భారం తగ్గించనున్న గ్రీన్ ఫీల్డ్ కారిడార్.. అందుబాటులోకి హైటెక్ ఎక్స్ ప్రెస్ వే

by Sujitha Rachapalli |

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానిస్తూ త్వరలో అందుబాటులోకి రానున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్ రవాణా రంగంలో కీలకపాత్ర పోషించనుంది.

భారం తగ్గించనున్న గ్రీన్ ఫీల్డ్ కారిడార్..  అందుబాటులోకి హైటెక్ ఎక్స్ ప్రెస్ వే
X

దిశ, ఖమ్మం రూరల్​: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానిస్తూ త్వరలో అందుబాటులోకి రానున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్ రవాణా రంగంలో కీలకపాత్ర పోషించనుంది. 162 కిలోమీటర్ల మేర నిర్మాణం అవుతున్న ఈ హైటెక్ రహదారి ఇప్పటికే 100 కిలోమీటర్లకు పైగా పూర్తి చేసుకుంది. మొత్తం పనులు పూర్తయితే వాహనదారులకు దూరభారంతో పాటు, ట్రాఫిక్ సమస్యలకు కూడా ఫుల్ స్టాప్ పడనుంది. హైటెక్ హంగులతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా పనులు పూర్తిచేసుకుంటున్న ఈ కారిడార్ దాదాపు 4451.87 కోట్ల ఖర్చుతో రూపుదిద్దుకుంటుంది. కాగా తెలంగాణలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ రహదారిగా ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు స్పీడ్ రోడ్ అతిత్వరలో అందుబాటులోకి రానుంది.

ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రవాణా రంగంలో కీలకపాత్ర పోషించనుంది. సుమారు 4451.87 కోట్ల వ్యయంతో, 162 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతున్న ఈ హైటెక్ వే రెండు రాష్ట్రాలను అనుసంధానిస్తూ వాహనదారులకు వరంగా మారనుంది. ఇప్పటికే దాదాపు 100 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులను పూర్తిచేసుకున్న ఈ రహదారి త్వరలో అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారత్ మాలా పరియోజన పథకం కింద ఈ ప్రాజెక్టును చేపట్టగా.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పనులను పర్యవేక్షిస్తూ అమలు చేస్తుంది. అనేక రకాలైన హైటెక్ సదుపాయాలున్న ఈ రహదారి అందుబాటులోకి వస్తే దూర భారం తగ్గడంతో పాటు సేఫ్ జర్నీకి సెంటర్ పాయింట్ గా మారనుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కొనసాగుతున్న ఫినిషింగ్ పనులు..

యాక్సెస్ కంట్రోల్ సదుపాయాలతో నాలుగు లేన్ల రహదారిగా సాగుతున్న ఈ నిర్మాణం భవిష్యత్తులో అవసరమైతే ఆరు లేన్లకు విస్తరించే దిశగా డిజైన్ రూపొందించారు. ప్రాజెక్టును పలు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. భూసేకరణ పూర్తయినా.. అక్కడక్కడా కొంత పూర్తికావాల్సి ఉంది. పలు నియోజకవర్గాల్లో ఎర్త్ వర్క్, బ్రిడ్జీలు, సబ్ గ్రేడ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అధికారిక సమాచారం మేరకు మొత్తం పనుల్లో సుమారు 80 నుంచి 90 శాతం మేర పనుల్లో పురోగతి ఉన్నదని తెలిసింది. మిగిలిన పనుల్లో ఇంటర్ చేంజ్ లు, సర్వీస్ రహదారులు, ఫినిషింగ్ పనులు కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి సోలార్ సిస్టమ్ తో నిర్మాణం పనులు పూర్తిచేసుకుంటున్న ఈ రహదారిపై జర్నీ హైటెక్ జర్నీని తలపించనుంది.

2017లో ప్రతిపాదన.. 2018లో ఆమోదం..

ఖమ్మం నుంచి దేవరపల్లికి గ్రీన్ ఫీల్డ్ ప్రతిపాదన 2017లో జరగ్గా.. 2018లో కేంద్ర ఆమోదించింది. ఈ రహదారి నిర్మాణానికి 4451.87 కోట్లు ఖర్చు చేస్తుంది. ఈ మార్గంలో 10 వంతెనలు, 49 చిన్న వంతెనలు, 295 కల్వర్టులు, ఒక ఆర్వోబీ, 98 అండర్ పాసులున్నాయి. ఇప్పటికే 116 కిలోమీటర్ల మేర రహదారి పూర్తిస్థాయి నిర్మాణం చేసుకుంది. ఈ హైవే పై ప్రతీ 18 కిలోమీటర్లకు ఒక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ ఏర్పాటు చేశారు. జూన్ వరకు మిగతా పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంగా పనులు చేస్తున్నామని ఓ అధికారి వెల్లడించారు.

బో స్ట్రింగ్ గిడ్డర్ స్పెషల్..

గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేలో ‘బో స్ట్రింగ్ గిడ్డర్’ కీలకమైంది.రైల్వేట్రాక్ పై వంపు తిరిగినట్లు ఉండే ఈ గిడ్డర్ రహదారి నిర్మాణంలో కీలకపాత్ర పోషించనుంది. ఒక బాణాన్ని వంచితే ఏ విధమైన అర్థచంద్రాకారం వస్తుందో అదేవిధంగా రైల్వే ట్రాక్ మీద కూడా నిర్మాణం చేయాల్సిరావడం విశేషం. రైల్వే ట్రాక్ మీద ఈ రహదారి పనులు కొనసాగింపు అసాధ్యం. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయంతో పాటు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేరే ప్రాంతంలో బ్రిడ్జీని నిర్మించి దాన్ని అలాగే రైల్వే ట్రాక్ మీద అమర్చే పనులు చేస్తున్నారు. ఈ బ్రిడ్జీ దాదాపు 150 ఏండ్లకు పైగా మన్నిక ఉంటుందని, దీనిపై జింక్ అక్సైడ్ కోటింగ్ వేస్తారని నేషనల్ హైవేస్ లో పనిచేసే ఓ అధికారి తెలిపారు. ఈ ‘బో స్ట్రింగ్ గిడ్డర్’ ఏర్పాటువల్లే పనుల్లో కొంత ఆలస్యం అవుతుందని, జూన్ వరకు పనులు పూర్తిచేస్తామని ఆ అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలోనే ఇది ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే యాక్సెస్ కంట్రోల్ ఉన్న రహదారని, వేరే రహదారుల నుంచి ఎవరూ మధ్యలో రాకుండా బారీకేడింగ్ ఉంటుందని తెలిపారు. ఏదేని అనుకోని ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల కోసం ప్రతీ 5 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ పాయింట్ ఏర్పాటు చేసినట్లు, 1033 హెల్ప్ లైన్ కు సమాచారం అందించవచ్చని తెలిపారు.

ట్రాఫిక్ సమస్యలు అధిగమించి..

ఈ హైవే పూర్తయితే ఖమ్మం నుంచి రాజమహేంద్రవరం, విశాఖ పట్నం వైపు ప్రయాణ దూరం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం ఉండే మలుపులు, పట్టణాల గుండా వెళ్లే మార్గాలు దూరమై నేరుగా వేగంగా ట్రాఫిక్ సమస్యలను అధిగమించి ప్రయాణాలు కొనసాగించవచ్చు. ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గే అవకాశముంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక గ్రీన్ ఫీల్డ్ హైవేలు నిర్మాణంలో ఉన్నా.. వీటిలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ హైవే ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లివరకు దాదాపు 162.4 కిలోమీటర్ల మేరకు చేపట్టిన ఈ రహదారి తుదిమెరుగులు దిద్దుకుంటుంది. హైదరాబాద్ నుంచి విశాఖ పట్నం వెళ్లాలంటే సూర్యాపేట, విజయవాడ మీదుగా 676 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిఉంటుంది. ఈ కొత్త రహదారి మీదుగా వెళితే ట్రాఫిక్ సమస్యలతో పాటు దూరం కూడా తగ్గుతుంది. ఆధునాతన సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్న ఈ రహదారిపై ప్రయాణం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.

గ్రీన్ ఫీల్డ్ తో కొత్త గ్రోత్..

గ్రీన్​ ఫీల్డ్​ రహదారి పూర్తిస్థాయిలో కంప్లీట్ అయిన తరువాత ఖమ్మం జిల్లాకు కొత్త శక్తి వచ్చినట్లేనన్న భావన వ్యక్తం అవుతుంది.ఇప్పటికే కొదాడ– మహబూబాబాద్​, ఖమ్మం– సూర్యాపేట, అమరావతి–నాగ్​పూర్​ హైవేలు ఖమ్మం నుంచి వెళ్లడంతో రూపురేఖలు మారాయి. గ్రీన్​ ఫీల్డ్​ వైవే పై రాకపోకలు స్టార్​ అయితే జిల్లాకు మరింత ఉపయోగకరం కానుంది. ఖమ్మం జిల్లా సెంటర్​ అప్​ యాక్షన్లో నిలవనుందని చెప్పాలి. గ్రీన్​ఫీల్డ్​ హైవే ఖమ్మం రూరల్​ మండలం తల్లంపాడు వద్ద ఎగ్జీట్ ఇచ్చారు. ​ఖమ్మం నుంచి రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు ప్రయాణ దూరం గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణ సమయం 2 –3 గంటల వరకు ఆదా అయ్యే అవకాశం. ఇంధన ఆదా, నేరుగా వెళ్లే మార్గం ఉండటంతో వాహనదారులకు డీజిల్, పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది. పారిశ్రామికాభివృద్ధి , హైవే పక్కన గిడ్డంగులు, లోజిస్టిక్స్ హబ్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పడే అవకాశముంది. జిల్లా రైతులకు, వ్యాపారులకు మేలు చేకూరనుంది. వ్యవసాయ ఉత్పత్తులు తక్కువ సమయంలో మార్కెట్లకు చేరే వీలుంటుంది. అంతేకాకుండా తెలంగాణ–ఆంధ్ర మధ్య వాణిజ్య రవాణా వేగవంతమవుతుంది

Next Story