రెండు కుట్టు మెషిన్లతో రూ.1,000 కోట్ల సామ్రాజ్యం వరకు.. అనితా డోంగ్రే స్ఫూర్తిదాయక ఫ్యాషన్ జర్నీ !

by Javid Pasha |

రెండు కుట్టు మెషిన్లతో రూ.1,000 కోట్ల సామ్రాజ్యం వరకు.. అనితా డోంగ్రే స్ఫూర్తిదాయక ఫ్యాషన్ జర్నీ !
X

దిశ, ఫీచర్స్ : అనంత్ అంబానీ రాధికా మర్చంట్ దంపతుల పెళ్లి వేడుకను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మీరు చూసే ఉంటారు. ఆ సందర్భంగా పెళ్లి కూతురు మొదలు కొని, ఫంక్షన్‌కి వచ్చిన సెలబ్రిటీలు, అంబానీ ఫ్యామిలీ వరకు వారు ధరించిన దుస్తులు సైతం అందరినీ ఆకర్షించాయి. ఇప్పుడు ఇదెందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? అంతమంచి డిజైన్లను రూపొందించిన ఆ ఫ్యాషన్ డిజైనర్ గురించి అప్పట్లో చాలా మంది ఆరా తీశారు. ఇప్పటికీ ఆమె డిజైన్లు, దుస్తుల శైలి గురించి తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. కారణం ఆమె అంచెలంచెలుగా ఎదిగిన తీరు జనాన్ని ఆకట్టుకోవడమే. ఆ వివరాలేంటో చూద్దాం.

రెండు కుట్టు మెషిన్లతో మొదలై..

అనితా డోంగ్రే.. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు దాదాపు ఉండరు. భారత దేశంలోనే అగ్రగామి ఫ్యాషన్ డిజైనర్ ఆమె. 1995లో రెండు కుట్టు మెషిన్లతో ప్రారంభమైన ఆమె జర్నీ, ఇప్పుడు ప్రపంచం మెచ్చిన ఫ్యాషన్ డిజైనర్ దాకా ఎదిగింది. మొదట్లో 20 క్లాతింగ్ బ్రాండ్స్‌తో చిన్న బోటిక్‌ను నడిపిన అనితా డోంగ్రే మొదట్లో ఆదరణ లభించక అవస్థలు పడింది. ఎన్నోసార్లు ఆమె డిజైన్లు తిరస్కరణకు గురయ్యాయి. అయినప్పటికీ ఆమె తన ప్రయత్నం మానుకోలేదు. కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టింది. తన పట్టుదలతో ‘హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే’ని స్థాపించింది. ఇందులో భాగంగా సాంప్రదాయ భారతీయ కళాత్మకతను ఆధునిక శైలితో కలిసి స్థానిక చేనేత కారులను ఆదరిస్తూ సుస్థిర ఫ్యాషన్‌ను ప్రోత్సహించింది.

ఫేమస్ బ్రాండ్లకు నిలయం..

ఇప్పుడు ‘హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే’లోని అనితా డోంగ్రే లిమిటెడ్ (Anita Dongre Limited) పేరుతో వస్తున్న గ్లోబల్ దేశీ, గ్రాస్‌రూట్, పింక్ సిటీ, బ్రైడల్ కౌచర్ వంటి ఫేమస్ బ్రాండ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఆమె డిజైన్స్ సాంప్రదాయ భారతీయ కళాత్మకత(Traditional Indian artistry)ను ఆధునిక శైలితో మేళవించి ఉండటం మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవి భారతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో గుర్తింపు మంచి గుర్తింపు పొందాయి. ముఖ్యంగా అనితా డోంగ్రే బ్రైడల్ కలెక్షన్ అనేది సెలబ్రిటీల మనసు గెలుచుకుంది. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళా డిజైనర్‌లలో ఆమె ఒకరిగా నిలిచింది.

వెయ్యికోట్ల టర్నోవర్

హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే ఇప్పుడు దాదాపు ₹1,000 కోట్ల టర్నోవర్‌తో భారతదేశంలోని మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్యాషన్ సామ్రాజ్యాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఇది ఒక్కరోజులో జరిగిన పని కాదు. అనితా డోంగ్రే సంపాదన, సక్సెస్ వెనుక ఆమె అభిరుచి, కఠోర శ్రమ, నిరంతర పట్టుదల ఉన్నాయి. ఇప్పుడు ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ సామ్రాజ్యం 1,000కి పైగా స్టోర్లు, 2,800కి పైగా ఉద్యోగులతో విస్తరించింది. ఇంకా అమెరికా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పాగా వేస్తోంది. ఈ విజయం ఆమె వ్యాపార దూరదృష్టి, సామాజిక బాధ్యతతో కూడిన ఫ్యాషన్‌కు నిదర్శనంగా నిలువడమే కాకుండా.. అంచలంచెలుగా ఆమె ఎదిగిన తీరు మహిళా లోకానికి ఒక ప్రేరణగా, ఒక స్ఫూర్తిగా పేర్కొనవచ్చు. ఆమె డిజైన్లకు అంబానీ కుటుంబం కూడా ఫిదా అయిపోయింది. ముఖ్యంగా నీతా అంబానికి అనితా డోంగ్రే బ్రాండ్స్ అంటే చాలా ఇష్టం. ఇషా అంబానీ కూడా ఆమె వెడ్డింగ్, ఇతర ఈవెంట్లలో అనితా డోంగ్రే లెహేంగాలు, సారీలు ధరించింది. ఇక రాధికా మర్చంట్ కూడా తన పెళ్లిలో అనితా డోంగ్రే బ్రైడల్ కలెక్షన్‌లను ఎంచుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇది కదా సక్సెస్ అంటే..!!

కుటుంబ నేపథ్యం, సక్సెస్ జర్నీ

అనితా డోంగ్రే 1963లో ముంబైలో ఒక సింధీ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లి పుష్పమాల హీరానందని ఒక నైపుణ్యం గల కుట్టుపని కళాకారిణి, ఆమె నుంచే అనితాకు కుట్టుపని, డిజైన్ పట్ల మొదటి ఆసక్తి పెరిగింది. ఆమె తండ్రి వ్యాపారవేత్త కాగా, ఆమెకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాడు. అనితా ముంబైలోని ఎస్.ఎన్.డి.టి. విమెన్స్ యూనివర్శిటీలో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. కానీ ఫ్యాషన్ డిజైన్‌లో ఎలాంటి ఫార్మల్ ట్రైనింగ్ తీసుకోలేదు. అయినప్పటికీ ఆమె తన క్రియేటివిటీ, తల్లి నుంచి నేర్చుకున్న నైపుణ్యాలతో జనం మెచ్చిన ప్రపంచస్థాయి ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగింది. Link

Next Story