- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DIGITAL WILL : వ్యక్తి మరణం తర్వాత డిజిటల్ ఆస్తులు ఎవరివి?
డిజిటల్ విల్.. వ్యక్తి మరణం తర్వాత డిజిటల్ ఆస్తులు ఎవరివి?.. డిజిటల్ లీగల్ హీర్‌పై కొత్త నియమాల రూపకల్పన.. పరిగణలోకి పాస్ వర్డ్, యాక్సెస్ రైట్స్, ప్రైవసీ అంశాలు

దిశ, ఫీచర్స్ : మీరు ఇల్లు లేదా కారు కొన్నారు అనుకుందాం. వెంటనే మీకు వచ్చే ఆలోచన నా తర్వాత ఇది ఎవరికి చెందాలని.. వారసులుగా ఎవరు ఉండాలని. మరి మీ ఇన్‌స్టాగ్రామ్ మెమొరీస్, మెయిల్స్, క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్స్ సంగతేంది? ప్రస్తుతం మన జీవితాలు ఆన్‌లైన్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ క్రమంలో మన మరణం తర్వాత మన డిజిటల్ అస్సెట్స్ పొందాల్సిందెవరో కూడా నిర్ణయించాలి కదా. ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ‘డిజిటల్ లీగల్ హీర్ (డిజిటల్ చట్టపరమైన వారసుడు)’కు సంబంధించి కొత్త నియమాలను రూపొందించడానికి పరిశీలిస్తోంది. ఈ ఫ్రేమ్‌వర్క్ ద్వారా మీ ఆన్‌లైన్ ఆస్తులను భౌతిక ఆస్తుల మాదిరిగానే చట్టపరంగా వారసులకు బదిలీ చేయడం సాధ్యపడుతుంది.
డిజిటల్ విల్ అంటే..
డిజిటల్ విల్ అనేది ఒక డాక్యుమెంట్ లేదా సిస్టమ్. ఇందులో మీరు మీ మరణం తర్వాత మీ ఆన్‌లైన్ ఎకౌంట్స్, డేటా, డిజిటల్ పెట్టుబడులు ఎవరు చూసుకోవాలి.. వాటిని ఏమి చేయాలనేది నిర్ణయించుకుంటారు. సోషల్ మీడియా ప్రొఫైల్స్, ఈమెయిల్ ఎకౌంట్స్, క్లౌడ్ స్టోరేజ్ నుంచి క్రిప్టోకరెన్సీ వాలెట్ల వరకు అన్నీ ఇందులో ఉంటాయి. ట్రెడిషనల్ విల్‌కు భిన్నంగా.. డిజిటల్ విల్ పాస్‌వర్డ్‌లు, యాక్సెస్ రైట్స్, ప్రైవసీ వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది.
డిజిటల్ ఆస్తులు అంటే...
ప్రస్తుతం కొన్ని లక్షల మంది సోషల్ మీడియా ద్వారా ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి ఆస్తులుగా మారిపోయాయి. జీమెయిల్, ఔట్‌లుక్ వంటి ఇమెయిల్ అకౌంట్లు, గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ వంటి క్లౌడ్ స్టోరేజ్, యూట్యూబ్ చానెళ్లు, వెబ్‌సైట్లు వంటి డిజిటల్ వ్యాపారాలు, క్రిప్టోకరెన్సీలు, NFTలు డిజిటల్ ఆస్తులుగా పరిగణించబడుతున్నాయి. ఇలా సంపాదిస్తున్న ఒక వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే... ఎమోషనల్‌గా మాత్రమే కాదు ఆర్థికంగా కూడా సఫర్ అవుతుంటారు కుటుంబసభ్యులు. ఆ వ్యక్తి డిజిటల్ లైఫ్‌ను యాక్సెస్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. లాక్ చేయబడిన ఫోన్లు, OTP వెరిఫికేషన్లు, కఠినమైన ప్రైవసీ నిబంధనల కారణంగా ముఖ్యమైన డేటాను తిరిగి పొందడం దాదాపు అసాధ్యం అవుతోంది. మరోవైపు టెక్ కంపెనీలు వినియోగదారుల ప్రైవసీని కాపాడతామంటూ యాక్సెస్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.
అందుకే ఇప్పటి వరకు.. భారతీయ చట్టం డిజిటల్ వారసత్వాన్ని స్పష్టంగా నిర్వచించలేదు. దీంతో ఇది చట్టపరమైన గ్రే ఏరియాగా మిగిలిపోయింది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు డిజిటల్ లీగల్ హీర్ (డిజిటల్ వారసుడు) అనే భావనను ప్రవేశపెట్టే మార్గదర్శకాలపై పని చేస్తోంది. ఇకపై వినియోగదారులు తమ అకౌంట్లకు డిజిటల్ హీర్‌ను నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. ప్లాట్‌ఫామ్‌లు కూడా ధృవీకరణ తర్వాత యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్, డిజిలాకర్ వంటి వ్యవస్థలతో ఏకీకరణ చేసే అవకాశం ఉంది. సెక్యూర్ డిజిటల్ వాల్ట్‌లలో యాక్సెస్ సూచనలను నిల్వ చేయవచ్చు.
చట్టపరమైన అడ్డంకులను తగ్గించి.. చనిపోయిన వ్యక్తి కుటుంబాలకు యాక్సెస్‌ను అందించడమే ప్రభుత్వ లక్ష్యం. కానీ క్రిప్టోకరెన్సీలు పెద్ద సవాలుగా మారాయి. బిట్‌కాయిన్ లేదా ఈథరియమ్ కలిగి ఉండి.. మీ ప్రైవేట్ కీస్ కోల్పోతే, ఆ డబ్బు శాశ్వతంగా పోయినట్లే. ప్రభుత్వమైనా, కంపెనీ అయినా దాన్ని తిరిగి తీసుకురాలేదు. అందుకే రికవరీ ఫ్రేజెస్‌ను స్పష్టంగా డాక్యుమెంట్ చేయడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. క్రిప్టో వివరాలను విల్లో చేర్చాలని.. విశ్వసనీయ వ్యక్తికి చెప్పాలని అంటున్నారు. లేదంటే డిజిటల్ సంపద పూర్తిగా పోయినట్లే.
మెమోరియలైజ్డ్ ఎకౌంట్
ఒక వ్యక్తి మరణించిన తర్వాత.. వారి సోషల్ మీడియా అకౌంట్లు చాలా సార్లు యాక్టివ్‌గానే ఉండిపోతాయి. అవి డిజిటల్ స్మారకాలుగా మారతాయి. ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లు ‘మెమోరియలైజ్డ్ అకౌంట్’ సౌకర్యం ఇస్తున్నప్పటికీ.. దీని గురించి అవగాహన చాలా తక్కువ. ఇలా యూజ్ చేయని ఎకౌంట్లు హ్యాక్ కావడం, దుర్వినియోగం చేయబడే ప్రమాదం ఉంది. ఇది కుటుంబానికి మానసిక వేదన కలిగిస్తుంది. డిజిటల్ విల్‌లో మీ ఎకౌంట్లను డిలీట్ చేయాలా.. ఆర్కైవ్ చేయాలా లేదా మెమోరియల్‌గా మార్చాలా అనేది స్పష్టంగా పేర్కొనవచ్చు. కానీ ఇక్కడ అతిపెద్ద సవాల్ ప్రైవసీ, వారసత్వం మధ్య బ్యాలెన్స్ చేయగలగడం. మరణం తర్వాత కూడా వినియోగదారుని ప్రైవసీ ఒక ప్రధాన అంశంగా మిగులుతుంది. భారతదేశపు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ (DPDP) డేటా రక్షణపై ఒత్తిడి చేస్తుంది. అదే సమయంలో వారసత్వ చట్టాలు యాక్సెస్‌ను కోరుతాయి. భవిష్యత్ నియమాలు ఎంపిక యాక్సెస్‌ను అనుమతించవచ్చు. ఇందులో ఆర్థిక డేటా భాగస్వామ్యం కావచ్చు. వ్యక్తిగత చాట్‌లు ప్రైవేట్‌గానే ఉంచవచ్చు.






