- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యాస్టే ఫస్ట్.. మర మనుషులు వచ్చినా మారని మనుషుల కుల తత్వం
ఏఐ వచ్చినా ఎదగని మానవత్వం.. కులం కుమ్ములాటలో చస్తున్న జనం.. కుల రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్న నాయకత్వం.. క్యాస్ట్ రాజేస్తరు.. కన్నింగ్ ఆలోచనలతో ఎదుగుతరు.. ఏకంగా సీఎం, మంత్రి హోదాలో ఉన్నోడు కూడా ఇదే కథ

దిశ, ఫీచర్స్: కాలం మారింది. మనిషి మారిండు. పోకడ మారింది. టెక్నాలజీ మారింది. ఇన్ని మారాయి గానీ.. కులం అనే ఫీలింగ్ మాత్రం ఇంకా మారలేదు. ఇది మనిషితో పాటు రోజురోజుకూ పెరుగుతోంది. వ్యవస్థను శాసించే శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందినా ఇప్పటికీ జనాలు కులం కులం అంటూ కులం రొచ్చులో పొర్లి తరిస్తున్నారు. మా కులం గొప్పదంటే మా కులం గొప్పదంటూ పోటీపడి కులంతో రాజకీయాలు చేస్తున్నారు.
తక్కువచేసి చూడటమేం గొప్పా?
రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. అవకాశాలు కల్పించింది. అయినా ఇంకా కులజాడ్యం పోవడం లేదు. చదువుకున్నవాళ్లు.. మంచి రంగాల్లో స్థిరపడ్డవాళ్లు సైతం కులాన్ని బూచిగా చూపించి తమ నైజం చాటుకుంటున్నారు. ఏదో ఒక రూపంలో కుల అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. చిన్న కులాలను తక్కువ చేసి చూడటం.. సామాజిక బహిష్కరణలు.. అవమానాలతో వివక్ష చూపిస్తున్నారు. అంటే అందరూ అలా ఉన్నారని కాదు. అగ్ర కులాలలోనూ ఆదర్శభావాలు కలిగిన వాళ్లు ఉన్నారు. అన్ని కులాలను సమానంగా చూసేవాళ్లున్నారు. కానీ దరిద్రం ఏంటంటే ఇలాంటివారిని కూడా నిందిస్తూ.. సహాయ నిరాకరణ చేస్తూ తమ కురచ బుద్ధిని చాటుతున్నారు. కులపిచ్చితో రాక్షసులుగా మారుతున్నారు.
కుంపట్లు రాజేసి రాజకీయమా?
ఇటీవల చూసినం కదా? నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో కులం తక్కువవారని ఓ కుటుంబానికి ఆలయ ప్రవేశం కల్పించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఆలయంలో చోటు చేసుకున్న ఘర్షణలో ఓ మూడు నెలల పసికందు మృతి చెందింది. అగ్ర కులాల వ్యక్తులే కారణమనే నిరసనలు వెల్లువెత్తాయి. అంటే కులపిచ్చి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరికుండే వనరులు వారికున్నాయి. ఎవరికుండే అవకాశాలు వారికున్నాయి. అయినా కూడా జనాలు ఒకరిదాంట్లో ఒకరు వేలుపెట్టి లేనిపోని సమస్యను క్రియేట్ చేస్తున్నారు. కులాసాగా బతకాల్సినచోట కులాల కుంపట్లు రాజేసి రాజ్యం మీద పులుముతున్నారు. ఎవరి బతుకు వారు బతకాల్సిందిపోయి వేరేవాళ్ల జీవితంలో జోక్యం చేసుకొని కులం కుతంత్రంతో దునియాను ప్రభావితం చేస్తున్నారు.
పేదరికానికి కులం కారణమా?
