ఏపీలో యాసిడ్ పురుగుల కలకలం.. నివారణ మార్గాలు ఇవే

by Sujitha Rachapalli |

యాసిడ్ బగ్ ఈ మధ్య వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఏపీలోని రాజమండ్రి దగ్గర ఉన్న బుర్రిలంకలో దీని కారణంగా నర్సరీలో పని చేస్తున్నవారు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ఏపీలో యాసిడ్ పురుగుల కలకలం.. నివారణ మార్గాలు ఇవే
X

దిశ, ఫీచర్స్ : యాసిడ్ బగ్ ఈ మధ్య వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఏపీలోని రాజమండ్రి దగ్గర ఉన్న బుర్రిలంకలో దీని కారణంగా నర్సరీలో పని చేస్తున్నవారు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ చిన్న కీటకం కారణంగా చర్మ సమస్యలు వస్తున్నాయి. దీని నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం.

యాసిడ్ బగ్ అనేది సాధారణంగా నైరోబి ఫ్లై (Nairobi Fly) అని పిలవబడే ఒక చిన్న కీటకం. ఇది పేడెరస్ (Paederus) జాతికి చెందిన రోవ్ బీటిల్. చాలా చిన్నగా.. 6 నుంచి 10 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఎరుపు-నలుపు లేదా ఆరెంజ్-నలుపు రంగులో ఉండి.. చీమలా కనిపిస్తుంది కానీ నిజానికి బీటిల్. తూర్పు ఆఫ్రికాలో నైరోబి ప్రాంతం నుంచి మొదలైన దీని ప్రయాణం.. ఎక్కువగా భారతదేశం, ఆసియా దేశాలలో కనిపిస్తుంది. వర్షాకాలంలో, పంట కోత సమయంలో సంఖ్య ఎక్కువవుతుంది. తేమగా ఉండే ప్రదేశాలను ఇష్టపడుతుంది. ఈ కీటకం కరవదు లేదా కుట్టదు. కానీ దీని శరీరంలో పెడెరిన్ అనే బలమైన విష పదార్థం ఉంటుంది. ఈ విషం బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అవుతుంది. కీటకాన్ని నొక్కినా లేదా చంపినా ఈ విషం చర్మంపైకి వచ్చి తీవ్రమైన సమస్యలు కలిగిస్తుంది.

మనుషులపై ప్రభావం (పేడెరస్ డెర్మటైటిస్):

* చర్మంపై తాకిన వెంటనే మంట, ఎర్రటి గాయాలు, బొబ్బలు వస్తాయి.

* గాయాలు తరచుగా లైన్ లాగా ఏర్పడతాయి.

* కళ్లలోకి విషం పడితే ‘నైరోబి ఐ’ అని పిలుస్తారు. కళ్లు ఎర్రబడి, నీరు కారి, తీవ్రమైన నొప్పి వస్తుంది.

* గాయాలు 7 నుంచి 28 రోజుల్లో మానవచ్చు కానీ చర్మంపై మచ్చలు మిగిలిపోవచ్చు.

జాగ్రత్తలు:

* ఈ కీటకాలను ఎప్పుడూ నొక్కొద్దు. నలపొద్దు. ఊది తోసేయాలి లేదా ఓ పేపర్‌తో పడేయాలి.

* రాత్రి సమయంలో లైట్ల వెలుగుకు ఆకర్షితమై ఇళ్లలోకి వస్తాయి కాబట్టి లైట్స్ ఆఫ్ చేసే ప్రయత్నం చేయాలి.

* తాకినట్లు అనిపిస్తే తక్షణం సబ్బు నీటితో బాగా కడగాలి.

* కళ్లలో పడకుండా.. నోటి దగ్గరగా వెళ్లకుండా.. జాగ్రత్త వహించాలి.

Next Story