జీపీఏ ద్వారా భూమి కొనొచ్చా? నిపుణులు చెప్తున్నది వింటే షాక్

by Sujitha Rachapalli |

జీపీఏ – కచ్చితంగా ప్రమాదకరమైన విధానమే.. ఇలా కొంటే హక్కులు రావు.. పనుల నిర్వహణకు అధికారం మాత్రమే.. బ్యాంకులు రుణాలు ఇవ్వవు

జీపీఏ ద్వారా భూమి కొనొచ్చా?  నిపుణులు చెప్తున్నది వింటే షాక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూముల క్రయ విక్రయాలు అనేక రకాలు. డీడ్స్ కూడా అనేకం. సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, పార్టిషన్ డీడ్.. అలాగే జీపీఏ కూడా ఉంటుంది. ఒక వ్యక్తి భూమిని మరో వ్యక్తి జీపీఏ(జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) తీసుకుంటాడు. తను మళ్లీ మార్కెట్లో అమ్మకానికి పెడతాడు. ఎవరైనా కొనుగోలు చేసేందుకు వస్తే తాను జీపీఏ హోల్డర్ అంటాడు. ఈ జీపీఏ ద్వారా భూమిని కొనొచ్చా? ఎలాంటి ఇబ్బందులు తలెత్తవా? కొంత కాలానికి అసలు హక్కుదారుడినని ఎవరైనా వస్తారా? అన్న సందేహాలు ఉన్నాయి. జీపీఏ ద్వారా భూమి కొనుగోలు చేస్తే హక్కులు దక్కుతాయా? భూమి కొనుగోలులో చాలా మంది చేసే పొరపాటు జీపీఏ ఆధారంగా ఆస్తిని కొనడం. తక్కువ ధర, త్వరితగతిన ట్రాన్సాక్షన్ వంటి కారణాలతో జీపీఏ ద్వారా కొంటారు. కానీ ఇది చట్టపరంగా ప్రమాదకరమైన విధానమని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఇబ్బంది పడొద్దంటే జాగ్రత్తలు పాటించాలి. కొనేటప్పుడే అన్నీ చెక్ చేసుకోవాలి. జీపీఏ అంటే అధికారం మాత్రమే. హక్కు కాదని గుర్తించాలి. ఆస్తి కొనుగోలులో ఎల్లప్పుడూ సేల్ డీడ్ మాత్రమే ప్రిఫరబుల్.

ఎందుకంటే..?

– జీపీఏ అంటే హక్కు కాదు. కేవలం దానిపై అధికారం మాత్రమే.

– జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. యజమాని తరపున పనులు నిర్వహించడానికి అధికారాలను మరొకరికి ఇవ్వడమే. యాజమాన్య హక్కును బదిలీ చేయడం లేదన్న మాట.

GPAతో యజమాని కాలేరు..

– కొన్ని కేసుల్లో జీపీఏ ఆధారంగా ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ జరిగితే చట్టబద్ధమైన అమ్మకాలుగా పరిగణించబడవని తెలిపినట్లు లాయర్లు స్పష్టం చేస్తున్నారు.

– జీపీఏ ట్రాన్సాక్షన్ కోసం పూర్తి డబ్బులు చెల్లించినా చట్టబద్ధ యజమాని కాలేరు.

– జీపీఏ ఇచ్చిన వ్యక్తి ఏ రోజైనా దాన్ని రద్దు చేసే అధికారం ఉంటుంది.

– జీపీఏ చేసిన వ్యక్తి చనిపోతే ఆయన వారసులు కూడా హక్కుల కోసం సవాల్ చేయొచ్చు.

– భవిష్యత్తులో వివాదాలు, కోర్టు కేసులు తప్పవు.

– జీపీఏ హోల్డర్‌కు బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వవు.

– డబ్బులు వెచ్చించినా యజమాని కాకపోవచ్చు.

– రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల హక్కులు బలంగా లేనట్లే.

– భూమి కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా సేల్ డీడ్ ద్వారానే జరగాలి.

– ఇప్పటికే జీపీఏ ద్వారా కొనుగోలు చేసి ఉంటే, అసలు యజమాని నుంచి వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అవసరం.

చెక్ చేసుకోవాల్సిందే..

– ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ చూడాలి. హక్కుదారుల పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎవరి నుంచి ఎవరెవరికి అమ్మకాలు సాగాయో తెలుసుకోవాలి.

– ప్రస్తుతం అమ్మే వ్యక్తి హక్కుదారుడో కాదో ఈసీ ద్వారా స్పష్టం అవుతుంది.

– భూ యాజమాన్యపు హక్కు పత్రాలు

– గతంలో జరిగిన అన్ని ట్రాన్సాక్షన్స్ డాక్యుమెంట్లు చెక్ చేసుకోవాలి. అన్ని ఉండాలి. ఏదైనా మిస్ అయిందంటే ఆలోచించాలి.

– ల్యాండ్ క్లాసిఫికేషన్ చాలా ముఖ్యం.

Next Story