- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగ్నపాదాలతో.. 25 ఏళ్ల గోసేవా యాత్ర.!
ధరమ్‌రాజ్ రాంఖా గురించి కొంతైనా నేటితరం తెలుసుకోవాలి

దిశ, ఫీచర్స్: ఆయన జీవితమెంతో చూసిన వ్యక్తి. కానీ కాళ్లకు చెప్పుల్లేకుండా తిరుగుతాడు. జీవితానికి సరిపడా సంపాదించాడు. కానీ.. సాదా సీదాగా ఆవుల మందలో కూర్చుని పాలు పిండుతూ కనిపిస్తాడు. ఆయన వయసెంతో తెలుసా.? 85 ఏళ్లు. ప్రముఖ జువెలరీ వ్యాపారిగా హైదరాబాద్ ప్రజలకు సుపరిచితుడైన ఆ వ్యక్తే ధరమ్‌రాజ్ రాంఖా. ఎన్నో ఏళ్లుగా గోసేవలో తరిస్తూ నేటితరానికి స్ఫూర్తినిస్తున్న ధరమ్‌రాజ్ రాంఖా గురించి కొంతైనా నేటితరం తెలుసుకోవాలి.
25 ఏళ్లుగా..
ధరమ్‌రాజ్ రాంఖా ఒకప్పుడు జువెలరీ వ్యాపారి. బిజినెస్‌లో అంతకంతకూ ఎదుగుతున్న సమయంలో అకస్మాత్తుగా సేవారంగంలోకి ఎంటరయ్యాడు. జీవిత పరమార్థం సేవలోనే దాగుందని నమ్మే ఆయన.. గోసేవను తన మార్గంగా ఎంచుకున్నాడు. శంషాబాద్ సమీపంలోని గగన్ పహాడ్‌లో "సత్యం శివం సుందరం గో నివాస్"ను ఏర్పాటుచేసి 6000కు పైగా ఆవులు.. దూడలు.. ఎద్దులను సంరక్షిస్తున్నాడు. 25 ఏళ్ల క్రితం "సత్యం శివం సుందరం గో నివాస్"ను స్థాపించాడు ధరమ్ రాజ్ రాంఖా. ఇది దేశంలోనే అత్యంత శ్రద్ధగా నిర్వహిస్తున్న గోశాలగా గుర్తింపు పొందింది.
దేశంలో అతిపెద్ద గోశాల..
ఎనిమిది ఎకరాల్లో విస్తరించిన "సత్యం శివం సుందరం గో నివాస్" దక్షిణ భారతదేశంలో అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. 80,000 చదరపు అడుగుల ఆర్సీసీ షెడ్లు.. శుభ్రమైన నీటి వ్యవస్థ.. ఆధునిక సౌకర్యాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ ఎవరో చెప్తేనో లేదా ఇంకెవరో గైడ్ చేస్తేనో చేయలేదు. ధరమ్‌రాజ్ రాంఖా సొంత ఆలోచన ఇదంతా. ఎవరైనా వ్యాపారాన్ని విస్తరింపజేయాలనుకుంటారు లేదా ఆస్తులను అభివృద్ధి చేసుకోవాలనుకుంటారు. కానీ ఇతడు మాత్రం గోశాలను అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళిక వేసుకున్నాడు. ఇప్పటికీ గోశాలలోని ప్రతీ ఆవును.. ప్రతీ దూడను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటాడు.
చెప్పుల్లేకుండా..
"సత్యం శివం సుందరం గో నివాస్"లోని ఆవుల పాలను వాటి దూడలకే వదిలేస్తారు. ఆవుల పేడను రైతులకు ఎరువుగా చాలా తక్కువ ధరకు ఇస్తారు. గోశాల నిర్వహణకు నెలకు ఖర్చే రూ.70 లక్షలు అవుతుందంటే ఎంత పెద్ద వ్యవస్థో అర్థం చేసుకోవచ్చు. 100 మందికి పైగా కార్మికులకు ఇక్కడ సంవత్సరం పొడవునా ఉపాధి దొరుకుతోంది. 25 ఏళ్ల క్రితం గోశాల స్థాపన సమయంలో గోసేవలో చెప్పులు ధరించను అని ప్రతిన పూనాడు ధరమ్‌రాజ్ రాంఖా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నగ్న పాదాలతోనే ఉన్నాడు. అందుకే ఆయన్ను జనాలు బేర్ ఫుట్ సెయింట్ అని పిలుస్తుంటారు.
గ్లోబల్ వార్నింగ్..
గోశాల 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా "సత్యం శివం సుందరం గో నివాస్"లో మహా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా పంచకుండాత్మక చండీ హవనం.. అన్నకూట్ ప్రసాదం.. భజనలు.. నృత్యాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవ ఉద్దేశం గోసేవ గురించి చెప్పడమే కాదు.. కాలుష్యం.. వాతావరణ మార్పులపై అవగాహన కూడా కల్పిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ కాదు.. గ్లోబల్ వార్నింగ్ అని హెచ్చరిస్తున్నాడు ధరమ్ రాజ్. పండిట్ హరిశ్చంద్రజీ కులకర్ణి.. బాప్జీ మహారాజ్ ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్లాన్ చేశారు.
సేవలోనే జీవితం..
జీవిత పరమార్థం మొత్తం సేవలోనే దాగివుందని అంటాడు ధరమ్‌రాజ్ రాంఖా. అందుకే శంషాబాద్ సమీపంలో రూ.3 కోట్లతో "మా సరస్వతి వెటర్నరీ హాస్పిటల్" కూడా నిర్మించారు. దీనిద్వారా సంవత్సరానికి 3000 ఆపరేషన్లు.. 40000 జంతువులకు ట్రీట్మెంట్ సేవలు అందిస్తున్నారు. దీంతోపాటు బుర్జుగడ్డలో మరో గోశాలను కూడా నిర్వహిస్తున్నారు.






