30 ఏళ్ల కళాభినయం.. నాట్యాన్ని ప్రేక్షకుల హృదయాల్లోకి తీసుకెళ్లిన ఘనత

by Sujitha Rachapalli |

చెన్నైకి చెందిన విద్యా భవాని సురేష్ భరతనాట్యం‌ను కేవలం నృత్యంగా కాకుండా కథలు, భావాలు, ఆలోచనలను అర్థం చేసుకునేలా చేర్చి గత 30 ఏళ్లుగా అద్భుతమైన ప్రదర్శనలిస్తోంది.

30 ఏళ్ల కళాభినయం.. నాట్యాన్ని ప్రేక్షకుల హృదయాల్లోకి తీసుకెళ్లిన ఘనత
X

దిశ, ఫీచర్స్: చెన్నైకి చెందిన విద్యా భవాని సురేష్ భరతనాట్యం‌ను కేవలం నృత్యంగా కాకుండా కథలు, భావాలు, ఆలోచనలను అర్థం చేసుకునేలా చేర్చి గత 30 ఏళ్లుగా అద్భుతమైన ప్రదర్శనలిస్తోంది. సాంప్రదాయిక నృత్య ప్రదర్శనల్లో అర్థం కాని సమస్యను ఆమె తన మాటలు, పుస్తకాలు, ఉపన్యాసాల ద్వారా పరిష్కరించింది.

ఓ పెద్దాయన ఎమోషన్..

1994లో ఒక సాయంత్రం తంజావూరు బృహదీశ్వరాలయం సమీపంలోని ఓ బహిరంగ వేదిక. విద్యా భవాని ప్రదర్శన ఇస్తోంది. అప్పటి వరకు ఎవరూ చేయని ప్రయోగం చేసిందామె. ప్రతి నృత్యానికి ముందు ప్రేక్షకులతో మాట్లాడి ఆ కథ, భావం, అర్థాన్ని వివరించింది. తన ప్రదర్శన ముగిసే సరికి ఒక పెద్దాయన కళ్లనిండా నీళ్లు నింపుకొని ముందుకొచ్చి పదకొండు రూపాయలు ఇచ్చాడు. ఆయనిచ్చింది కేవలం పదకొండు రూపాయల కానుకే కావచ్చు. కానీ అది కోటి రూపాయలతో సమానం అనుకుంది. తన కళాభినయంతో ఒక పెద్దాయన భావోద్వేగానికి గురవ్వడంతో చాలా సంతోషించింది.

ప్రజలకు అర్థంకాకపోతే..

ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఆమె ఎక్కడ ప్రదర్శనలిచ్చినా కేవలం నృత్యంతో మాత్రమే కాకుండా ప్రేక్షకులను భాగస్వాములను చేసే సంభాషణలుగా మార్చుకుంది. భరతనాట్యం చూసేటప్పుడు చాలామంది ‘అందం కనిపిస్తోంది’ అని మాత్రమే చెప్తారు. కానీ ఏపాటి అర్థమైందో మాత్రం వ్యక్తం చేయరు. అలరిప్పు, జతిస్వరం, వర్ణం, పదం వంటి అంశాలు.. ముద్రలు, అభినయం, పురాణ కథలు, సంస్కృత-తెలుగు-తమిళ పాటలు ఇవన్నీ తెలియని వారికి ఈ ప్రదర్శనలు అంతగా అర్థం కావు. ప్రజలకు అర్థంకాకపోతే ఏం ఫాయిదా అనుకుంది విద్యా భవాని.

కుల వ్యవస్థపై ప్రశ్న..

కళ జీవించాలంటే ప్రేక్షకులు అవసరం. ప్రేక్షకులు అర్థం చేసుకుంటేనే కళ సజీవంగా ఉంటుందనేది ఆమె నమ్మకం. ఆమె సాంప్రదాయిక నృత్య శిక్షణతో పాటు ఫోక్లోర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది. కంపెనీ సెక్రటరీగా కార్పొరేట్ ఉద్యోగం చేసింది. ఈ వైవిధ్యమైన నేపథ్యం ఆమెకు స్వతంత్ర ఆలోచనా విధానాన్ని ఇచ్చింది. 19 ఏళ్ల వయసులోనే సాంప్రదాయిక రిపర్టరీలోని స్త్రీ పాత్రలు తనకు సరిపోవడం లేదని గుర్తించింది. దేవదాసి సంప్రదాయం నుంచి భరతనాట్యం ఎలా మార్చబడింది? కుల వ్యవస్థ పాత్ర ఏమిటి? వంటి విషయాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది.

ప్రేక్షకుల హృదయాల్లోకి..

తను నేర్పినది విద్యార్థి అనుకరించకూడదు అనేది విద్య ఉద్దేశం. కృష్ణుడు కుడి వైపు నుంచి రావాలా ఎడమ వైపు నుంచా అన్నది వాళ్లే నిర్ణయించుకోవాలి అంటుందామె. ఇప్పటి వరకు సుమారు 150 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. వారిలో హంషి బాలమురుగన్ ఒకరు. 23 ఏళ్ల వయసులోనే మ్యూజిక్ అకాడమీలో బెస్ట్ లెక్చర్ డెమాన్‌స్ట్రేషన్ అవార్డు సాధించింది. గత 25 ఏళ్లలో భర్తతో కలిసి 47 పుస్తకాలు ప్రచురించింది. లక్ష కాపీలు అమ్ముడవ్వడం ఆమె విజయానికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే భరతనాట్యాన్ని కేవలం వేదికపైనే కాకుండా ప్రేక్షకుల హృదయాల్లోకి తీసుకెళ్లింది.

Next Story