- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిఫ్ట్ ఎక్కుతున్నారా? మీ ప్రాణాలకు గ్యారెంటీ ఉందా?
మీరు అపార్టుమెంట్‌లో ఉంటున్నారా? రోజూ లిఫ్ట్ ఎక్కుతున్నారా? ఐతే ఒక్క క్షణం. మీ లిఫ్ట్ రెగ్యులర్‌గా సర్వీస్ చేయిస్తున్నారా? ఎలాంటి లోపాలు తలెత్తుతున్నాయో గుర్తించారా? లేదా.. ఐతే ఏ క్షణమైనా కూలే ప్రమాదం ఉంది.

దిశ, తెలంగాణ బ్యూరో: మీరు అపార్టుమెంట్‌లో ఉంటున్నారా? రోజూ లిఫ్ట్ ఎక్కుతున్నారా? ఐతే ఒక్క క్షణం. మీ లిఫ్ట్ రెగ్యులర్‌గా సర్వీస్ చేయిస్తున్నారా? ఎలాంటి లోపాలు తలెత్తుతున్నాయో గుర్తించారా? లేదా.. ఐతే ఏ క్షణమైనా కూలే ప్రమాదం ఉంది. ఈ మధ్య లిఫ్ట్ ప్రమాదాలు పెరిగాయి. నాలుగైదు అంతస్తుల భవనాల్లోనే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటున్నప్పుడు హైరైజ్డ్ బిల్డింగ్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలో అంచనా వేయండి. హైదరాబాద్‌తోపాటు పరిసరాల్లో ఈ మధ్య ఆకాశాన్నంటే భవనాలు పెరిగిపోయాయి. పోటీ పడి నిర్మాణాలు చేపడుతున్నారు. 50 నుంచి 60 అంతస్తుల బిల్డింగ్స్ నిర్మిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ నిబంధనలేవీ లేకపోవడం వల్ల ఎకరం స్థలంలో వేల ఫ్లాట్లు నిర్మించి అమ్మేసుకోవడం ద్వారా కోట్లు మూటగట్టుకునే పనిలో డెవలపర్లు ఉన్నారు. డెన్సిటీ ఎంతగా ఉంటుందో లెక్కించడం లేదు. భవిష్యత్తులో ట్రాఫిక్, నీటి వసతి, డ్రైనేజీ వంటి సమస్యల తీవ్రతను అంచనా వేయడం లేదు. అలాగే లిఫ్ట్‌ల నిర్వహణ ఎంత కష్టమో గుర్తించడం లేదు. ప్రతి పనికీ లిఫ్ట్ అనివార్యం. ఆకాశాన్నంటే బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలు, పది, ఇరవై అంతస్తుల భవనాల్లో పైకి వెళ్లాలన్నా, కిందకు రావాలన్నా ప్రతి ఒక్కరికీ ‘లిఫ్ట్’, ‘ఎస్కలేటర్’ తప్పనిసరి. ఐతే నగరవాసుల రోజువారీ జీవితంలో భాగమైన ఈ లిఫ్టుల భద్రత ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. సాంకేతిక లోపాలు, సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల లిఫ్టులు అర్ధాంతరంగా ఆగిపోవడం, వైర్లు తెగి కిందపడిపోవడం వంటి ఘటనల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. లిఫ్టులో ఇరుక్కొని గాయపడ్డారని, చనిపోయారనే వార్తలు వింటున్నాం. ఆఖరికి మంత్రులు కూడా లిఫ్టుల్లో ఇరుక్కోవడం ద్వారా ఇబ్బందులకు గురైన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ‘లిఫ్ట్స్ యాక్ట్’ అమల్లోకి తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లయినా లిఫ్టుల మీద చట్టం డ్రాఫ్ట్ దశలోనే ఉండిపోయింది. రియల్ ఎస్టేట్ మీద ఆధారపడే ప్రభుత్వాలు కూడా ఇలాంటి చట్టాలపై దృష్టి సారించడం లేదన్న విమర్శలొస్తున్నాయి.
దీనికి కూడా చట్టమా?
ప్రస్తుతం తెలంగాణలో భవన నిర్మాణాలకు జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ, హెచ్‌ఎండీఏ సంస్థలు అనుమతులు ఇస్తున్నాయి. ఆ తర్వాత భవనాల్లో ఏర్పాటు చేసే లిఫ్టుల నాణ్యతను పరిశీలించేందుకు ఎవరూ లేరు. నాణ్యత, భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక చట్టం, అథారిటీలు లేవు. అందుకే లిఫ్ట్ నిర్వహణ చట్టం కూడా రావాలని రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.
చట్టమొస్తే ఏం జరుగుతుంది?
- ప్రతి అపార్ట్‌మెంట్, కమర్షియల్ కాంప్లెక్స్‌లో లిఫ్ట్ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ విద్యుత్ శాఖ నుంచి అనుమతి, లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి.
- ప్రభుత్వం గుర్తింపు పొందిన ఇన్‌స్పెక్టర్లు ప్రతి సంవత్సరం లిఫ్టులను తనిఖీ చేస్తారు. అవి సేఫ్‌గా ఉన్నాయని సర్టిఫై చేస్తారు.
- బ్రాండెడ్, భద్రతా ఫీచర్లు ఉన్న లిఫ్టులను మాత్రమే అమర్చాలి. లోకల్ కంపెనీల నాసిరకం లిఫ్టులకు చెక్ పడుతుంది.
- ప్రమాదం జరిగితే భవన యజమానులు, బిల్డర్లు లేదా మెయింటెనెన్స్ ఏజెన్సీలను చట్టపరంగా బాధ్యులను చేసి కఠిన శిక్షలు విధించే అవకాశం ఉంటుంది.
12 ఏండ్లుగా పెండింగులోనే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే ఇతర రాష్ట్రాల మాదిరిగానే ‘తెలంగాణ లిఫ్టులు, ఎస్కలేటర్ల చట్టం’ తీసుకురావాలని ప్రతిపాదనలు రూపొందించారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా దీనికి సంబంధించిన డ్రాఫ్ట్‌ను ప్రభుత్వానికి సమర్పించారు. కానీ ఇన్నేండ్లయినా ఫైలు ఒక శాఖ నుంచి మరో శాఖకు తిరగడమే తప్ప ఆచరణకు రావడం లేదు. కేవలం లిఫ్ట్ తయారీ కంపెనీలు ఇచ్చే వారెంటీపైనే అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు ఆధారపడుతున్నాయి. కానీ సరైన చట్టం లేకపోవడం వల్ల క్వాలిటీ లేని లోకల్ లిఫ్టులను తక్కువ ధరకే కొని అమర్చుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ వర్షాకాల సమావేశాల్లోనే ‘లిఫ్ట్స్ యాక్ట్’ బిల్లును ఆమోదించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.