కులం గురించి ఇంతలా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఇంత టెక్నాలజీ మారినా.. ప్రపంచం వేగంగా మారుతున్నా.. మనం ఇంకా కులం దగ్గరే ఆగిపోతున్నాం. అభివృద్ధి కూడా కులం చుట్టే తిరుగుతోందని తాజా కుటుంబ సర్వే నివేదిక ప్రకారం అధికారిక లెక్కలే చెప్తున్నాయి. పేదరికానికి కులం కూడా ఒక కారణమే అని కుటుంబ సర్వే నివేదికను ప్రభుత్వానికి అందించిన స్వతంత్ర నిపుణుల కమిటీ చెప్తోంది. దేశంలో కులం లేదు.. కేవలం పేదరికమే ఉంది.. పేదరికానికి కులాన్ని కలిపి అణచివేతకు గురవుతున్నారనే వాళ్లు తెలుసుకోవాల్సిందేంటంటే.. వెనకబాటుకు ఆర్థిక పరిస్థితులు ప్రధాన కారణమైనా.. కులం అనేది పేదరికానికి సంబంధించి అన్ని స్థాయిల్లోనూ బలమైన ప్రభావం చూపిస్తోంది. పేదరికం అనేది కులంతో బలంగా ముడిపడిన అంశం.
మరుగుదొడ్లే లేని ఇండ్లు ఎవరివో?
మనోళ్లు ఇంత పొడుగు అంత పొడుగు ముచ్చట్లు చెప్తరు కదా.. ‘మేం అది పొడిశినం.. ఇది పొడిశినం.. మేం చెయ్యవట్కెనే దేశం ఇట్లుంది.. కుల మతాలకతీతంగా పనిచేస్తున్నాం’ అంటరు కదా... మనోళ్లు ఇంత ఏతులు కొడితేం ఏం ఫాయిదా.. రాష్ట్రంలో ఇంకా 13శాతం ఇండ్లకు మరుగుదొడ్లే లేవు. ఇదేదో గాలికి చెప్తున్న ముచ్చట కాదు. ఇది కూడా సర్కారు చేపట్టిన సమగ్ర కుల గణన నివేదికే చెప్తోంది. అభివృద్ధికి పారిశుధ్యాన్ని ప్రాథమిక సూచికగా భావిస్తుంటారు. అలాంటి పారిశుధ్యంలో మన సొసైటీ ఇంకా వెనకబడే ఉంది. అయితే దీనికీ.. కులానికీ సంబంధమేంటీ అనే డౌట్ రావచ్చు. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. మహిళలు.. బాలికల ఆరోగ్యం.. ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ మరుగుదొడ్ల సౌకర్యం లేని ఇండ్లు తక్కువ కులాలకు చెందిన వాళ్లవే.
ఈ ఉపాన్యాసాలెందుకు బాస్?
ఇంత కథ పెట్టుకొనీ.. మనోళ్లు కులమెక్కడిదని కుంటిసాకులు చెప్తుంటారు. ఆ కులం పేరు చెప్పుకొని.. వర్గం పేరు చెప్పుకొని ఎదిగినవాళ్లేమో అస్సలు వాళ్లదిక్కు మళ్లి చూడరు. ఐనా.. వాళ్లను తొక్కుకుంటూ ఎదిగినోడు వాళ్ల దగ్గరికెందుకు పోతడు? ఇంకా గమ్మతి ముచ్చటేందంటే.. ఆయనేదో ఘనకార్యంచేసి ఆరోపణలు ఎదుర్కుంటాడు. ఇగ అప్పుడే షురూ అవుతుంది మనోళ్ల డ్రామా. ‘బడుగు.. బలహీన వర్గాల నాయకుడిపై ఇంత అక్కసా? మా కులం నాయకుడిని అణగదొక్కేందుకే ఈ కుట్ర’ అంటూ ఉపాన్యాసాలు, ఉపోద్ఘాతాలు మొదలు పెడతారు. వాస్తవానికి ఆ నాయకుడు పేరుకే ఆ కులానికి సంబందించిన వ్యక్తి. కానీ ఆ మూలాలెప్పుడో మరిచిపోయి ఉంటాడు. వియ్యం.. కయ్యం అంతా అంతకంటే పెద్ద కులస్తులతోనే. అంటే ఆరోపణలొస్తేనే కులం గుర్తుకొస్తుందన్నమాట.
అసలు విషయం అటకెక్కడమేనా?
