- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాప్‌లో దూసుకుపోతున్న మల్కాజిగిరి, సైబరాబాద్
అనుమతులలో ఎంఎంసీ.. ఆదాయంలో సీఎంసీ టాప్.. మల్కాజిగిరిలో 6,799 పర్మిషన్స్.. ఆదాయం రూ.198 కోట్లు.. ఇక సైబరాబాద్‌లో 5,403 పర్మిషన్స్.. ఆదాయం రూ.538 కోట్లు

దిశ, మేడ్చల్ బ్యూరో : భవన నిర్మాణాల అనుమతుల జారీలో మల్కాజిగిరి నగర పాలక సంస్థ(ఎంఎంసీ) టాప్‌గా నిలిచింది. మహానగరంలోని జీహెచ్ఎంసీ, సీఎంసీలతో పోల్చితే ఎంఎంసీ గత ఆర్థిక సంవత్సరం 2025-26లో అనుమతుల జారీలో పై చేయి సాధించింది. ట్రై కమిషనరేట్ల పరిధిలో కలిపి మొత్తం 17,957 భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేయగా, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అత్యధికంగా 6,799 అనుమతులు జారీ చేసి రికార్డు సృష్టించింది. ఇకపోతే జీహెచ్ఎంసీలో 5,755 అనుమతులు జారీ కాగా, సీఎంసీలో 5,403 అనుమతులు జారీ అయినట్లు టౌన్ ప్లానింగ్ విభాగం విడుదల చేసిన ఆర్థిక నివేదికలో వెల్లడించింది.
ఇండిపెండెంట్ ఇళ్లకు మొగ్గు..
పశ్చిమ నగరంలోని ఐటీ కారిడార్, కోకాపేట, నార్సింగ్ ప్రాంతాల్లో ఆకాశహర్మ్యాలకు పెద్ద ఎత్తున అనుమతులు జారీ కాగా.. ఈస్ట్‌లో ఎల్బీనగర్, హయత్ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి వైపున వ్యక్తిగత గృహాలకు ప్రజలు ప్రాధన్యమిచ్చినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని తూర్పు ప్రాంతాలైన ఎల్.బి.నగర్, హయత్ నగర్, ఉప్పల్, ఘట్ కేసర్, బోడుప్పల్, నాగోల్ లాంటి ప్రాంతాల్లో ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణాలకు ప్రజలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇండిపెండెంట్ ఇళ్లకు 75 గజాల స్థలంలో కూడా ఇంటి నిర్మాణానికి అనుమతులు జారీ చేస్తున్నారు. ఇంటి నిర్మాణ అనుమతులు 75గజాలకు పరిమితం చేయడంతో మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిస్తుంది. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా తూర్పు భాగంలో ఇండిపెండెంట్ ఇళ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ముఖ్యంగా వరంగల్, విజయవాడ హైవే చుట్టు పక్కల ప్రాంతాల్లో కోటి నుంచి రెండు కోట్ల మధ్య బడ్జెట్‌లో ఇండిపెండెంట్ ఇళ్లు నిర్మించుకునే అవకాశం ఏర్పడింది. ఇండిపెండెంట్ ఇళ్లకు త్వరగా అనుమతులు ఇస్తున్ననేపథ్యంలో.. ఇళ్లను కొనుగోలు చేసేందుకు మధ్యతరగతి కుటుంబాలతో పాటు ఉద్యోగులు సైతం ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.
అందుబాటులో ఫ్లాట్ల ధరలు
తూర్పున అపార్ట్‌మెంట్ ధరలు సైతం ఇతర ప్రాంతాలతో పోల్చితే అందుబాటులోనే ఉన్నట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం తక్కువ ధరలకు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు దొరుకతుండడంతో కొనుగోలుదారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్‌లలో ఫ్లాట్లు తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈస్ట్‌లో అభివృద్ది పెద్ద ఎత్తున జరుగుతుండడంతో పాటు కనెక్టివిటీ పరంగా మెట్రో రైలు ఆ ప్రాంతాల గుండా ప్రారంభమవుతోంది. ఎల్బీ నగర్ నుంచి.. అదే విధంగా నాగోల్, ఉప్పల్ నుంచి ప్రధానమైన మెట్రో రైలు మార్గాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో కూడా సొంత ఇంటి నిర్మాణం కలను సాకారం చేసుకుకునేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ఆదాయంలో సీఎంసీ టాప్..
భవన నిర్మాణ అనుమతుల జారీలో ఎంఎంసీ ముందంజలో ఉండగా, సీఎంసీ మాత్రం అత్యధిక ఆదాయాన్ని సమకూర్చి పెట్టింది. ఎంఎంసీలో జారీ అయిన 6,799 ఇంటి నిర్మాణ అనుమతులకు కేవలం రూ.198.24 కోట్ల ఆదాయం రాగా, సైబరాబాద్ నగర పాలక సంస్థ 5,403 అనుమతులు జారీ చేసినందుకు రూ.538.09 కోట్లు ఆదాయం వచ్చింది. జీహెచ్ఎంసీలో 5,755 ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా.. రూ.436.47 కోట్ల ఆదాయం సమకూరింది. ఇలా మొత్తం మూడు మున్సిపల్ కమీషనరేట్లకు సంబంధించి రూ.1172.80 కోట్ల ఆదాయం వచ్చిందని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలియజేశారు. సీఎంసీ పరిధిలో ఆకాశహర్మ్యాలకు పెద్ద ఎత్తున అనుమతులు ఇవ్వడంతో భారీ ఆదాయం వచ్చిందని, ఎంఎంసీలో లే అవుట్ విత్ హౌసింగ్, లే అవుట్ విత్ ఓపెన్ ప్లాట్స్ కేటగిరీల్లో 75 గజాల వ్యక్తిగత గృహాలకు అనుమతులు జారీ అయినట్లు చెబుతున్నారు.






