- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదటి మహిళా డీసీ.. వరదల్లో 900 మందిని రక్షించింది.!
క్లిష్ట సమయంలో ఒక మహిళ నేనున్నా అని రంగంలోకి దిగింది

దిశ, ఫీచర్స్: అమృత్‌సర్‌లోని అజ్నాలాలో భారీ వరదలొచ్చినప్పుడు 20కి పైగా గ్రామాలు నీట మునిగాయి. వేలాదిమంది నిర్వాసితులయ్యారు. తిందామంటే తిండి లేదు. తాగుదామంటే నీళ్లు లేవు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒక మహిళ నేనున్నా అని రంగంలోకి దిగింది. ఆమెనే అమృత్‌సర్ మొదటి మహిళా డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్నీ.
డీసీగా రంగంలోకి..
అజ్నాలా ప్రాంతంలో వరదలొస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ఊర్లకు ఊర్లే నీటిలో మునిగిపోతాయి. ఎప్పట్లానే ఈసారి కూడా భీభత్సమైన వరదలొచ్చి చాలామంది ఇండ్లలోనే చిక్కుకుపోయారు. ఆస్తి పాస్తులన్నీ నష్టపోయారు. పశువులూ కొట్టుకుపోయాయి. ఆహారం, నీరు, వైద్య సహాయం లేక జనాలు అల్లాడిపోయారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు. రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఎవరూ బయటకు రాలేకపోయారు. ఈ పరిస్థితుల్లో సాక్షి సాహ్నీ బాధ్యత తీసుకొని సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేసింది.
వరదలోకి దిగి మరీ..
సాక్షి సాహ్నీ రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేసింది. సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, రెడ్‌క్రాస్ బృందాలను సమన్వయం చేసింది. బోట్లు, ఆల్-టెర్రైన్ వెహికిల్స్ ఉపయోగించి మారుమూల గ్రామాలకు చేరుకున్నారు. 24 గంటల్లో 900 మందికి పైగా ప్రజలను సురక్షితంగా రక్షించారు. వానొచ్చినా.. వరదొచ్చినా ఇంట్లోనే ఉండిపోతాం అని బయటకురాని వాళ్లకు అప్పటికప్పుడు ఆహారం.. నీరు.. దుస్తులు.. దుప్పట్లు నేరుగా ఇళ్లకు చేర్చేలా ఏర్పాటు చేసింది. ఆఫీస్ నుంచి ఆదేశాలు ఇవ్వడం కాకుండా స్వయంగా వరద నీటిలోకి దిగి ప్రజలతో మాట్లాడింది. వాళ్ల ఆందోళనలు విని ధైర్యం చెప్పింది.
సాయమే కాదు.. ఓదార్పు కూడా..
రెస్క్యూ తర్వాత సాక్షి సాహ్నీ రిలీఫ్ చర్యలపై దృష్టి పెట్టింది. పాఠశాలలను తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలుగా మార్చింది. అక్కడ కుటుంబాలకు ఆహారం, శుభ్రమైన నీరు, వైద్య సహాయం అందించింది. 24 గంటలు నడిచే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతి కాల్‌కు స్పందించేలా చేసింది. వరద నీరు తగ్గిన తర్వాత ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులను తనిఖీ చేయించింది. మరిన్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంది. ఆమె కృషి ప్రజలకు సహాయం మాత్రమే కాదు.. ఓదార్పును కూడా ఇచ్చింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఆమె చేసిన సాయాన్ని చూసి మెచ్చుకున్నారు.
ఆమె స్ఫూర్తిదాయకం..
సాక్షి సాహ్నీ హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో బీఏ ఎల్‌ఎల్‌బీ చదివింది. తన తరగతిలో టాపర్‌గా నిలిచి ఎనిమిది గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది. మొదటి యూపీఎస్‌సీ ప్రయత్నంలో స్వల్పంగా వెనుకబడినా.. రెండోసారి ఆల్ ఇండియా ర్యాంక్ 6 సాధించింది. వరదల సమయంలో ఆమె నిర్వహించిన లీడర్‌షిప్ పబ్లిక్ సర్వీస్ స్ఫూర్తిని చూపిస్తుంది. 24 గంటల్లోనే పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వందలాది మందిని రక్షించిందంటే ఆమె ఎంతటి ధైర్యవంతురాలో తెలిసిపోతుంది. దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఆమె స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు.






