అమ్మ ప్రేమ.. మరపురాని స్వెటర్ అనుభూతి.!

by Daayi Srishailam |

91 ఏళ్ల వయసులో కొడుకు మీద ప్రేమతో స్వెటర్ కుట్టిందొక తల్లి

అమ్మ ప్రేమ.. మరపురాని స్వెటర్ అనుభూతి.!
X

దిశ, ఫీచర్స్: చిన్నప్పటి స్వెటర్ యాదికుందా.? అమ్మ అంగట్లో కొనిపెట్టిన స్వెటర్. అమ్మమ్మనో.. మేనమామనో మనల్ని చూడ్డానికి వచ్చినప్పుడో లేదా మనం హాస్పిటల్లో ఉన్నప్పుడో తీసుకొచ్చే రంగురంగుల స్వెటర్ మనకెప్పుడూ స్వీట్ మెమొరీనే. అలాంటి ఒక మధురమైన అనుభూతి గురించి సోషల్ మీడియాలో పంచుకొని తల్లిప్రేమను ప్రపంచానికి చాటిచెప్తున్నాడొక కొడుకు.

91 ఏళ్ల వయసులో..

ఒక అమ్మ. తన వయసు 91 సంవత్సరాలు. ఏళ్ల తరబడి మంచానికే పరిమితమై ఉంది. చలికాలం కదా తన కొడుక్కి చలిపెట్టొద్దనుకుంది. చూస్తేనేమో మంచమ్మీదనే ఉంటుంది. కానీ కొడుక్కి స్వెటర్ కుట్టాలనే ఆరాటం. తల్లిప్రేమ ఊకోదు కదా.? చేతగాకున్నా ఆ వయసులో తన కొడుక్కి చక్కటి స్వెటర్‌ని చేత్తో కుట్టింది. అమ్మప్రేమ అల్లుకున్న ఈ స్వెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. 91 ఏళ్ల వయసులో అదికూడా మంచానికే పరిమితమై ఉన్నప్పటికీ కొడుకు మీద ప్రేమతో ఎంతో శ్రద్ధగా ఆ తల్లి చేత్తో స్వెటర్ కుట్టిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

16+ లక్షల వ్యూస్..

అమ్మప్రేమ.. అందమైన స్వెటర్ గురించి సోషల్ మీడియాలో పంచుకున్నాడు తన కొడుకు అరుణ్ భగవతుల. లక్షల మంది హృదయాలను ఈ పోస్ట్ కదిలించి.. తల్లి ప్రేమ ఎంత గొప్పదో చూపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో 16 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఇది కేవలం ఒక స్వెటర్‌కు దక్కిన ఆదరణ కాదు. దునియాలో ఉండే అమ్మలందరీ ఆత్మీయ బంధాన్ని గుర్తుచేస్తున్న చక్కటి సందేశం. అరుణ్ వీడియోతో పాటు రాసిన క్యాప్షన్ ఇంకా ఆకట్టుకుంటోంది. ''స్వెట్టర్ చిన్నది కావచ్చు.. కానీ ఆమె ప్రేమ ఎప్పుడూ తక్కువ కాదు'' అనేదే ఆ క్యాప్షన్.

ప్రేమకు మాస్టర్‌పీస్‌..

ఆధునిక జీవితంలో ఎంతో బిజీగా ఉండే కుటుంబాల్లో తల్లులు చేసే చిన్న చిన్న సేవలు గుర్తించబడవు. కానీ ఈ వీడియో అలాంటి సందర్భాన్ని వెల్లడించి తల్లి పాత్ర ఎంత ముఖ్యమో గుర్తుచేస్తోంది. ఆమె ఉన్న పరిస్థితిని చూస్తుంటే స్వెట్టర్ పరిమాణం సరిగ్గా ఉండకపోవచ్చు. కానీ అది ప్రేమతో నిండిన కళాఖండంగా మిగిలిపోతుందని మాత్రం పక్కాగా చెప్పొచ్చు. ఫాస్ట్ ఫ్యాషన్.. డిజిటల్ షాపింగ్ హవా ఉన్న కాలంలో చేత్తో స్వెట్టర్ అల్లడం ఎంతో విలువైనది. ప్రతి అల్లిక తన కొడుక్కి వెచ్చదనం అందించాలనే తాపత్రయాన్ని ప్రతిబింబిస్తుంది. నెటిజన్లు దీన్ని అమ్మ ప్రేమకు మాస్టర్‌పీస్‌గా అభివర్ణిస్తున్నారు.

వృద్ధుల్లోనూ సృజనాత్మకత..

సోషల్ మీడియాలో ఈ కథకు వచ్చిన స్పందన అపారం. వేలాది మంది తమ తాతమ్మల నుంచి చేత్తో చేసిన వస్తువుల గురించి తమ అనుభవాలు పంచుకున్నారు. కొందరు నాస్టాల్జియాను గుర్తుచేసుకుంటే మరికొందరు తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడారు. సోషల్‌మీడియా తరచూ నెగెటివ్‌గా విమర్శించబడుతుంది. కానీ ఈసారి అది సానుభూతి.. సమిష్టి భావనలకు వేదికయింది. కుటుంబ సంప్రదాయాలు.. చిన్న విషయాలు ఎలా బంధాలను బలోపేతం చేస్తాయో చర్చకు దారితీసింది. మంచానికే పరిమితమైన వృద్ధుల్లో కూడా సృజనాత్మకత ఉంటుందని చాటిచెప్తోంది.

Next Story