- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుచ్చి యాదిలో.. చెమట చుక్కల సోపతుల సరదా ముచ్చట.!
అలా మొదలయ్యేది మా ఇంటి దినచర్య

సమయం తెల్లవారుజామున 5 గంటలు...‘అరే నరుడూ.. తెల్లారింది లే బిడ్డా..’నాన్న బుచ్చయ్య పిలుపుతో ఒక్కసారి కళ్లుతెరిచేది. ఆ వెంటనే ‘గా పొయ్యిల కట్టెలు పెట్టి.. మంట పెట్టు బిడ్డా’ అని అమ్మ యాదమ్మ ఆప్యాయపు పలుకు వినిపించేది.
ఇదే దినచర్య..
అలా మొదలయ్యే మా ఇంటి దినచర్య.. పొయ్యిమీద గాసం పెట్టి నాతో పాటు అక్క, తమ్ముడికి గబగబా స్నానం చేయించి, తయారు చేసి అమ్మ స్కూలుకు పంపేది. ఈలోపు నాయిన పొలం కాడికిపోయి వచ్చేటోడు. ఆయనొచ్చేసరికి అమ్మ సద్ది సిద్దం చేసి.. సైకిల్ మీద ఇద్దరూ పనికి పోయేది. నాయిన మేస్త్రీ. అమ్మ కూలీ. ఇద్దరిదీ చెమట చుక్కల ప్రయాణమే. నిత్యం ఎన్నో కొత్త కొత్త ఇల్లు కట్టే మా నాయిన.. మాకోసం కొత్త గూడు సిద్ధం చేయనీకి రెక్కలు ముక్కలు చేసుకున్నాడు. అమ్మనాన్నలు దశాబ్దానికిపైగా ఇదే దినచర్య కొనసాగించారు.
కౌలు తిప్పలు.. కన్నీళ్లు
ఈ రెక్కల కష్టం ఇంకెన్నాళ్లనీ.. చేనుదారి పట్టిండ్రు. రూపాయి.. రూపాయి.. కూడబెట్టిన డబ్బులతో బోరు వేస్తే చుక్క నీరు పడలే. కూరగాయల సాగు మందమైనా నీళ్లొస్తే బాగుండు.. దేవుడికి దండం బెట్టి... ఇంకోటి వేసిన్రు. అయినా గదే పరిస్థితి. ఈ సారి నీటితడి నాయిన కండ్లలో కనిపించింది. పిల్లలు పెరుగవట్టె.. పూట గడిచేందుకు తిప్పలు పడొద్దని బటాకి (కౌలు) బాట పట్టిండ్రు. దున్నకానికి ఎడ్లు కూడా కొన్నడు. తెల్లావారు జాముకు ముందే చేనుకెళ్తే.. చీకటిపడేదాక అక్కడే ఉండేది. సద్ది కట్టుకుని చెట్టుకు కింద తీసిన కునికిపాట్లు తీసిన రోజులెన్నో. అలా పదేళ్ల పాటు అమ్మనాన్నలకు కౌలు పాట్లు తప్పలేదు.
అప్పుచేసి భూమి కొని..
మా ఊర్ల 5వ తరగతి పూర్తయ్యాక అక్కకు నార్సింగి హాస్టల్లో, నాకు, తమ్ముడికి చిల్కూరు హాస్టళ్ల సీటొచ్చింది. మేమంతా హాస్టళ్లలో ఉన్నా.. అమ్మనాయినలు కష్టాలు తప్పలేదు. కూలోనాలో చేసి మాకు డబ్బులు పంపించేది. కొన్నాళ్లకు నాయిన అప్పుజేసి మరీ పొత్తుల భూమి కొన్నడు. అందులో బోరు వేస్తే నీళ్లు కూడా పడ్డయ్.. అప్పటి నుంచి ఆ భూమే మాకు ఆధారమైంది. అక్క పెళ్లప్పుడు వారసత్వ భూమి అమ్మాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, నాయిన అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఎడ్లు అమ్మాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం కూడా నేను మరిచిపోలేను.
కాలగమనంలో..
కాలం గిర్రున తిరిగింది. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. మా కూతుళ్లు బడికి కూడా వెళ్తున్నరు. అమ్మనాయిన వయసు రీత్యా కొంత రికాం చేసుకున్నరు. కానీ ఇటీవల మనుమరాళ్ల కోసం ఇద్దరూ కలిసి వాళ్ల స్కూల్ కు వెళ్లారు. మొయినాబాద్ లో ఉన్న ఆ స్కూల్ కు వెళ్లినపుడు టీచర్లు ఆడించిన ఆటలో వీళ్లూ పాల్గొన్నారు. అమ్మ బతుకమ్మ ఆడడం, నాయిన పీర్ల పండుగకు అలయ్ ఆడడమే మాకు తెలుసు. నేనెప్పుడైనా క్రికెట్ ఆటకు పోయినా.. నాన్న కోప్పడేది. చదువుకో బిడ్డా.. నీ బతుకు నాలెక్క కావొద్దని చెప్పేటోడు. కానీ ఇన్నేళ్ల తరువాత మనవరాళ్ల కోసం వాళ్లిద్దరూ చిన్నపిల్లల్లా మారిపోయారు. తీరొక్క ఆటలో భాగస్వాములు అయ్యారు. వాళ్ల బాల్యంలో కోల్పోయిన ఏళ్లనాటి మధుర జ్ఞాపకాలను మనసారా ఆస్వాదించారు. నాకు ఊహ తెలిసిన నాటి నుంచి వాళ్లిద్దరినీ అలా చూడలేదు. కష్టాలు, కన్నీళ్లు పెనవేసుకున్న పేగుబంధం నడుమ పెరిగిన మేము.. వాళ్లిద్దరినీ అలా చూసినపుడు మా కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. ఈ సారి వచ్చిన కన్నీళ్లు మాత్రం ఆనంద భాష్పాలు.
- జూకంటి నరేందర్, ముడిమ్యాల, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా






