- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల రోజుల్లో భూముల ధరలు డబుల్, ట్రిపుల్
భూముల మార్కెట్ విలువల పెంపుకు రంగం సిద్ధం.. ప్రాంతాన్ని బట్టి మూడు రెట్లు కూడా.. కోర్ ఏరియాస్‌లో భారీగా పెరుగుదల.. పెట్టుబడులకు ఇదే సరైన సమయం

దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే నెల నుంచి తెలంగాణలో భూముల ధరలు పెరగనున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు రెండు, మూడింతలు కావచ్చు. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా.. ప్రాంతాన్ని బట్టి పెంచాలని సర్కార్ యోచిస్తుంది. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ బహిరంగ మార్కెట్లో భూముల ధరలు పెరిగాయి. బహిరంగ మార్కెట్, మార్కెట్ విలువలకు మధ్య చాలా తేడా ఉంది. ఉదాహరణకు నల్లగొండ జిల్లాలో ఎకరం ధర రూ.50 లక్షలు పలుకుతుంటే మార్కెట్ విలువ మాత్రం నేటికీ రూ.2.50 లక్షలకే ఉంది. అలాగే నగర శివార్లల్లో గజం ధర రూ.10 వేలు పలికే చోట మార్కెట్ ధర కేవలం రూ.1000 మాత్రమే ఉంది. అలాగే హైదరాబాద్ నగర శివారులో ఎకరం రూ.150 కోట్లు పలికే చోట కేవలం రూ.3 కోట్ల వరకే ఉంది. ప్రభుత్వం వేలం వేసినప్పుడు పలికిన ధరలతో పోల్చితే తేడాను చెప్పడానికి కూడా వీల్లేనట్లుగా కనిపిస్తుంది. ఈ వ్యత్యాసం వల్ల బ్లాక్ మనీ రాజ్యమేలుతుంది. మరో వైపు డబ్బులు వెచ్చించినా ఆ స్థాయిలో బ్యాంకు రుణాలు ఇచ్చే స్థితి లేదు. అందుకే వీటిని సరి చేసే దిశగా కనీసం 100 నుంచి 300 శాతం వరకు పెంచనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ పెంచిన ధరలు జూన్ ఒకటో తేదీ నుంచే అమలు చేసే అవకాశం ఉంది. అంటే సరిగ్గా పాత మార్కెట్ ధరలు కేవలం నెల రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయన్న మాట. అందుకే ఇదే భూములు కొనుగోలు చేసేందుకు సరైన సమయంగా రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ పెంచిన ధరలు ఎవరికి భారం కానున్నాయి? ఏ వర్గానికి వెసులుబాటు కలగనుంది?
సమతుల్యత కోసమే
బహిరంగ ధరలు, మార్కెట్ విలువలకు మధ్య వ్యత్యాసాల తగ్గింపు దిశగా మార్కెట్ విలువల పెంపు ప్రక్రియను చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఎకరం ధర రూ. లక్ష లోపు ఉంది. నిజానికి అక్కడ రూ.10 లక్షలకు తక్కువైతే లేదు. అలాంటి ప్రాంతాల్లో మూడింతలు చేసేటట్లు ఉంది. ప్రధానంగా ఎకరం రూ. లక్ష లోపు ఉన్న ప్రాంతాల్లో వాటిని 300 శాతం పెంచినట్లు రికార్డులు చెబుతున్నాయి. హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ నిర్వహించిన వేలం పాటల్లో కోకాపేట, ఖానామెట్ పరిధిలోని ప్లాట్లకు ఏకంగా రూ.150 కోట్లు పలకడం విశేషం. ఓపెన్ మార్కెట్‌లో ఆ మేరకు ధరలు పలుకుతున్నాయన్నది అధికారికంగా తెలిసింది. కానీ అక్కడి భూముల మార్కెట్ విలువను మాత్రం రూ.10 కోట్లకు తక్కువకే ఖరారు చేశారు. నల్లధనాన్ని కూడబెట్టుకున్న వారంతా ఆయా ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేయడం రివాజు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి, గండిపేట, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలాల్లో అత్యధిక విలువైన భూములు ఉన్నాయి. గజం ధర లక్షల్లో ఉంది. ఎకరం భూమి కొనుగోలు చేయాలంటే సామాన్యులెవరికైనా అసాధ్యం. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో హైటెక్ సిటీకి పక్కనే ఉండే ప్రాంతాల్లో ఎకరం రూ.100 కోట్ల పైమాటే. కనీసం రూ.20 కోట్లయినా చేస్తే ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది. ఎలాగూ అక్కడ బడా కంపెనీలు మాత్రమే ఎకరాల్లో కొనుగోలు చేస్తున్నాయి. కోకాపేట, పుప్పాలగూడ, ఖానామెట్.. ఈ ఊర్ల పేర్లు దేశంలోనే ప్రసిద్ధిగాంచినవి. ఇక్కడి భూములను ప్రభుత్వం నిర్వహించిన ఈ వేలంపాటల్లోనే అత్యధిక ధరలు పలికాయి. కానీ అక్కడి మార్కెట్ విలువలు కూడా ఎకరానికి రూ.2.28 కోట్ల నుంచి రూ.3.25 కోట్లకు మించలేదు. అలాంటి ప్రాంతాల్లో రెట్టింపు ధరలను ఖరారు చేయడం వల్ల నష్టమేమీ లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. వారికి ఆదాయపు పన్నుల నుంచి తప్పించుకునే అవకాశం లభించేది. ప్రభుత్వానికి కూడా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూర్చే విధంగా ధరల పెంపు ఉండొచ్చునని అంచనా.
ప్రాంతాలను బట్టి పెంపు
ఈ సారి భూముల మార్కెట్ విలువలు పట్టణ ప్రాంతాల వారికి షాక్‌కు గురి చేసే అవకాశం ఉంది. కోర్ ఏరియాస్‌లో మార్కెట్ విలువలు భారీగా పెరగనున్నాయి. ఇది ప్రాంతాలను బట్టి కూడా ఉండనుంది. డిమాండ్ ఏ ఏరియాలో ఉందో కూడా చూస్తున్నారు. వ్యవసాయ భూములు, రెసిడెన్షియల్ ప్లాట్లు, అపార్టుమెంట్లపైన ఈ సారి పెంపు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ పరిధిలో కలిసిన ప్రాంతాల్లో ధరలు అనూహ్యంగా పెరిగాయి. అందుకనుగుణంగా మార్కెట్ విలువలు కూడా పెంచేందుకు రంగం సిద్ధమైంది. వ్యవసాయ భూములైతే 100 నుంచి 300 శాతం వరకు పెంచుతారన్న ప్రచారం జరుగుతుంది. అలాగే ఇంటి స్థలాలపై 150 నుంచి 200 శాతం, అపార్టుమెంట్లు చదరపు అడుగు ధరలు మాత్రం ఏకంగా 40 నుంచి 50 శాతం పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ పెంపుదల గతం కంటే చాలా ఎక్కువగా ఉండనుంది. దీన్ని బట్టి స్టాంప్ డ్యూటీ, ఇతర ఫీజుల మోత కూడా అంతే పెద్ద మొత్తంలో ఉంటుంది. నాలుగు రకాలుగా ప్రాంతాలను విభజించారు. వ్యవసాయ భూములు, నాన్ కన్వర్షబుల్ ల్యాండ్స్, హైవే, నివాసయోగ్యమైన ప్లాట్లు ప్రామాణికంగా మార్కెట్ విలువల పెంపు ఉంటుంది. హైవేస్, కమర్షియల్ జోన్స్‌లో 300 శాతం వరకు పెరుగుతాయంటున్నారు. ఉదాహరణకు రూ.6 లక్షలు ఉంటే అది రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు కావచ్చు.
మహిళలకు స్టాంప్ డ్యూటీ రిలీఫ్
ప్రాపర్టీస్‌కి మహిళలు యజమానులు ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నది. మహిళా సాధికారతకు పెద్ద పీట వేసే నేపథ్యంలో స్టాంప్ డ్యూటీ రిలీఫ్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. కనీసం ఒక శాతం తగ్గిస్తున్నారు. మహిళలు యజమానులు కావాలన్న లక్ష్యంతో సేల్ డీడ్స్‌లో 7 శాతం ఉంటే ఆరు శాతం స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే సరిపోతుంది. ఎవరైనా ఆస్తులు కొనుగోలు చేస్తే మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా కనీసం ఒక్క శాతం స్టాంప్ డ్యూటీ తగ్గుతుంది.
పెట్టుబడికి ఇదే సరైన సమయం
1. ప్రాపర్టీ ధరలు పెరుగుతాయి. మార్కెట్ ధరలు పెరిగినప్పుడు బహిరంగ మార్కెట్ విలువలను మరింతగా పెంచుతారు. ఇప్పటికే పెరిగిన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొత్త మార్కెట్ ధరలు అమల్లోకి వస్తే రియల్ ఎస్టేట్ రంగం కాస్లీగా మారుతుంది.
2. రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయి. రిజిస్ట్రేషన్ ఫీజుల్లోనూ మార్పులు తీసుకొస్తే ఫీజులు పెరిగే అవకాశం ఉంటుంది.
3. పెట్టుబడుల అవసరం పెరుగుతుంది. జూన్ నుంచి పెరిగిన మార్కెట్ విలువలను అమలు చేసే యోచన ఉంది.






