హార్వెస్టింగ్ టెక్నాలజీ.. వ్యవసాయంలోనూ ఏఐ రోబోలు!

by Javid Pasha |

స్మార్ట్ హార్వెస్టింగ్ రోబోలు వ్యవసాయ రంగంలో డిజిటల్ పరివర్తనకు నిదర్శనం అంటున్నారు నిపుణులు. ఇవి నిరంతరం పనిచేస్తూ.. గంటకు 160 కిలోగ్రాముల వరకు పంటను సేకరించే సామర్థ్యం కలిగి ఉంటాయి.

హార్వెస్టింగ్ టెక్నాలజీ.. వ్యవసాయంలోనూ ఏఐ రోబోలు!
X

దిశ, ఫీచర్స్ : ఇప్పటికే వివిధ రంగాల్లో మానవులకు సహాయంగా ఏఐ అద్భుతాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే క్రమంగా వ్యవసాయ రంగంలోనూ ఏఐ ఆధారిత రోబోలను విస్తరించడంపై నిపుణులు ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో హార్వెస్టింగ్ రోబోలు పనిచేస్తుండగా.. రీసెంట్‌గా ఈజిప్ట్‌లోని Egrobots కంపెనీ ఈ దేశంలోనే పూర్తిగా స్థానికంగా అభివృద్ధి చేసిన మొదటి స్మార్ట్ హార్వెస్టింగ్ రోబోట్‌ను విడుదల చేసింది. కంప్యూటర్ విజన్ టెక్నాలజీతో పనిచేసే ఈ రోబో పండిన పంటలను గుర్తించి, ఆటోమేటిగ్గా కదులుతూ సమర్థవంతంగా కోతలు కోయగలదు.

ఈజిప్ట్ నిపుణులు అభివృద్ధి చేసిన స్మార్ట్ హార్వెస్టింగ్ రోబో ఇక్కడి వ్యవసాయ రంగంలో డిజిటల్ పరివర్తనకు ఒక ముఖ్యమైన ముందడుగు అంటున్నారు నిపుణులు. పైగా ఎక్కువ సమయం విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేస్తూ.. గంటకు 160 కిలోగ్రాముల వరకు పంటను సేకరించే సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం Egrobots ఈజిప్ట్‌లో మొదటి స్థానిక రోబోట్ అయినప్పటికీ, ఈ తరహా సాంకేతికత ప్రపంచంలో అభివృద్ధి చెందుతోంది.

ప్రపంచ దేశాల్లో..

ఇజ్రాయెల్‌లో డ్రోన్ ఆధారిత ఫ్రూట్ హార్వెస్టింగ్ రోబోలు ఉన్నాయి. వీటిని Tevel Flying Robots అని పిలుస్తారు. యూఎస్‌ఏలో స్ట్రా బెర్రీ, యాపిల్, టమాటా పంటల గుర్తింపునకు, సేకరణకు Advanced Farm Technologies, Abundant Robotics, Harvest CROO Robotics ఉన్నాయి. ఇక యూకే & యూరప్‌లలో Muddy Machines, Dogtooth Technologies, Fieldwork Robotics అందుబాటులో ఉంటున్నాయి. చైనా, జపాన్, నెదర్లాండ్స్ తదితర దేశాల్లోనూ అనేక కంపెనీలు గ్రీన్‌హౌజ్ హార్వెస్టింగ్ రోబోలను అభివృద్ధి చేస్తున్నాయి.

ఇండియాలో పరిస్థితి..

భారత దేశంలో కూడా ఈ ఏఐ ఆధారిత స్మార్ట్ హార్వెస్టింగ్ రోబోటిక్ టెక్నాలజీ చురుకుగా అభివృద్ధి అవుతోంది. పూర్తి హార్వెస్టింగ్ రోబోలు ఇంకా పరిమితంగానే ఉంటున్నప్పటికీ, AI + కంప్యూటర్ విజన్ ఆధారిత సిస్టమ్స్ విస్తృతంగా ఉపయోగంలోకి వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. బెంగుళూరు కేంద్రంగా నికో రోబోటిక్స్ (Niqo Robotics), ఏఐ ప్రెసిషన్ స్ప్రేయింగ్ & కలుపు తీసే రోబోలు, హైదరాబాద్ కేంద్రంగా AI Laser Weeding రోబోలు(Rakshak), హార్వెస్టెడ్ రోబోలు, ఏఐ ఆధారిత అటానమస్ ఫార్మింగ్ రోబోలు, వీడింగ్, స్ర్పేయింగ్, ట్రాన్స్‌పోర్ట్ వంటి ఎలక్ట్రిక్ ఫార్మ్ రోబోలు ఉంటున్నాయి. ఇంకా ICAR, IARI, Mahindra University వంటి సంస్థలు కూడా ఏఐ రోబోటిక్స్‌పై పరిశోధన చేస్తున్నాయి.

ప్రయోజనాలు..

ఏఐ ఆధారిత రోబోటిక్ టెక్నాలజీ వల్ల పంటల వృథా(crop waste) భారీగా తగ్గుతుంది. కార్మికుల ఖర్చు కూడా తగ్గుతుంది. వ్యవసాయంలో ఉత్పాదకత మెరుగుపడుతుంది. ఈజిప్ట్‌తో పాటు మొత్తం ప్రపంచంలో వ్యవసాయ డిజిటలైజేషన్‌(Digitalization of agriculture)ను వేగవంతం చేయడమే ఈ రోబోట్ లక్ష్యం. ఈజిప్ట్ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న కార్మికుల కొరత, నీటి సమస్యలు, ఉత్పాదకత సవాళ్లకు ఈ రకమైన స్థానిక ఆవిష్కరణలు భవిష్యత్తులో పెద్ద సహాయం అవుతాయని నిపుణులు భావిస్తున్నారు. Egrobots రోబోట్ ఈజిప్ట్‌కు చెందిన సాంకేతిక స్వయం సమృద్ధి దిశగా ఒక ముఖ్యమైన మైలురాయి. అయితే ఇది ఈజిప్ట్‌కు గర్వకారణం అయినప్పటికీ, ఈ సాంకేతికత గ్లోబల్ ట్రెండ్. భారతదేశంలో కూడా వేగంగా వృద్ధి చెందుతోంది, ముఖ్యంగా కాటన్, టమాటా, స్ట్రాబెర్రీ, ఆపిల్ వంటి పంటల్లో ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు. రాబోయే 2-3 సంవత్సరాల్లో భారతీయ స్టార్టప్‌లు మరిన్ని స్థానిక హార్వెస్టింగ్ రోబోట్లను విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

Next Story