ఇందు ఆంటోనీ ఉద్యమం.. ఆడవాళ్లకూ వీధి హక్కు.!

by Daayi Srishailam |   (  Updated:2025-12-16 15:38:48  IST  )

ఏడేళ్ల క్రితం తనపై జరిగిన ఓ దాడి ఆమెను ఈ మార్పు దిశగా నడిపించింది

ఇందు ఆంటోనీ ఉద్యమం.. ఆడవాళ్లకూ వీధి హక్కు.!
X

లైదిశ, ఫీచర్స్: మహాత్మా గాంధీ ఏం చెప్పాడు.? ఆడవాళ్లు అర్ధారాత్రి రోడ్డుపై ఎలాంటి భయంలేకుండా తిరిగినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అనే కదా.? అర్ధరాత్రి అటుంచితే పగలు తిరిగే పరిస్థితి ఉందా.? బెంగళూరు వంటి నగరాల్లో అయితే ఇంకా భయానక పరిస్థితి. అలాంటి భయాన్ని అధిగమించి.. మహిళలు నిర్భయంగా తిరగగలిగేలా చేస్తోంది ఓ కళాకారిణి. ఆమె పేరు ఇందు ఆంటోనీ. ఏడేళ్ల క్రితం తనపై జరిగిన ఓ దాడి ఆమెను ఈ మార్పు దిశగా నడిపించింది.

సెసిలియా స్ఫూర్తి..

ఇందు ఆంటోనీ ఫెమినిస్ట్ కళాకారిణి. ఏడేళ్ల క్రితం రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా ఇద్దరు యువకులు తన ముఖం మీద ఉమ్మేశారు. ఆ క్షణం ఆమె ఒళ్లు గగుర్పొడిచింది. ఇంటికెళ్లి ముఖం.. బట్టలు ఉతికినా ఆ అవమానం మనసులో అట్లనే నాటుకుపోయింది. బస్సులో ఎవరైనా తాకితే సేఫ్టీ పిన్నుతో పొడచాలని వాళ్లమ్మ చిన్నప్పుడు చెప్పేది. అలాంటివెన్నో ఎదుర్కున్నా ఉమ్మి విషయం మాత్రం తనకు అస్సలు అర్థం కాలేదు. వాళ్లెందుకలా చేశారు.? అసలు నేను వాళ్లను ఏమన్నాననీ.? వంటి ప్రశ్నలెన్నో వేసుకుంది. 2017లో మల్లేశ్వరంలో సైకిల్ తొక్కుతూ వెళ్తున్న ఓ వృద్ధురాలిని చూసింది ఇందు. ఆమె పేరు సెసిలియా. ఆ 70 ఏళ్ల సెసిలియానే తనకు స్ఫూర్తినిచ్చింది.

జెండర్ డిస్‌రప్టర్..

సెసిలియా స్ఫూర్తితో ఇందు 2018లో సిసిలియా’డ్ అనే ప్రాజెక్టును స్టార్ట్ చేసింది. సిసిలియాను "జెండర్ డిస్‌రప్టర్" సూపర్‌హీరోగా ప్రకటించింది. హెచ్‌బీఆర్ లేఅవుట్ వార్డు నుంచి మొదలైన ఈ ప్రయాణంలో ఇందు చేసిందల్లా ఒక్కటే మహిళలకు "అసురక్షితం" అనిపించే వీధుల్ని మళ్లీ తెరచి ఆడవాళ్ల సొంతం చేసింది. పోలీస్ స్టేషన్ల నుంచి డేటా తెచ్చుకుని అంగన్‌వాడీ కార్యకర్తలతో మాట్లాడింది. బార్బర్ షాప్.. హార్డ్‌వేర్ షాప్.. బైక్ మెకానిక్ షాప్.. మద్యం షాపు ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువ దాడులు జరుగుతున్నాయనే విషయం వారి ద్వారా తెలుసుకుంది. నిజంగానే ఆ ప్రాంతాల్లో ఎక్కడకూడా వీధిలైట్లు లేవు.. సీసీ కెమెరాలు లేవు.

వీధులన్నీ గూగుల్ మ్యాప్‌..

బీబీఎంపీ మీటింగులకు ఆడవాళ్లను తీసుకెళ్లి పిటిషన్లు ఇప్పించింది ఇందు ఆంటోని. స్తంభాలకు లైట్లు పెట్టించింది. ఉదయం పేపర్‌లలో పాంఫ్లెట్లు పడేలా చేసింది. బార్బర్ షాప్‌లో టీవీ పెట్టి తమ ప్రాజెక్ట్ వీడియోలు ప్లే చేయించింది. ఆడవాళ్లు రాసిన కథలు.. ఫొటోలు పేపర్‌లో వచ్చాయి. ఇదంతా చూసిన ప్రజలు ఆశ్చర్యంగా "అసలేం జరుగుతోంది?" అనే సంభాషణలు స్టార్ట్ చేశారు. ఆ వీధులకు ఇందు ఒక కొత్త పేరు పెట్టింది. సిసిలియమ్మను ఫ్యాన్సీ కారులో తీసుకొచ్చి కార్పొరేటర్.. అంగన్‌వాడీ టీచర్లతో కలిపి రిబ్బన్ కట్ చేయించింది. ఆ వీధులన్నీ గూగుల్ మ్యాప్‌లో గుర్తు పెట్టారు. ఆడవాళ్లకూ వీధి హక్కు ఉంది అని స్కూళ్లలో పిల్లలకు చెప్పారు.

Next Story