ముంచుకొస్తున్న ముప్పు.. యువతలో పెరుగుతున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్!

by Javid Pasha |

ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్‌గా ఉంటున్నప్పటికీ, జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రిస్క్‌ పొంచి ఉంటోందని నిపుణులు అంటున్నారు.

ముంచుకొస్తున్న ముప్పు.. యువతలో పెరుగుతున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్!
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఏజ్‌బార్ అయిన వారిలోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ప్రీ-డయాబెటిస్, టైప్-2 డయాబెటిస్ వంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపించేవి. కానీ ఇటీవల యువతలోనూ అవి పెరుగుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ఇండియా డయాబెట్స్ (ICMR-INDIAB) అధ్యయనాల ప్రకారం కూడా భారత దేశంలో ఈ సమస్య తీవ్రం అవుతోంది. ఇప్పటికే సుమారు 13.6 కోట్ల (136 మిలియన్లు)మంది భారతీయులు ప్రీ-డయాబెటిస్‌తో ఉన్నారు. ఇది ఇన్సులిన్ నిరోధకతతో ముడిపడి ఉంటుందన్న విషయం తెలిసిందే.

ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే?

ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది శరీరంలోని కణాలు (ముఖ్యంగా కండరాలు, కొవ్వు కణాలు, లివర్) ఇన్సులిన్ హార్మోన్‌కు సరిగ్గా స్పందించని పరిస్థితి. ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేసే హార్మోన్, ఇది రక్తంలోని గ్లూకోజ్ (షుగర్)ను కణాలలోకి తీసుకెళ్లి శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు కణాలు ఇన్సులిన్‌ను సమర్థవంతంగా గ్రహించవు. దీంతో ప్యాంక్రియాస్ మరింత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాలక్రమేణా ఇది రక్తంలో షుగర్ స్థాయిని పెంచి, ప్రీడయాబెటిస్ లేదా టైప్-2 డయాబెటిస్, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులు వంటి సమస్యలకు దారితీస్తుంది.

ప్రమాదంలో పట్టణ యువత

భారతదేశంలో అనేక మందికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్‌గా ఉంటున్నప్పటికీ, నేటి ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవనశైలిని బట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రిస్క్ పొంచి ఉంటోందని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం డయాబెటిస్‌కు ముందు దశ అయిన ప్రీడయాబెటిస్ దేశ వ్యాప్తంగా 15.3% వరకు ఉందని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని యువత(40 ఏళ్లలోపు)లో ఈ సమస్య ముందే మొదలవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది భవిష్యత్తులో టైప్ -2 డయాబెటిస్‌గా మారే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.

కారణాలు

ఇన్సులిన్ నిరోధకతకు ప్రధాన కారణాలు జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులు అని చెప్పవచ్చు. రోజూ రాత్రిళ్లు ఆలస్యంగా తినడం, భోజనం తర్వాత కదలిక లేకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిళ్లు, నిద్రలేమి, తెల్లబియ్యం, మైదా వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, అలాగే అధిక చక్కెరలు కలిగిన ఆహారాలు, డ్రింక్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, ప్రోటీన్ తక్కువగా తీసుకోవడం వంటి అలవాట్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తున్నట్లు ఆరోగ్య నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే సాధారణ బ్లడ్ టెస్టులు (ఫాస్టింగ్ గ్లూకోజ్) ఈ సమస్యను త్వరగా గుర్తించలేవని, ఇది సంవత్సరాల తరబడి నిశ్శబ్దంగా పెరిగి తర్వాత డయాబెటిస్ లేదా ఇతర మెటబాలిక్ వ్యాధులుగా వ్యక్తమవుతుందని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు.

పరిష్కారం ఏమిటి?

తగిన జాగ్రత్తలు తీసుకోవడం, జీవనశైలిలో మార్పుల ద్వారా చిన్న వయసులోనే ఇన్సులిన్ నిరోధకత, ప్రీ-డయాబెటిస్ సమస్య బారిన పడకుండా కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు. దీంతోపాటు తెల్ల బియ్యం, మైదా, స్వీట్స్ వంటి రిఫైన్డ్ కార్బ్స్ తగ్గించడం, గుడ్డు, మాంసం, పప్పులు, పాలు, కూరగాయలు, పండ్లు వంటి ప్రోటీన్లు, ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకోవడం చేయాలి. రాత్రి ఆలస్యంగా తినడాన్ని నివారించాలి. అలాగే తక్కువ మోతాదులో తినాలి. దీంతోపాటు రోజువారీ వ్యాయామం, భోజనం తర్వాత నడక, స్ట్రెస్ నియంత్రణ, క్వాలిటీ స్లీప్ వంటి చిన్న అలవాట్లు దీర్ఘకాలిక జీవక్రియ ఆరోగ్యాన్ని రక్షించడం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్య నుంచి, డయాబెటిస్ నుంచి రక్షిస్తాయి.

Next Story