మనోడు.. మనాలిలో సాగుబడి చేస్తున్నాడు.!

by Daayi Srishailam |

వ్యవసాయంతో కొత్త జీవనాన్ని నిర్మిస్తూ సమాజంతో కలిసి జీవించాలనే స్ఫూర్తిని అందిస్తున్నాడు

మనోడు.. మనాలిలో సాగుబడి చేస్తున్నాడు.!
X

దిశ, ఫీచర్స్: 23 ఏళ్ల వయసులో రూ. 1.5 కోట్ల ఉద్యోగాన్ని వదిలిన అభిషేక్ రెడ్డి మనశ్శాంతి కోసం వ్యవసాయ జీవనం ఎంచుకున్నాడు. ఇప్పుడు మనాలిలో సుస్థిర వ్యవసాయంతో కొత్త జీవనాన్ని నిర్మిస్తూ సమాజంతో కలిసి జీవించాలనే స్ఫూర్తిని అందిస్తున్నాడు.

క్రియేటివ్ డైరెక్టర్‌

హిమాచల్ ప్రదేశ్‌లోని లోయల్లో నివసిస్తున్న అభిషేక్ ఒకప్పుడు హైదరాబాద్‌లోని ఒక స్టార్టప్‌లో క్రియేటివ్ డైరెక్టర్‌గా సంవత్సరానికి రూ. 1.5 కోట్లు సంపాదించేవాడు. అభిషేక్ ప్రయాణం అనంతపురంలోని ఐదెకరాల ఎర్రమట్టి భూమిలో మొదలైంది. ఆ భూమిని కష్టపడి పెర్మాకల్చర్ క్షేత్రంగా మార్చాడు. కేవలం మట్టి, విత్తనాల కోసమే కాదు. 12వ తరగతి నాటికి గ్రాఫిక్ డిజైన్, కాపీరైటింగ్‌లో ఫ్రీలాన్సర్‌గా నెలకు రూ. 30,000 సంపాదించేవాడు. ఆ తర్వాత డిజైనింగ్, యానిమేషన్, మార్కెటింగ్ వంటి నైపుణ్యాలను నేర్చుకొని 21 ఏళ్ల వయసులో క్రియేటివ్ డైరెక్టర్‌గా ఎదిగాడు.

ఉద్యోగం వదిలేసి..

15-16 గంటల పని, నిద్ర లేని రాత్రులు, టార్గెట్, డెడ్‌లైన్లతో ఒత్తిడి పెరిగిపోయేది. అదికాస్త అభిషేక్‌ను అలసిపోయేలా చేసింది. 2023లో అభిషేక్ పూర్తిగా కుంగిపోయాడు. ఎలాంటి ప్రణాళిక లేకుండా ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆరు నెలల పాటు దిశాదీపం లేని జీవితంలో తిరిగాడు. పని లేకుండా ఉత్తగనే ఉంటే ఏదోలా అనిపించేది. డబ్బు సంపాదిస్తేనే సమాజంలో విలువ ఉంటుందనే నిజాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు తల్లి వ్యవసాయాన్ని గుర్తుచేసింది. ఒబులాపురంలో ఐదెకరాల భూమి, ