మైగ్రేన్ నొప్పి వేధిస్తోందా? అల్లం టీతో తక్షణ ఉపశమనం!

by Javid Pasha |

మైగ్రేన్ నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగించడంలో అల్లం టీ అద్భుతంగా సహాయపడుతుంది. అందులోని జింజెరోల్, షోగోల్స్ సమ్మేళనాలే ఇందుకు కారణం.

మైగ్రేన్ నొప్పి వేధిస్తోందా? అల్లం టీతో తక్షణ ఉపశమనం!
X

దిశ, ఫీచర్స్ : తలనొప్పి వస్తోందనో, వన్‌సైడ్ హెడేక్ వేధిస్తుందనో చాలామంది మెడికల్ షాప్‌ నుంచి టాబ్లెట్స్ తెచ్చి వేసుకుంటుంటారు. మరికొందరు భయపడి హాస్పిటళ్లకు వెళ్తుంటారు. కానీ ఇది ప్రారంభ సమస్య అయినప్పుడు ఇంట్లోనే చక్కటి పరిష్కారం ఉందని మీకు తెలుసా? అదే అల్లం టీ లేదా కషాయం. ఇప్పటికీ అమ్మలు, అమ్మమ్మలు పాటించే అద్భుత చిట్కాల్లో ఇదొకటి. సాధారణ తలనొప్పికి, మైగ్రేన్ నొప్పికి ఔషధంలా పనిచేస్తుంది. పబ్ మెడ్‌లో పబ్లిషైన 2020 నాటి మెటా ఎనాలిసిస్ సహా పలు అధ్యయనాల ప్రకారం కూడా అల్లం మైగ్రేన్ బాధితులకు రిలీఫ్ అందిస్తుందని, 2 గంటలలో నొప్పిని తగ్గిస్తుందని తేలింది.

తలనొప్పి లేదా మైగ్రేన్ నొప్పిని తగ్గించడంలో, తక్షణ ఉపశమనం కలిగించడంలో అల్లం ఎందుకంత ప్రభావ వంతంగా పనిచేస్తుందంటే.. ఇందులో జింజెరోల్ (Gingerol), షోగోల్స్ (Shogaols) వంటి యాక్టివ్ సమ్మేళనాలు ఉండటంవల్లే అంటున్నారు నిపుణులు. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను అంటే మంటకు, నొప్పిక కారణమయ్యే లక్షణాలను తగ్గిస్తాయి. తలనొప్పి, మైగ్రేన్‌లకు కారణమయ్యే రక్తనాళాలను ప్రేరేపించి, రక్త ప్రసరణను మెరుగు పరిచి ఆ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 400 మి.గ్రా అల్లం ఎక్స్‌ట్రాక్ట్ తీసుకుంటే నొప్పి, ఫంక్షనల్ స్టేటస్ మెరుగుపడుతుందని ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సాధారణ తలనొప్పితో ఇబ్బంది పడుతున్నప్పుడు అల్లం టీ లేదా కషాయం తయారు చేసుకొని తాగడంవల్ల నొప్పి ఉపశమనం లభిస్తుంది. అల్లంను నీటిలో కాసేపు మరిగించాక, చల్లార్చే క్రమంలో గోరువెచ్చని స్థితికి వచ్చాక అందులో తేనె లేదా చక్కెర కలిపి తాగవచ్చు. దీనినే అల్లంటీ అంటారు. అవసరమనుకుంటే మరిగించేటప్పుడు కొన్ని దనియాలు, రెండు మూడు పుదీనా ఆకులు కూడా అల్లంతోపాటు చేర్చడం మరింత రుచిని, ఔషధ గుణాన్ని అందిస్తుంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story