తెలంగాణ రెరా బలోపేతం

by Sujitha Rachapalli |

తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించడానికి, కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించడానికి గత మూడేళ్లుగా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG-RERA) అనేక మార్పులను తీసుకొచ్చింది.

తెలంగాణ రెరా బలోపేతం
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించడానికి, కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించడానికి గత మూడేళ్లుగా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG-RERA) అనేక మార్పులను తీసుకొచ్చింది. చైర్మన్, సభ్యులు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) బృందం సంయుక్తంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి అత్యంత పట్టణీకరణ గల రాష్ట్రాల్లోని రెరా అథారిటీలు అవలంబిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసింది. గడిచిన మూడేళ్లలో తెలంగాణ రెరాలో అత్యుత్తమ పారదర్శక పాలన, డిజిటల్ గవర్నెన్స్, ఫిర్యాదుల పరిష్కారం, జవాబుదారీతనం, విధానపరమైన నిర్ణయాలు ప్రవేశపెట్టింది. ఈ అధ్యయనానికి అనుగుణంగా.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి, అలాగే సిబ్బందికి సంబంధించి 56 మంది ఆఫీసర్లను డిప్యుటేషన్ ద్వారా నియమించుకొని, రెరా అథారిటీ కార్యాలయాన్ని జులై, 2023లో తన పూర్తి కార్యకలాపాలతో విస్తరించింది. దీంతో ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించే త్రైమాసిక నివేదికల ఫైలింగ్ 28శాతం నుంచి 85శాతానికి పెరిగింది.

వేగవంతమైన రిజిస్ట్రేషన్లు

చట్టం ప్రకారం ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్‌కు నెల రోజుల సమయం ఉన్నప్పటికీ.. తెలంగాణ రెరా కేవలం 10 నుంచి 21 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తోంది. ఇప్పటి వరకు 10,817 ప్రాజెక్టులు, 5,106 రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, తెలంగాణ రెరాలో రిజిస్టర్ అయ్యారు. ఈ పటిష్టమైన చర్యల ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మన తెలంగాణ రెరా అథారిటీ ఐదవ స్థానంలో నిలిచింది.

అనధికారిక ప్రకటనలపై ఉక్కుపాదం

ఏ ప్రాజెక్ట్ అయినా సరే.. రెరా రిజిస్ట్రేషన్ (నమోదు) చేయకుండా మార్కెటింగ్ చేయకూడదు. ప్రకటనలు ఇవ్వకూడదు. బుకింగ్‌లు లేదా విక్రయాలు జరపకూడదని కఠిన నిబంధనలను అథారిటీ ప్రవేశపెట్టింది. ఈ ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా అనధికారిక, చట్టవిరుద్ధంగా జరిగే నిర్మాణాల నుంచి కొనుగోలుదారులకు పూర్తి స్థాయి రక్షణను కల్పిస్తోంది.

మూడంచెల బ్యాంక్ ఖాతాల విధానం..

ప్రాజెక్ట్ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి సెప్టెంబర్ 2024 నుంచి ‘కలెక్షన్, సెపరేట్ అండ్ ట్రాన్సాక్షన్’ అనే మూడు ప్రత్యేక ఖాతాల విధానాన్ని తెలంగాణ రెరా అథారిటీ తప్పనిసరి చేసింది. కలెక్షన్ అకౌంట్ నుంచి 70 శాతం నిధులు ఆటో-స్వీప్ (Auto-sweep) పద్ధతిలో ఎటువంటి లీన్ (No Lien) లేని ఈ ప్రత్యేక ఖాతాకు బదిలీ అవుతాయి. ఈ నిధులను కేవలం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం మాత్రమే వాడాలి. ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్, ఇంజనీర్ మరియు చార్టర్డ్ అకౌంటెంట్ (CA)లు నిర్మాణ పురోగతిని ధృవీకరిస్తూ ఇచ్చే సర్టిఫికేషన్ ఆధారంగానే ఈ ఖాతా నుండి నగదు ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.

ప్రమోటర్ హక్కులు.. బాధ్యతలు…

రియల్ ఎస్టేట్ చట్టం 2016లోని సెక్షన్ 15 ప్రకారం.. ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించిన మెజారిటీ ప్రమోటర్ హక్కులను (Promoter Rights), బాధ్యతలను (Liabilities) మూడో పక్షానికి (Third Party) బదిలీ చేయడం లేదా కేటాయించడంపై తెలంగాణ రెరా కీలకమైన సర్క్యులర్ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతోపాటు తెలంగాణ రెరా నిబంధనలు-2017లోని రూల్ 2(1)(j) ప్రకారం ‘కొనసాగుతున్న ప్రాజెక్టులు’ నిర్వచనంలో ఉన్న అస్పష్టతను తొలగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రెరా సమర్పించిన ప్రతిపాదనల మేరకు, మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ నిబంధనలకు సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పెండింగ్ ప్రాజెక్టుల పునరుద్ధరణ…

రెరా చట్టంలోని సెక్షన్-8 కింద ‘జయ ప్లాటినం’ వంటి నిలిచిపోయిన ప్రాజెక్టులను కొనుగోలుదారులు, ఆర్థిక సంస్థలు, సాంకేతిక నిపుణుల సమన్వయంతో అసోసియేషన్ ఏర్పాటు చేయించి విజయవంతంగా అథారిటీ పూర్తి చేయించింది. అదే బాటలో పనులు నిలిచిపోయిన మరో ప్రాజెక్ట్ ‘జయ డైమండ్’ పునరుద్ధరణకు కూడా అథారిటీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కొనుగోలుదారుల అసోసియేషన్ (Association of Allotees) భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయి.

పలు సంస్థలతో…

చట్టాన్ని కఠినంగా అమలు చేయడానికి పలు సంస్థలతో రెరా ఒప్పందం చేసుకుంది. తెలంగాణ రెరా తనకున్న సిబ్బంది కొరత, పెరుగుతున్న పని ఒత్తిడిని అధిగమిస్తూ.. మినిమమ్ గవర్నమెంట్ - మ్యాగ్జిమమ్ గవర్నెన్స్‌(Minimum Government–Maximum Governance) అనే లక్ష్యంతో అథారిటీ ముందడుగు వేసింది. ఇందులో భాగంగా ప్రముఖ విద్యా, సాంకేతిక, న్యాయ సంస్థలతో(ASCI-Hyderabad, NALSAR Law University, ESCI, IAMC, ASCI-Mumbai, and CGG-Hyderabad) నియంత్రణ పరిశోధన (రెగ్యులేటరీ రీసెర్చ్), ప్రణాళిక మరియు సాంకేతిక అంశాలు, చట్టపరమైన, ఐటీ (సమాచార సాంకేతికత), మధ్యవర్తిత్వ యంత్రాంగాలు, ప్రకటనల పర్యవేక్షణ, భాగస్వాముల అవగాహన మొదలైన వాటిని మెరుగుపరచడం కోసం కీలక ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది.

Next Story