కష్టాల్లో ఉన్నప్పుడు మేమున్నామంటూ భరోసా.. ఒకరినొకరు ఆదుకుంటున్న తుషార్ డ్రైవర్స్

by Javid Pasha |

కష్టాల్లో ఉన్నప్పుడు మేమున్నామంటూ భరోసా.. ఒకరినొకరు ఆదుకుంటున్న తుషార్ డ్రైవర్స్
X

దిశ, సిటీక్రైం : కారు స్టీరింగ్ తిరిగితేనే కానీ పూటగడవని డ్రైవర్ కుటుంబాలు అనేకం ఉంటాయి. ఇంకా ఆ కుటుంబాల్లో చోటు చేసుకునే ఆకస్మిక సంఘటనలు వారిని ఆర్ధిక సుడిగుండంలో నెట్టేస్తాయి. ఆ టైంలో ఆర్థిక భారంతో డ్రైవర్లు పడే మనోవేదన ఇంతా అంతా కాదు. ఆ సమయంలో నగదు కోసం వారు స్టీరింగ్ వదిలేస్తే ఇక ఆ రోజు డ్రైవర్ కుటుంబం కడుపు మాడ్చుకోవడం ఖాయం. అలాంటి కష్టసమయంలో వారిని ఆదుకునేందుకు హైదరాబాద్ బొల్లారం ప్రాంతానికి చెందిన గోరంట్ల సాయి ప్రకాష్ ఓ ఆలోచన చేశాడు. డ్రైవర్లకు అండగా ఉండేందుకు క్రౌడ్ ఫండింగ్ కు శ్రీకారం చుట్టారు. ఇలా సాయి ప్రకాష్ అండ్ టీం చేస్తున్న కృషి.. పలువురు డ్రైవర్లకు మానసిక ధైర్యాన్ని ఇస్తున్నాయి.

డ్రైవర్.. అందరివాడు

సురక్షిత ప్రయాణానికి అందరీకి డ్రైవర్ కావాలి. కానీ వారికి వచ్చే కష్టాలకు ఎవరున్నారు ? అనే ప్రశ్నకు వచ్చిన ఆలోచనతోనే సాయి ప్రకాష్ ఓ అడుగు ముందుకు వేశాడు. అన్ని సమయాల్లో డ్రైవర్లను ఆదుకోలేము. కానీ వారికి వచ్చే చిన్న చిన్న కష్టాలకు కొంత పరిష్కారం చూపిద్దామని నిర్ణయించుకున్నాడు. స్వతహాగా సాయి ప్రకాష్ కూడా డ్రైవర్ కమ్ ఓనర్ కావడంతో తుషార్ క్యాబ్స్ పేరుతో ఓ గ్రూపును ఏర్పాటు చేశారు. ఆ గ్రూపులో ఇప్పుడు దాదాపు 1000 మంది డ్రైవర్ కమ్ ఓనర్లు చేరారు. ఇలా అందరినీ ఒక వేదిక మీదకు తీసుకువచ్చారు. డ్రైవర్లకు వారి కుటుంబాల్లో చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు వారికి అవసరమయ్యే ఆర్ధిక సహాయాన్ని అందిస్తూ తుషార్ క్యాబ్ గ్రూపు సభ్యులు మద్దతుగా నిలబడుతున్నారు. ఈ గ్రూపులో ఉన్న వెయ్యి మంది సభ్యులు రూ. 10 నుంచి రూ. 10 వేల వరకు ఎవరి స్థోమతకు తగట్టుగా వారు సహాయాన్ని అందిస్తున్నారు.

కొన్ని సహాయాలు

*2021 లో ఓ డ్రైవరు రెండు సంవత్సరాల కూతురు ఉన్నట్లు ఉండి అనారోగ్యానికి గురైంది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆ పాపకు బ్రెయిన్ ట్యూమర్ గా తేలింది. ఈ విషయం తెలిసి షాక్ కు గురైన డ్రైవర్ కు బాసటగా తుషార్ క్యాబ్స్ తరపును కొన్ని గంటల వ్యవధిలో రూ. 1.26 లక్షలు సహాయాన్ని అందించారు.

*మరో డ్రైవరు కుమారుడు ఆడుకుంటూ వేడి నీళ్లలో పడిపోవడంతో అతనికి ఒళ్లంతా కాలిపోయింది. చికిత్స కోసం తుషార్ క్యాబ్ తరపున రూ. 2.18 లక్షలు సహాయం అందించి రెండు సంవత్సరాల బాబు ప్రాణాలను కాపాడారు.

*ఓ డ్రైవర్ కుమారుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వైద్య చికిత్సల కోసం 96 వేల రూపాయాలను అందించారు. ఇలా తుషార్ క్యాబ్ డ్రైవర్ లకు వైద్య ఖర్చుల కోసం ముందుగా నిలబడి కొండంత ధైర్యాన్ని ఇస్తున్నారు. తుషార్ క్యాబ్ సేవలకు ఇతరులు కూడా సపోర్టుగా నిలుస్తు వారి క్రౌడ్ ఫండింగ్ లో సహాయం చేస్తూ సంతృప్తి పొందుతున్నారు.

Next Story