- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Age gap : ఏజ్ గ్యాప్ రిలేషనషిప్.. లాభమా? నష్టమా?
Age gap : ఏజ్ గ్యాప్ రిలేషనషిప్.. లాభమా? నష్టమా?

దిశ, ఫీచర్స్ : పెళ్లి చేసుకునే పురుషులు తప్పక పరిగణించాలని పెద్దలు చెప్పే విషయాల్లో వయసు కూడా ఒకటి. తమకంటే పెద్దదైన అమ్మాయిని చేసుకోవద్దని సూచిస్తుంటారు. ఇక అమ్మాయిలైతే తమకంటే రెండు మూడేళ్లు, చివరికి పదేళ్లు పెద్ద వయసు గలవారిని చేసుకున్నా పెద్దగా పట్టించుకోరు. అబ్బాయిలు చేసుకుంటేనే అంత బాగోదని, భవిష్యత్‌లో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతుంటారు. కానీ.. ఇదంతా ఒకప్పుడు. మరిప్పుడు అబ్బాయిలైనా, అమ్మాయిలైనా.. లవ్, మ్యారేజ్, డేటింగ్ వంటి విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆసక్తులను బట్టి డిసైడ్ అయిపోతున్నారు. పేరెంట్స్‌ను ఒప్పించి ప్రొసీడై పోతున్నారు. అట్లనీ అందరూ అలాగే ఉండట్లేదు. ఒక్కొ్కరిదీ ఒక్కోదారి. అయితే ఇందులో ఏది మంచిది? ఏది చెడు? నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.
మనసుకు నచ్చితే.. వయసుతో పనేంది!
మనసుకు నచ్చితే చాలు.. వయసుతో పనేముందని మనువాడేస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. అయితే ఇది ఎక్కువగా ప్రేమ వివాహాల్లోనే కనిపిస్తుందని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు, ప్రముఖులు ఈ తరహా వివాహాలవైపు మొగ్గు చూపుతుంటారు. అరేంజ్డ్ మ్యారేజెస్‌లో అయితే వయసు, వరకట్నం, సంప్రదాయాలు, పట్టింపులు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. అమ్మాయికంటే అబ్బాయి రెండు లేదా మూడేళ్లు పెద్దగా ఉంటే పట్టించుకోరు కానీ.. అంతకంటే ఎక్కువగా ఉంటే మాత్రం పేరెంట్స్ ఒప్పుకోరు. అయితే ఒకరి జీవితం అనేది ఇతరులు ఫ్రేమ్ చేయలేరు. ఇందులో ఎక్కువగా వ్యక్తిగత ప్రాధాన్యతలు, ఆసక్తులు, అవసరాలు, సామాజిక పరిస్థితులు కూడా కీ రోల్ పోషిస్తుంటాయి. అందుకే ఇటీవల పలువురు ఏజ్ గ్యాప్ సంబంధాలకు కూడా ఓకే చెప్పేస్తున్నారు.
లాభాలివే..
భార్యా భర్తల మధ్య ఏజ్ గ్యాప్ రెండు లేదా మూడేళ్లు ఉంటే అది మంచి విషయంగానే చెప్తారు. కానీ అంతకంటే ఎక్కువుంటేనే చాలామంది వ్యతిరేకిస్తారు. అయితే ఏజ్ గ్యాప్ రిలేషన్‌షిప్‌వల్ల లాభాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వ్యక్తులు తాము జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు, అనుభవాల కారణంగా ఒక స్పష్టమైన అవగాహనతో ఉంటారు. మెచ్యూరిటీ లెవెల్స్ బెస్ట్‌గా ఉండటంవల్ల రిలేషన్ సిప్‌లో స్టేబుల్‌గా ఉండే చాన్స్ ఎక్కువ. అంతేకాదు ఎక్కువ వయసు గల పార్ట్‌నర్‌ను ఎంపిక చేసుకోవడంవల్ల మరో కోణంలో ఆలోచించినప్పుడు అతని/ఆమె అవగాహన, అనుభవం మీ జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. సక్సెస్ వైపు నడిపిస్తాయి. ఆర్థిక పరమైన విషయాల్లో సమస్యలు ఎక్కువగా ఉండవు. రిలేషన్‌షిప్‌లో వివాదాలకు అవకాశం పెద్దగా ఉండదు. పట్టింపులకు పోకుండా భాగస్వామిని అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం ద్వారా పెద్ద వయసు గల వ్యక్తులు తమ భాగస్వామిని సంతోషంగా ఉంచడంలో ముందుంటారు.
నష్టాలూ ఉన్నాయ్..
ఏజ్ గ్యాప్ అయినా, సేమ్ ఏజ్ అయినా రిలేషన్‌షిప్‌లో చిన్న చిన్న ఇబ్బందులు సాధారణమే. అయితే ఏజ్ గ్యాప్ మరీ ఎక్కువ ఉంటే.. పెద్ద వయసు గల వ్యక్తి అన్నీ తనకు తెలుసనే ధోరణిలో ఉండే అవకాశం ఉంటుంది. దీంతో తనకంటే చిన్న ఏజ్ ఉన్న పార్ట్‌నర్ ఆలోచనలకు, అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. పైగా ప్రతీదానికి భాగస్వామిని జడ్జ్ చేయడం, ఆదేశించడం, పెత్తనం చేయడం వంటివి చేసే చాన్సెస్ ఉంటాయి. దీనివల్ల వయసులో చిన్నవారైన భాగస్వామి, పెద్ద వయసు గల వ్యక్తిని చేసుకున్నందుకు ఇబ్బందుల్లో పడ్డానని బాధపడాల్సి రావచ్చు. అట్లనే జీవన శైలి, సంప్రదాయాలు, పట్టింపుల విషయాల్లో గొడవలు రావచ్చు. ఎక్కువ ఏజ్ కలిగిన వారు సంప్రదాయానికి ఎక్కువగా కట్టుబడి ఉండాలని భావించే అవకాశాలు అధికం. చిన్న వయసులో ఉన్నవారు వాటిని వ్యతిరేకించి స్వతంత్రంగా, నచ్చినట్లుగా ఉండాలనుకునే అవకాశం ఎక్కువ. అట్లనే అనారోగ్యాలు ఎక్కువగా పెద్దవారికే వస్తుంటాయి. ఇండైరెక్ట్‌గా అవి వాళ్ల దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతాయి. సోషల్ మీడియా వాడకం, ఆధునిక వస్త్ర ధారణ వంటివి వయసులో పెద్ద వారికి నచ్చకపోవచ్చు. చిన్నవారికి నచ్చినప్పుడు దానిని వ్యతిరేకిస్తుంటారు. దీంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అర్థం చేసుకుంటే అంతా సవ్యమే..
ఏ రిలేషన్‌షిప్‌లో అయినా దాంపత్య జీవితంలో ఉండే సాధారణ సమస్యలు, సవాళ్లు, ఇబ్బందులు ఉంటాయి. అయితే ఏజ్ గ్యాప్ రిలేషన్‌షిప్‌వల్ల కొందరికి కొన్ని ప్రత్యేకమైన ఇబ్బందులు ఎదురు కావచ్చు. కొందరికి పెద్దగా ఇబ్బందులు లేకుండా కూడా ఉండవచ్చు. ఎలా ఉన్నా పరస్పరం అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, పరస్పర గౌరవం వంటివి బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఇక్కడ ఓపెన్ కమ్యూనికేషన్ కూడా ముఖ్యమేన అంటున్నారు నిపుణులు.






