కిలిమంజారో క్వీన్.. 72 ఏళ్లలో ట్రెక్కింగ్.!

by Daayi Srishailam |

72 ఏళ్ల వయసులో పర్వతాలు ఎక్కుతూ వృద్ధాప్యానికి కొత్త నిర్వచనం చెప్తోంది

కిలిమంజారో క్వీన్.. 72 ఏళ్లలో ట్రెక్కింగ్.!
X

దిశ, ఫీచర్స్: విజయనగర సామ్రాజ్యపు నేపథ్యమున్న విద్యా సింగ్‌కు క్రీడలంటే ప్రాణం. తల్లిదండ్రులు టెన్నిస్.. గోల్ఫ్.. గుర్రపు సవారీలు ఆడేవారు. ఆ హాబీ తనకు కూడా అబ్బింది. మద్రాస్ యూనివర్శిటీలో మహిళల టెన్నిస్ జట్టు కెప్టెన్‌గా ఉండేది. స్విమ్మింగ్‌లో జాతీయ స్థాయి బంగారు.. వెండి పతకాలు కూూడా గెలుచుకుంది. ఇప్పుడు 72 ఏళ్ల వయసులో పర్వతాలు ఎక్కుతూ వృద్ధాప్యానికి కొత్త నిర్వచనం చెప్తోంది.

19 ఎత్తయిన పర్వతాలు..

2013లో విద్యాసింగ్ తొలిసారిగా లడఖ్ పర్యటనలో 17700 అడుగుల ఎత్తు ట్రెక్కింగ్ చేసింది. మంచు కొండలు మధ్య బెరకు లేకుండా నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకుంది. అక్కడి మంచు కొండలు.. నీలాకాశం.. నిశ్శబ్దం చూసి ఎవరికైనా భయమేస్తుంది. కానీ.. ఆ దృశ్యాలు విద్యాసింగ్‌కు మనసును గెలుచుకున్నాయి. ఆ క్షణంలోనే తనకు తెలిసిపోయిందట.. పర్వతాలతో ప్రేమలో పడిందనీ. అక్కడి నుంచి ఆమె జీవితం మళ్లీ మొదలైంది. 6,250 మీటర్ల మెంటోక్ కాంగ్రీ.. 6,111 మీటర్ల యూనమ్ పీ వంటి ఎత్తయిన శిఖరాలు ఒక్కొటిగా ఎక్కసాగింది. అలా ఇప్పటివరకు 19 ఎత్తయిన పర్వతాలు అధిరోహించింది.

రాత్రిపూట యాత్ర షురూ..

ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్ కిలిమంజారో పర్వతాన్ని ఈ ఏడాది మార్చి 6 నుంచి 13 వరకు పూర్తిచేసింది విద్యా సింగ్. రాత్రిపూట 10:30 గంటలకు హెడ్‌ల్యాంప్ వెలుగుల్లో తన యాత్ర మొదలైంది. స్టెల్లా పాయింట్.. ఉహూరు పీక్ దాటుకుంటూ మార్చి 13 ఉదయం 7 గంటలకు శిఖరాన్ని చేరుకుంది. దిగుతుండగా నాలుగు సార్లు జారి పడింది. మట్టి.. రాళ్లు.. జారుడు దారి.. ఇవేవీ తన లక్ష్యాన్ని ఆపలేకపోయాయి. ఆమె మాట ఒక్కటే.. "పర్వతం నాకు చాలా పాఠాలు నేర్పింది. ప్రతి అడుగూ జాగ్రత్తగా.. ధైర్యంగా వేస్తూ చేరుకున్నాను" అని అంటోంది.

వారానికి 60 కిలోమీటర్లు..

విద్యా సింగ్ రోజువారీ దినచర్య చూస్తే యువత ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆమె ఇప్పటికీ వారానికి ఒకసారి 60 కిలోమీటర్ల సైక్లింగ్ యాత్ర చేస్తుంది. గత పన్నెండేళ్లుగా స్విమ్మింగ్ చేస్తోంది. అంతేకాదు జాతీయ ఈత పోటీల్లో పాల్గొంటుంది కూడా. వారంలో రెండు రోజులు 8 కిలోల వెయిటెడ్ జాకెట్ వేసుకుని నడుస్తుంది. దానివల్ల వెయిట్ కంట్రోల్ అవుతుంది. ఇక ఆహారం విషయానికి వస్తే.. పండ్లు.. కూరగాయలు.. గింజలు.. సలాడ్స్.. వారంలో నాలుగు రోజులు గుడ్లు తీసుకుంటుంది. ఇదే తన మెనూ. తను ఏ పర్వతాన్నీ "జయించాను" అని చెప్పదు. పైగా ప్రతీ పర్వతాన్ని మొక్కుతుంది.

చెత్తను కిందికి తీసుకొస్తుంది..

పర్వతారోహణలో అలసిపోయి చాలామంది చెత్తా చెదారాన్ని ఎటుపడితే అటు పడేస్తారు. కానీ.. విద్యా సింగ్ చెత్తను ఎక్కడా పడేయదు. ప్లాస్టిక్ కవర్లలో జమ చేసుకొని దానిని కిందికి తిరిగి తెస్తుంది. "పర్వతాలను గౌరవిస్తే అవి మనల్ని గౌరవిస్తాయి. ఈగో పక్కన పెట్టి ఓపికతో ఒకరికొకరు సాయంతో ఎక్కాలి" అనేది ఆమె సిద్ధాంతం. "నేను 59 ఏళ్లకు ట్రెక్కింగ్ మొదలెట్టాను. 20 ఏళ్లకే మొదలెట్టి ఉంటే ఇంకా ఎక్కువ చేసేదాన్ని. శరీరం ఫిట్‌గా ఉంటే.. ఏ పర్వతమైనా ఎక్కొచ్చు. మన హిమాలయాలు ప్రపంచంలోనే అద్భుతం" అని గర్వంగా చెప్తోంది. నిజంగా 72 ఏళ్ల వయసులో కిలిమంజారో ఎక్కడమంటే మాటలు కాదు.

Next Story