ్గరపడే కొద్దీ ఈ వైబ్రేషన్ (Haptic feedback) తీవ్రత పెరుగుతుంది. అంటే అచ్చం కారు పార్కింగ్ సెన్సార్ల మాదిరిగా వర్క్ చేస్తాయి. కాబట్టి వాటిని ధరించిన వారు ప్రమాదాన్ని గ్రహించి ముందుకు వెళ్లకుండా మరో మార్గంలో వెళ్లడమో, ఆగిపోవడమో చేయడం ద్వారా సురక్షితంగా ఉండగలుగుతారు.

ఆడియో సిగ్నల్స్ ద్వారా

షూస్‌లో డిస్టెన్స్ సెన్సార్లు, ఫుట్ మూవ్‌మెంట్ సెన్సార్లు, వైబ్రేషన్ యూనిట్, అల్ట్రా-బ్రైట్ ఎల్ఈడీ, ప్రాసెసింగ్ యూనిట్, స్మార్ట్‌ఫోన్‌తో వైర్‌లెస్ కనెక్షన్ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ వాటర్ & డస్ట్ రెసిస్టెంట్ కేసింగ్‌లో ఉంచబడతాయి. వైబ్రేషన్ ఫీడ్‌బ్యాక్‌తో పాటు స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆడియో సిగ్నల్స్ (బోన్ కండక్షన్ హెడ్‌ఫోన్స్ ద్వారా చుట్టూ ఉన్న శబ్దాలు వినబడతాయి) ఇవ్వవచ్చు. ఇక షూస్‌లోని లైట్ రాత్రిళ్లు లేదా తక్కువ కాంతి ఉన్న పరిస్థితుల్లో ఇతరులు ధరించిన వారిని గుర్తించడానికి సహాయపడుతుంది. బ్లైండ్, విజువల్‌ ఇంపైర్డ్ షూస్ ఒంటరిగా ఉన్నప్పుడు అంధులు, వృద్ధుల రోజువారీ జీవితాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Next Story