ఎవరో ఒకాయన ఎమ్మెల్యేనో.. మంత్రినో.. ఆఖరికి స్పీకర్‌నో అసెంబ్లీలో గొట్టు ప్రశ్నేదో అడుగుతాడు. బాధ్యతాయుతమైన పదవి కాబట్టి దానికి సమాధానమిస్తే అయిపోతుంది. మరీ అంత కాదంటే కౌంటర్‌కి ప్రతి కౌంటర్ వేస్తే అక్కడికి క్లోజ్ అవుతుంది. కానీ సీన్ అలా ఉండదు. మేమంటే అంత చిన్న చూపు కాబట్టే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారనే వాదన మొదలవుతుంది. అవతలి వ్యక్తి సంధించిన ప్రశ్నకు.. వీళ్లు ఇచ్చిన వివరణకు ఎలాంటి అంతనా పొంతనా ఉండదు. చర్చంతా కులం మీదికి మళ్లుతుంది. కులం మీటింగులు, చర్చలు పెడతారు. ధర్నాలు, రాస్తారోకోలు రాజుకునేట్లు ప్లాన్స్ వేస్తరు. ముట్టడికి పిలుపునిచ్చి ముచ్చెమటలు పట్టించే ప్రయత్నం చేస్తరు. అసలు విషయాన్ని అటకెక్కించి.. కులం కుంపట్లు రగిలించి చలికాచుకోవడమే నేటి పొలిటికల్ ట్రెండ్.
కులం చాటున దాక్కుందామా?
ఒక సింగర్ వివాదంలో ఇరుక్కుంటుంది. కుటుంబ సభ్యులు.. ఇంకా ఇద్దరు ముగ్గురు చుట్టాలు ఏదో స్కామ్ చేశారని వార్తలు గుప్పుమంటాయి. న్యాయవాది ఒకాయన.. వీళ్లు బాధితులని చెప్పి కొంతమందిని వెంటేసుకొని వస్తాడు. సదరు సింగర్‌కు.. ఈ స్కామ్‌కు సంబంధం ఉందా లేదా? ఆమె ఈ అవినీతిలో భాగమా కాదా? అనేది మనకు అనవసరం. కానీ గమ్మత్తేందంటే ఆమెపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలకు కులాన్ని మెలిక పెడతారు. ఇదెక్కడి చిత్రం ముచ్చట. ఇక్కడ తేల్చాల్సింది ఆమెకు ఆ అవినీతితో సంబంధం ఉందా లేదా అనేది. అది వదిలేసి మా కులాన్ని తొక్కేయడానికే ఈ ఆరోపణలు అనడం ఏంటి? ఏ కులమైనా.. ఏ వర్గమైనా తప్పుచేస్తే చట్టం చేతిలో శిక్ష తప్పదు. అది చెప్పాలి కానీ కులం చాటున దాక్కునే ప్రయత్నం చేయొద్దు ఎవరైనా.
మనం దేనికి నిదర్శనం మేడం?
ఇదైతే మరీ ఘోరం. పార్లమెంట్ సాక్షిగా ఒకావిడ కులం పేరుతో ఒక ప్రాంతాన్ని కీర్తించాలని బల్లగుద్ది మరీ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఇటీవల రాద్దాంతం జరుగుతోంది కదా? ఒక వర్గం అమరావతి కావాలనీ.. ఇంకో వర్గం వద్దని వాదిస్తున్నాయి. ఇదిలా ఉండగా రాజ్యసభలో కూడా ఈ విషయం చర్చకొచ్చింది. ఈ సందర్భంగా ఒక రాజ్యసభ సభ్యురాలు ‘పెట్టరా అమరావతి.. పిలవరా కమ్మరావతి’ అని సంచలన వాఖ్యలు చేసింది. అంటే ఆమె ఉద్దేశంలో అమరావతి అనేది కమ్మ కులస్తుల రాజధాని అన్నమాట. అంటే ఒక కులం పేరుతో.. వర్గం పేరుతో ఒక రాష్ట్రం ఉంటుందా? దానికి రాజధానిగా ఒక కులం పేరు ఉండాలా? అది కూడా ఒక చట్ట సభలో నిలబడి రుబాబుగా మాట్లాడటం దేనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చో మరి?
టెక్నాలజీ జమానాలో కులం పోరా?
