Success Story : ఒక చిన్న సందేహం.. ఎన్నో జీవితాలను మార్చేసింది!

by Javid Pasha |

రుతుస్రావం అనేది ప్రతీ స్త్రీ సహజంగానే కలిగి ఉండే శారీరక ప్రక్రియ. భయంకరమైనదనో, నిషేధించదగినదనో ఎందుకు భావించాలి?

Success Story : ఒక చిన్న సందేహం.. ఎన్నో జీవితాలను మార్చేసింది!
X

దిశ, ఫీచర్స్ : ఆలోచిస్తే ఏదో ఒక ఉపాయం తట్టకపోతదా? అడుగు ముందుకేస్తే ఏదో ఒక గమ్యం చేరకపోతామా? అంటారు పెద్దలు. ఆయా పరిస్థితులను బట్టి ఎవరైతే దీనిని అర్థం చేసుకుంటారో వారు జీవితంలో ముందుకుసాగిపోతుంటారని, సానుకూల ఆలోచనలతో సక్సెస్ సాధిస్తుంటారని చెబుతుంటారు. ఆదితి గుప్తా జీవితంలోనూ సరిగ్గా అదే జరిగింది. చిన్నప్పుడు ఎదురైన ఒక అనుభవం ఆమెలో మానసిక సంఘర్షణకు దారితీసింది. అదొక ఉద్యమంగా ఊపందుకొని సామాజిక మార్పునకు దోహదం చేసింది. ఇంతకీ ఎవరీ ఆదితి గుప్తా? ఆమె వల్ల కలిగిన మార్పు ఏమిటి?

ఆంక్షల నుంచి ఆలోచనల దాకా..

అది ఝార్ఖండ్‌లోని గర్హ్వా (Garhwa) అనే చిన్న పట్టణం. ఇక్కడ నివసించే కన్జర్వేటివ్ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఒక యువతి పేరే ఆదితి గుప్తా. 12 ఏళ్ల వయసులో ఆమె ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నది. ఏంటంటే.. తన మొదటి పీరియడ్ సమయంలో అందరూ తనను అపవిత్రురాలిగా భావించడం, కుటుంబంలో దూరంగా ఉంచడం, వంటగదిలోకి, ఇంట్లోకి, ఆలయంలోకి రాకుండా ఇంటా బయటా ఆంక్షలు పెట్టడం ఆమెను బాగా కలచివేశాయి. ఈ బాధాకరమైన మానసిక సంఘర్షణలోనుంచే ఆమెలో ఒక అద్భుతమైన ఆలోచన మొదలైంది. కాలక్రమంలో ఆమెను ప్రముఖ భారతీయ సామాజిక వేత్తగా, రచయిత్రిగా, మెన్‌స్ట్రూ‌పీడియా కో-ఫౌండర్‌గా మలిచింది.

రుతుస్రావం అపవిత్రతా?

రుతుస్రావం అనేది ప్రతీ స్త్రీ సహజంగానే కలిగి ఉండే శారీరక ప్రక్రియ. అదొక ప్రకృతి ధర్మం. అలాంటప్పుడు దీనిని భయంకరమైనదనో, నిషేధించదగినదనో ఎందుకు భావించాలి? అంటరానిదని, అపవిత్రమైనదని ఆంక్షలు ఎందుకు విధించాలి? అనే సందేహాలు ఆదితి గుప్తా మదిలో తరచుగా మెదిలేవి. ఇవే ఆమె పెద్దయ్యాక ఒక ఉద్యమాన్ని ప్రారంభించేందుకు కారణమయ్యాయి. అది 2013 సంవత్సరం.. భర్త తుహిన్ పాల్‌తో కలిసి మెన్‌స్ట్రూపీడియా అనే ప్లాట్‌ఫామ్& 88 పేజీల రంగుల కామిక్ బుక్‌ను క్రియేట్ చేసింది ఆదితి గుప్తా. బయటి నుంచి ఎలాంటి ఫండింగ్ లేకుండానే, తన సొంత పొదుపుతోనే ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లింది.

అవగాహనతో మార్పు

మెన్‌స్ట్రూపీడియా ద్వారా సరళమైన, ఆకర్షణీయమైన కామిక్ ద్వారా పీరియడ్స్ గురించి, సైన్స్, ఆరోగ్యం గురించి సులభంగా అర్థమయ్యేలా బాలికల్లో అవగాహన కల్పించడం ప్రారంభించింది ఆదితి గుప్తా. ఇందులో ప్యూబర్టీ మార్పులు, పీరియడ్స్ ఎలా వస్తాయి? దాని గురించి సమాజంలో ఉన్న అపోహలు-వాస్తవాలు ఏమిటి? పరిశుభ్రత, పోషకాహారం ఎందుకు ముఖ్యం, ఎలా ఉండాలి? వంటి అంశాలను కథల ద్వారా, కార్టూన్ల ద్వారా ఆసక్తికరంగా వివరించడం ఎంతోమందిని ఆకట్టుకోవడమే కాకుండా అవగాహనను పెంపొందించింది. క్రమంగా ఈ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది బాలికల్లో అవగాహనకు దారితీసింది.

రహస్యం కాదు.. సహజం

భారత దేశంలో 35,000+ పాఠశాలల్లో ఆదితి గుప్తా క్రియేట్ చేసిన మెన్‌స్ట్రూపీడియా కథనాలను పాఠ్యాంశాలుగా బోధించడం మొదలు పెట్టారు. 20 దేశాల్లో ఈ పుస్తక విక్రయాలు జరుగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మెన్‌స్ట్రూపీడియా అనే వేదిక పాఠశాలల్లో, చుట్టు పక్కల సమాజంలో మెన్‌స్ట్రూయేషన్ గురించి మాట్లాడే విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. అంతకుముందు రుతుక్రమమనేది మాట్లాడకూడని రహస్యమని భావించిన అనేకమంది స్త్రీలు, ముఖ్యంగా యువతులు దాని గురించి ఓపెన్‌గా మాట్లాడటం, సందేహాలు అడగడం, మూఢ నమ్మకాలు వీడి హైజీన్ అంశాలను ఫాలో అవడం వంటివి చేశారు. ఇప్పుడు రుతుక్రమమనేది నిషేధిత అంశమో, భయంకరమైన విషయమో, రహస్యమో కాదు. ఆదితి గుప్తలో మొదలైన ఒక చిన్న ప్రశ్న.. ఉద్యమంగా మారి ఇప్పుడు లక్షలాదిమంది జీవితాలను మార్చేసింది. ప్రతికూల పరిస్థితులు, అనుభవాలు ఎదురైనప్పుడు ఎలా ముందుకు సాగాలో ఆమె జీవితమే ఒక ప్రేరణ.

Next Story