అదరహో అనోమాలియా.. పుట్టగొడుగులే ఫర్నిచర్.!

by Daayi Srishailam |

పుట్టగొడుగులను కన్సోల్స్, బ్లాక్‌లు, టెక్స్‌టైల్స్‌గా మారుస్తున్నారు

అదరహో అనోమాలియా.. పుట్టగొడుగులే ఫర్నిచర్.!
X

దిశ, ఫీచర్స్: ఫర్నిచర్‌ను తయారుచేస్తాం కదా.? అలా కాకుండా.. పంటల ద్వారా పండిస్తే ఎలా ఉంటుంది.? ఫర్నీచర్‌ని పండించడమా.? అని ఆశ్చర్యపోకండి. ఇక్కడొక స్టార్టప్ అదే పనిచేస్తోంది. దానిపేరు అనోమాలియా. ఆ స్టార్టప్ నిర్వహకులు ముంబై ఆర్కిటెక్చర్స్ భక్తి లూనావత్, సుయాష్ సావంత్. పుట్టగొడుగులను కన్సోల్స్, బ్లాక్‌లు, టెక్స్‌టైల్స్‌గా మారుస్తున్నారు.

ఫ్యాషన్‌ మూవ్‌మెంట్‌లా..

పుట్టగొడుగు ఫర్నిచర్ అనగానే విచిత్రంగా అనిపిస్తుంది. కానీ.. ఇది స్లో ఫ్యాషన్‌ మూవ్‌మెంట్‌లా మారిపోతోంది. ఇది మన్నికైనది కూడా. 70-80 కిలోల బరువును తట్టుకుంటుంది. ఈ పుట్టగొడుగు ఫర్నీచర్ కాన్సెప్ట్ భక్తి లూనావత్, సుయాష్ సావంత్ అనే ఆర్కిటెక్చర్లది. దానికోసం ముంబైలో 'అనోమాలియా' స్టార్టప్‌ను ప్రారంభించారు. వాళ్ల జర్నీ ముంబై ఆర్కిటెక్చర్ స్కూల్‌లో మొదలైంది. గ్రాడ్యుయేషన్ తర్వాత బార్సిలోనాలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కాటలోనియాలో చదువుకున్నారు. తర్వాత భక్తి స్పానిష్ ఆర్కిటెక్ట్ రికార్డో బోఫిల్‌తో.. సుయాష్ లిస్బన్‌లో పనిచేశారు.

ఫర్నిచర్‌ను పెంచుతారు..

2022లో ముంబైకి తిరిగి వచ్చి సెప్టెంబర్‌లో అనోమాలియాపై దృష్టిపెట్టారు. కన్‌స్ట్రక్షన్, డిజైన్ పరిశ్రమల్లో ఉత్పన్నమయ్యే వ్యర్థాలు చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడుచూసినా వ్యర్థాలు తగ్గించడం, పునర్వినియోగం గురించే ఆలోచించేవాళ్లు. కరోనా సమయంలో ఇంటికే పరిమితమై, కప్‌కేక్ ట్రేల్లో పుట్టగొడుగులు పెంచారు. అక్కడి నుంచి ఇటుకలు, పార్టిషన్‌లు, టెక్స్‌టైల్స్, ఫర్నిచర్‌తో ప్రయోగాలు చేస్తూ వచ్చారు. వీళ్ల ప్రత్యేకత ఏంటంటే.. అనోమాలియాలో ఫర్నిచర్‌ను తయారుచేయరు. పంటలను పెంచినట్లు పెంచుతారు.

180 రోజుల్లోనే భూమిలోకి..

అనోమాలియా మొదటి కలెక్షన్ 'గ్రోన్ నాట్ బిల్ట్'లో మైక్రోబ్లాక్‌లు ఉంటాయి. వీటిని వ్యవసాయ వ్యర్థాలతో పుట్టగొడుగులు చుట్టి ఫర్నీచర్ తయారుచేస్తారు. ప్రతి బ్లాక్ 1.5 కేజీల బరువు, 1.5 టన్నుల కంప్రెసివ్ లోడ్ తట్టుకుంటుంది. ఇవి స్టూల్స్, టేబుల్స్, షెల్వ్‌లు, పార్టిషన్‌లుగా చేయవచ్చు. రెండో లైన్ 'మైకోలివింగ్'లో పుట్టగొడుగుల టెక్స్‌టైల్స్ ఉంటాయి. ఇవి లెదర్‌కు వేగన్ ఆల్టర్నేటివ్. సన్నని షీట్‌లను పీల్ చేసి ప్రాసెస్ చేసి సీటింగ్, అప్‌హోల్‌స్టరీకి ఉపయోగిస్తారు. మామూలు ఫర్నిచర్ 10-12 ఏళ్ల తర్వాత మట్టిలో కలుస్తుంది. కానీ అనోమాలియా పుట్టగొడుగుల ఫర్నీచర్ 180 రోజుల్లోనే కలిసిపోతుంది.

ఫంగై ఫర్నీచర్ లక్ష్యం..

2025లో అనోమాలియా వెనిస్ బియెన్నాలేలో చోటు సంపాదించుకుంది. గ్లోబల్ ఫర్నిచర్ ఇండస్ట్రీలో ఉన్న ఎమ్‌డీఎఫ్, లామినేట్స్, ప్లాస్టిక్‌ ఆధిపత్యానికి గట్టి పోటీ ఇస్తూ పుట్టగొడుగు ఫర్నిచర్ దూసుకెళ్తుందని చెప్తున్నారు నిపుణులు. ఇది బయోడిగ్రేడబుల్. వ్యవసాయ వ్యర్థాలతో తయారుచేయడం వల్ల సవాళ్లు కూడా ఎదురవుతాయి. పెరిగే సమయంలో కంటామినేషన్ సాధారణం. బ్లాక్‌లు పాడవుతాయి. మాయిశ్చర్ మరో సమస్య. అన్నింటిని అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. ఇంటీరియర్స్‌తో పాటు.. గోడలు, రూఫ్‌లు, పార్టిషన్‌లకు ఉపయోగపడేలా ఫంగైతో ఫర్నీచర్ చేయాలనేది వాళ్ల లక్ష్యం.

Next Story