- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగం ముంచితే.. క్రియేటివిటీ నిలబెట్టింది.!
ఉద్యోగం పోతే బాధపడకుండా క్రియేటివిటీని నమ్ముకొని లక్షలు సంపాదిస్తోంది

దిశ, ఫీచర్స్: మార్కెట్లో చాలా ఉద్యోగాలున్నాయి. కానీ ప్రైవేటు ఉద్యోగాలు చాలామటుకు తుమ్మితే ఊడిపోయేవే. లౌక్యంలేక కొందరు.. నైపుణ్యంలేక కొందరు.. రెండూ ఉన్నా పై అధకారులు గుర్తించిక కొందరు ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. దీనివల్ల కొందరు కుమిలిపోతే.. తమ క్రియేటివిటీతో నిలిచి గెలిచేవాళ్లు కొందరు. అలాంటివారిలో ఒకరు ఆర్షి అన్సారీ.
యాక్సిడెంట్ తర్వాత..
ఆర్షి అన్సారిది ఉత్తరాఖండ్‌లోని హల్ద్‌వాని. యూపీపీసీఎల్‌లో ఉద్యోగం చేసేదామె. ఎంబీఏ చేయాలనే ఆలోచనతో 2024లో ఉద్యోగం వదిలేసింది. కష్టపడి చదివి ఎంబీఏ సీటు కూడా సంపాదించింది. చదువుతూనే ఏదైనా పనిచేస్తే ఖర్చులకు డబ్బు వస్తుంది.. పైగా వృత్తి నైపుణ్యమూ పెరుగుతుందని ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ చూసుకుంది. ఆఫీసుకు వెళ్తుంటే తనకొక యాక్సిడెంట్ జరిగింది. ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి. సమస్య తీవ్రత దృష్ట్యా కంపెనీ మేనేజర్‌కు అప్‌డేట్ ఇవ్వలేదు. ఆ చిన్న పొరపాటుకు తర్వాతి రోజే ఉద్యోగం పోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి.
అన్‌ప్రొఫెషనల్ మరక..
ఉద్యోగం పోతే పోయిందిలే అనుకుందిగానీ.. ఎక్స్‌పీరియన్స్ లెటర్‌లో “అన్‌ప్రొఫెషనల్” అని రాయడం తనకు బాధ కలిగించింది. దానివల్ల ఇంకో ఉద్యోగం దొరకడం కష్టమైంది. కొన్ని నెలలపాటు ఈ గందరగోళం కొనసాగింది. ఐతే ఆర్షి పరిస్థితిని వాళ్ల నాన్న గమనించాడు. పోయింది ఉద్యోగం మాత్రమే.. జీవితం కాదుకదా అని కూతుర్ని ప్రోత్సహించాడతను. నీలో సృజనాత్మకత ఉంది.. దాన్ని వృథా చేయకు అని ధైర్యాన్నిచ్చాడు. పెద్ద పెద్దవేమొద్దు.. చిన్న స్టార్టపే మొదలుపెట్టమని కూతురికి రూ.30 వేలు పంపాడు. దానికి ఇంకో రూ.10వేలు జోడించి ఆర్షి లుమినారాను స్టార్ట్ చేసింది.
చాట్ జీపీటీ సాయంతో..
హ్యాండ్ పోర్డ్ క్యాండిల్స్ తయారు చేయాలనేది తన ఆలోచన. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేసింది. క్యాండిల్ మేకింగ్ తెలియకపోయినా చాట్ జీపీటీ సాయంతో నేర్చుకుంది. ఒక ఇంటిని కిరాయికి తీసుకొని మోల్డ్స్.. గ్లాసెస్.. కలర్స్ వంటివి కొనుగోలుచేసి రోజ్.. వెనిల్లా ఫ్రెగ్రెన్స్‌లతో మొదలుపెట్టింది. తర్వాత మరో ఐదు జోడించింది. మార్కెట్ రీసెర్చ్ చేసి ఒరిజినాలిటీ.. క్రియేటివిటీ సరిపోల్చుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రొడక్ట్ పబ్లిసిటీ చేసింది. రెండు మూడు రోజుల్లోనే ఆర్డర్లు వచ్చాయి. సిగ్నేచర్ ఫ్రెగ్రెన్స్ కోసం సైంటిస్ట్ సాయం తీసుకుని కాపీరైట్ కూడా అప్లయ్ చేసింది.
నెలకు మూడు లక్షలు..
క్లాస్‌మేట్ సత్యం శర్మతో ఉచితంగా వెబ్‌సైట్ డిజైన్ చేయించింది. తర్వాత అతన్ని కో-ఫౌండర్‌గా మార్చింది. దివాళీ థీమ్ క్యాండిల్స్ లాంచ్ చేయగా లడ్డు షేప్ క్యాండిల్స్ వైరల్ అయ్యాయి. ఒక్క రోజులో 500+ ఆర్డర్లు వచ్చాయి. ఒకే ఒక్క నెలలో రూ.84 వేల రెవెన్యూ.. 55 కస్టమర్ ఆర్డర్లు వచ్చాయి. 2026 జనవరి నాటికి రూ.2 లక్షలకు పైగా రెవెన్యూ వచ్చింది. దీంతో ఆఫ్‌లైన్ స్టాల్స్ కూడా పెట్టింది. లుమినారా ఫిబ్రవరిలో రూ.3 లక్షల టార్గెట్ పెట్టుకుంది. రూ.40వేలు వచ్చే ఉద్యోగం పోతే బాధపడకుండా క్రియేటివిటీని నమ్ముకొని నెలకు మూడు లక్షలు సంపాదించే దిశగా వెళ్తోందంటే మామూలు ముచ్చట కాదు.