ఒక ఏరియాలో అయ్యప్ప మహా పడిపూజ ఏర్పాటు చేశారట. అయ్యప్పమాల అంటే కులాలకతీతంగా పాటిస్తుంటారు కదా? అయితే తక్కువ కులస్తులు భిక్ష ఏర్పాటు చేశారని కొందరు అక్కడ భోజనం చేయకుండా వెళ్లిపోయారట. ఈ కొందరెవరంటే పొద్దున లేస్తే హిందూ సంప్రదాయం గురించి గొప్పగా చెప్పే ఇద్దరు ఎంపీల అనుచరులట. దైవం ముందు అంతా సమానులే అన్నప్పుడు ఇక తక్కువ కులమెక్కడిది? ఎక్కువ కులమెక్కడిది? దేవుడి దగ్గర కూడా నీది తక్కువ కులం.. నాది ఎక్కువ కులం అనే వ్యత్యాసం చూపించినంక ఇక ఏముంటుంది చెప్పడానికి? రాజకీయంలో ఉండె.. చదువు కాడ ఉండె.. ఉద్యోగంలో ఉండె.. వ్యాపారంలో ఉండె.. ఆఖరికి దేవుడి దగ్గర కూడా కుల భేదాలుండె. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెంది ఏం లాభం?
కొందరివాడిగా మాట్లాడుతారేం?
డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఒకాయన మన కులానికి రేషముండదా అని రెచ్చగొడతాడు. మన కులపోళ్లంతా ఐక్యంగా ఉండాల్సిన ఆవశ్యకత లేదా అని సోయి తెప్పించే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఆయన సోయి తెప్పించే ప్రయత్నం చేయాల్సింది ప్రజలందరికీ కదా? ఐక్యంగా ఉండాలనే సందేశమివ్వాల్సింది కుల మతాలకతీతంగా ఉండేందుకు కదా? కానీ.. మన దగ్గర అంతటి పుణ్యాత్ములుండరు. వాళ్లెంతసేపూ జనాలను ఓటు బ్యాంకుగా మల్చుకోవడానికే చూస్తుంటారు. పైకి మాత్రం తామొక సంఘసంస్కర్త లెక్క బిల్డపిస్తుంటారు. అయినా జనాలకుండాలి. తమను తొక్కుతూ ఎదిగిండని తెలిసినా.. ఇంకా తొక్కుతుండని తెలిసినా సహిస్తూనే ఉంటారు. కానీ కులాల మధ్య చిచ్చుపెడుతూ కొందరివాడిగా మాట్లాడుతుండనే విషయం గ్రహించరు.
మన పోటీ కులంలోనేనా?
సీఎం హోదాలో ఉన్న ఇంకొకాయన ‘మీ కులపోళ్లు ఎంతమంది.. శేరు బువ్వొండితే ఒడవదు’ అని అంటాడు. ఎంత భావ దారిద్ర్యం? ఒక కులం తక్కువుండొచ్చు? ఇంకో కులం ఎక్కువుండొచ్చు. అంత మాత్రానా మీరెంతమంది? మీరెంత మీ బిసాదెంత? అని అనొచ్చా? ఇంకా అది చాలదన్నట్టు చిన్న కులాలను తక్కువ చేస్తూ పి**కుంట్లోళ్లు.. చెప్పులు కుట్టెటోళ్లు.. బట్టలుతికెటోళ్లు అని అనడం తగదు. ఏ హోదాలో ఉన్నోళ్లయినా.. ఎవరైనా ఇట్లా అనడం మంచి పద్ధతైతే కాదు. దునియా ఇంతగా మారినా.. ప్రపంచమంతా అభివృద్ధిలో.. ఆవిష్కరణలో పోటీ పడుతుంటే మనం మాత్రం ఇట్లా నీది తక్కువ కులం.. నాది ఎక్కువ కులం అని గొప్పలు చెప్పుకుంటున్నాం. అది కూడా గొప్పగొప్ప హోదాలో ఉండి. అందుకే మన దగ్గర కులం ఎప్పటికీ వర్ధిల్లుతుంది.
సౌందలా లెక్క ఉండలేమా?
