- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోబోటిక్ బెడ్ వచ్చేసిందోచ్..
పోస్చర్‌కు తగినట్లుగా రోబోటిక్ బెడ్.. ప్రశాంతమైన నిద్రకు బెస్ట్ ఆప్షన్.. దీర్ఘకాలిక వెన్ను నొప్పులు పరార్.. భవిష్యత్తులో ఫర్నిచర్ పూర్తిగా సరికొత్తగా..

దిశ, ఫీచర్స్: నిద్ర అనేది కేవలం కండ్లు మూసుకోవడం కాదు. శరీరం పూర్తి విశ్రాంతి పొందడానికి నిద్ర అవసరం. నిద్రపోయే సమయంలో కూడా మన శరీరానికి సరైన సపోర్ట్ అవసరం. ఈ ఆలోచనతో హైదరాబాద్‌కు చెందిన ‘వాటర్ రోబోటిక్స్’ స్టార్టప్ అత్యాధునిక ఏఐ ఆధారిత రోబోటిక్ బెడ్‌ను తయారు చేస్తోంది.
రోబోటిక్ బెడ్..
హైదరాబాద్‌కు చెందిన తేజ వినుకొల్లు పని ఒత్తిడి వల్ల దీర్ఘకాలిక వెన్ను నొప్పితో బాధపడేవాడు. ఎంతకని భరిస్తాడు? తనలా ఇంకెంత మంది ఇలాంటి నొప్పితో బాధపడుతున్నారో అని ఆలోచించాడు. అసలు మనం వాడే కుర్చీలు, సోఫాలు, బెడ్‌లు ఇలాంటి సమస్య నుంచి ఉపశమనం కలిగించాలి కదా? మరి ఎందుకు ఇవి ఇంత వరస్ట్‌గా ఉన్నాయి? అనుకున్నాడు. నిద్రపోతున్నప్పుడు శరీర ఒత్తిడిని గుర్తించి.. శరీర భంగిమకు అనుకూలంగా మార్చుకునేలా ఏదైనా వస్తువు ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. అలా అతడికి రోబోటిక్ బెడ్ ఐడియా వచ్చింది.
స్క్రాచ్ నుంచి అభివృద్ధి..
మైక్రోసాఫ్ట్, మల్టిప్లయర్ వంటి కంపెనీల్లో పని చేసిన అనుభవమున్న తేజ.. టెస్లా కార్లు వంటి స్వయంప్రతిపత్తి వ్యవస్థల నుంచి ప్రేరణ పొందాడు. సెన్సార్లు, కంప్యూటేషన్, యాక్చుయేషన్ కలిసి పనిచేసి నిర్ణయాలు తీసుకునే విధానాన్ని ఫర్నిచర్‌కు కూడా వర్తింపజేయాలని భావించాడు. దీని ఫలితంగా బెడ్‌లు, కుర్చీలు, సోఫాలు కూడా ఇంటెలిజెంట్ వ్యవస్థలుగా మారాలని నిర్ణయించాడు. కో-ఫౌండర్ హనీష్ మౌర్య దేశు ఫర్నిచర్ సప్లయ్ చైన్.. తయారీలో లోతైన అనుభవం కలిగి ఉన్నాడు. ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లో హార్డ్‌వేర్.. AI మోడల్స్‌ను స్క్రాచ్ నుంచి అభివృద్ధి చేయడం ప్రారంభించారు.
ఎవరు పడుకున్నారో..
తేజ.. 2024లో వాటర్ రోబోటిక్స్‌ను స్టార్ట్ చేశాడు. దాంట్లో భాగంగానే నిద్రకు ఉపకరించే బెడ్‌ను రూపొందిస్తున్నాడు. దానిపేరే ‘కామా’ (CAMA). ఇది సాధారణ బెడ్ కాదు. ఫర్నిచర్, యంత్రం మధ్య గీతను చెరిపేస్తుంది. దీని సాంకేతిక లక్షణాలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. బెడ్ ఉపరితలం మొత్తం 10752 ప్రెజర్ సెన్సార్లుంటాయి. దీనికి 42 యాక్చుయేటర్లున్నాయి. ఇవి బెడ్ ఆకారం, గట్టితనాన్ని మార్చుతాయి. వ్యక్తి పడుకోగానే బెడ్ శరీరం మీది ఒత్తిడిని అధిక రిజల్యూషన్‌తో మ్యాప్ చేసి.. ఎవరు పడుకున్నారో.. ఏ భంగిమలో ఉన్నారో.. వెన్నెముక, భుజాలు, తుంటి వంటి కీలక భాగాలను గుర్తిస్తుంది.
ఫ్లో రోబోటిక్ కుర్చీ..
ఏఐ సిస్టమ్ రాత్రంతా చిన్న చిన్న మార్పులు చేస్తూ ఒత్తిడి పాయింట్లను తగ్గించి వెన్నెముకను సరైన స్థితిలో ఉంచి.. వ్యక్తి మేల్కోకముందే సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంటర్నెట్ నుంచి శరీరం, ఉపరితలాల మధ్య పరస్పర చర్యల డేటాను సేకరించడం సాధ్యం కాదు కాబట్టి ప్రతి కామా బెడ్ ఒక డేటా సేకరణ యంత్రంగా పని చేస్తుంది. కామా మొదటి అడుగు మాత్రమే. వాటర్ రోబోటిక్స్ తర్వాత ‘ఫ్లో’ అనే రోబోటిక్ కుర్చీని అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్‌లో మొదలైన ఈ స్టార్టప్ నిద్రను మరింత శాస్త్రీయం చేస్తూ భవిష్యత్‌లో ఫర్నిచర్‌ను పూర్తిగా మార్చేసే సామర్థ్యం కలిగేలా రూపొందించేందుకు కృషి చేస్తోంది.






