ఇదేం ఇల్లురా నాయనా.. ఇంత కూల్‌గా ఉందీ.?

by Daayi Srishailam |

ఒకసారి గుజరాత్ దాకా వెళ్లొద్దాం పదండీ.

ఇదేం ఇల్లురా నాయనా.. ఇంత కూల్‌గా ఉందీ.?
X

ఫ్ఫ్.....

ఏం ఎండలివీ.?

బయటకెళ్తే కమిలిపోతున్నం..

ఇంట్లో ఉంటే ఉబ్బరంతో కుమిలిపోతున్నం.

తడిబట్టేసుకొని కూల చేసుకున్నా..

ఈ మండే ఎండలను తట్టుకోలేకపోతున్నాం.

ఒకసారి గుజరాత్ దాకా వెళ్లొద్దాం పదండీ.

అక్కడేదో కూల్ హౌజ్ కట్టారట.!!

- దిశ, ఫీచర్స్

బయట 40° ఉష్ణోగ్రత ఉంది. ముందు ముందు ఇంకా తీవ్రంగా ఉంటాయి. ఈ ఎండ.. ఉక్కపోత తీవ్రతను చూస్తే "అబ్బా ఏసీ ఐనా పెట్టించుకోవాలి" అనిపిస్తుంటది. రోజంతా ఫ్యాన్ కిందనే కూర్చున్నా ఉబ్బరం మాత్రం అలాగే ఉంటుంది. కానీ.. ఏసీ గీసీ ఏది లేకుండానే ఈ 40- 41 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఒక ఫ్యామిలీ సల్లగా ఉంటుంది. అదెలాగో తెలుసా.?

కూల్ హౌజ్ మహిమ

మనలాగే వాళ్లూ ఎండాకాలం రాగానే విసనకర్ర పట్టుకొని ఉఫ్ప్.. ఉఫ్ఫ్ అంటూ ఊదుకునేవాళ్లు. మామిడి రసాలు.. నిమ్మ రసాలు తాగి శరీరాన్ని కూల్ చేసుకునేవాళ్లు. ఇంతచేసినా ఏప్రిల్- జూన్ మధ్యలో ఎండ తీవ్రతకు అట్టుడికిపోయేవాళ్లు. రోడ్డుమీద ఆమ్లెటేసుకునే దృశ్యాలెన్నో చూశారు. బయటికెళ్తే ఎండకు కమిలిపోవడం.. ఇంట్లో ఉంటే ఉక్కపోతతో కుమిలిపోవడం జరిగేవి. ఇంట్లో ఏసీ పెట్టుకుందాం అనే ఆలోచన వచ్చింది ఎన్నోసార్లు. కానీ ఏసీ వల్ల ఆరోగ్య సమస్యలొస్తాయని దాని జోలికి పోలేదు. ఇక మా వల్ల కాదు.. అని కూల్ హౌజొకటి కట్టుకుందామనే నిర్ణయానికి వచ్చారు.

అసలేంటీ కూల్ హౌజ్.?

సమీరా రాథోడ్‌ది గుజరాత్‌లోని భరూచ్ నగరం. ఆమె ఒక ఆర్కిటెక్చర్. ఒకానొక సమయంలో అక్కడ 48 డిగ్రీల ఉష్ణోగ్రత. ఏసీ వంటి సౌకర్యాలేవీ లేకుండానే ఈ టెంపరేచర్‌ను బీట్ చేసే ఇల్లు కావాలని భరూచ్‌కు చెందిన ఒక ఫ్యామిలీ సమీరాను సంప్రదించింది. వీళ్లేంటి విచిత్రంగా ఉన్నారు అనుకుందంట మొదట్లో. కానీ తన మీద నమ్మకంతో అడుగుతున్నారు కాబట్టీ కౌల్ హౌజ్ నమూనా ఒకటి చేసి చూపించింది. అది మిగతా ఇళ్లకు భిన్నంగా.. స్పెషల్‌గా.. కంఫర్టబుల్‌గా ఉంటుంది. గాలి.. చల్లదనం ఎప్పుడూ ఇల్లంతా నిండి ఉంటుంది. క్లయింట్ ఓకే చెప్పడంతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు.

పాసివ్ కూలింగ్ డిజైన్

అపార్ట్‌మెంట్ సముదాయంలో 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది ఆ ఇల్లు. బయటివైపు ఎలాంటి డిజైన్లు.. ఎలివేషన్లు లేవు. ఇల్లంతా లోపలికి తెరుచుకునేలా ఇంటీరియర్ కోర్డ్‌యార్డులు అమర్చారు. మధ్యలో చిన్న చిన్న ప్రాంగణాలు.. చెట్లు ఉండేలా ప్లాన్ వేసుకున్నారు. పాసివ్ కూలింగ్ డిజైన్ పద్ధతిలో నార్త్ ఈస్ట్- నైరుతి దిశల్లో గాలి వచ్చేలా ఛానెల్ ఏర్పరిచారు. టెర్రాస్ గార్డెన్.. నీటి మడులు ఏర్పాటుచేశారు. పై అంతస్తులో గార్డెన్ ఉండటం వల్ల కింది అంతస్థు చల్లగా ఉంటుంది. చివరన కోర్ట్‌యార్డ్ ఏర్పాటు చేశారు. వీటివల్ల కాస్త వేడిగా ఉన్నా సౌత్‌లో ఉన్న నీటి మడుల ద్వారా కూల్‌గా ఉంటుంది.

ఇల్లంత సల్లగా

ఇప్పుడెవరైనా ఇంటికి 4 ఇంచుల గోడలే పెడుతున్నారు. కానీ వీళ్లు 18 ఇంచులవే కట్టారు. గోడలు మందంగా ఉండటం వల్ల వేడిని తట్టుకొని లోపలికి చల్లదనాన్నిస్తాయి. లైమ్ ప్లాస్టర్ వాడటం వల్ల గోడలకు ఈ చల్లదనం వస్తుంది. ఈ ఇంటికి మొత్తం పాత కలపనే వాడారు. సౌరశక్తితో పనిచేసే ప్యానల్స్.. గీజర్స్ అమర్చారు. అన్ని దిశలలో గాలి సునాయాసంగా ప్రవహించడానికి 63 చిన్న కిటికీలు పెట్టారు. ఐదేళ్లలో పూర్తిచేసిన ఈ ఇంట్లో మామూలు ఉష్ణోగ్ర ఉంటుంది. బయట 45°C ఉష్ణోగ్రత ఉన్నా.. లోపల 25°C మాత్రమే ఉంటుంది. ఏసీ కాదు.. ఫ్యాన్స్ లేకపోయినా ఇల్లంతా సల్లగా ఉంటుందన్నమాట.

Next Story