పొద్దున లేస్తే కులం.. కులం అంటూ కులంతోనే బతికే వాళ్లున్న జమానాలో ఒక గ్రామం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. కులాల పేరుతో కొందరు మనలో చీలికలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంటే సామాజిక విప్లవాన్ని ఆచరణాత్మకంగా సాధించింది మహారాష్ర్టలోని ‘సౌందలా’ గ్రామం. ఇది కుల రహిత గ్రామంగా మారి దేశంలో ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచింది. ప్రగతిశీల భావాలతో ఆదర్శ సామాజిక సంస్కరణల్లో ముందుండే ఈ గ్రామం ‘మా కులం మానవత్వం’ అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తూ మహారాష్ట్రలోనే కాదు.. దేశంలోనే మొదటి కులరహిత గ్రామంగా రూపాంతరం చెందింది. అహల్యనగర్ జిల్లా నేవస తాలుకాలో ఉన్న ఈ గ్రామంలోని ప్రజలంతా కుల రహిత ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
ఆలోచన మారాలి: బజారు భిక్షపతి, సామాజిక కార్యకర్త
టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చేసింది. కానీ కులం అనే భావన మాత్రం ఇంకా మారలేదు. టెక్నాలజీ మన జీవితాలను సౌకర్యవంతం చేసినా.. ఆధునికత కుల భావనను పూర్తిగా తుడిచివేయలేదు. ఎందుకంటే ఇది మనసుల్లోకి లోతుగా ఇమిడిపోయింది. రాజకీయాలు ఈ భావనను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నాయి. కులం గొప్పదనం చెప్పడం ద్వారా వ్యక్తులు తమను తాము బలపరచుకుంటున్నారు. ఇది మారాలంటే కేవలం చట్టాలు చాలవు. విద్య.. సామాజిక సంబంధాలు.. ఆలోచనా విధానం పూర్తిగా మారాలి.
వేగవంతం చేయాలి: ఆంజనేయులు కొట్టాముల, కళాకారుడు
నేను కాలేజీలో పని చేస్తా. ఇక్కడ వేర్వేరు ప్రాంతాల నుంచి స్టాఫ్, స్టూడెంట్స్ వస్తారు. ఎవరూ కులం గురించి మాట్లాడరు. స్కిల్, ఐడియా మాత్రమే ముఖ్యం. కాలం మారింది కాబట్టి కుల భావన కూడా మారాలి. కానీ ఇప్పటికీ ఇది పెరుగుతోంది. రాజకీయాలు, సోషల్ మీడియా దీనికి ఇంధనంగా మారుతున్నాయి. జెన్ జీ, ఆల్ఫా తరం ఆన్‌లైన్ ప్రపంచంలో పుట్టింది. వారికి కులం కంటే గ్లోబల్ ఐడెంటిటీ, స్కిల్, అవకాశాలు ముఖ్యం. టెక్నాలజీ సరైన దిశలో ఉపయోగిస్తే కులం భావన సహజంగానే తగ్గుతుంది. మనం దాన్ని వేగవంతం చేయాలి.
అమలు కావడం లేదు: జంగయ్య లాలగారి, ఉద్యమకారుల ఐక్యవేదిక
కులం భావన పెరుగుతోందనడం నిజం. కానీ ఇది యాదృచ్ఛికం కాదు. మనదొక సిస్టమ్. రాజకీయాలు కులాన్ని ఓటు బ్యాంకుగా మారుస్తున్నాయి. ఆధునికత వచ్చినా.. ఆర్థిక అసమానతలు.. విద్యా అవకాశాల్లో తేడాలు ఉన్నంతవరకు కులం భావన బలపడుతూనే ఉంటుంది. టెక్నాలజీ అభివృద్ధి చెందినా సమానత్వం ఇంకా సాధ్యం కాలేదు. కులం భావన తగ్గాలంటే కేవలం చర్చలు చాలవు. విద్యలో సమానత.. ఉపాధి అవకాశాలు.. సామాజిక న్యాయం నిజంగా అమలు కావాలి. సమాజంలో ఇంకా స్వేచ్ఛ.. సమానత్వం అమలు కావడం లేదనే చెప్పొచ్చు.






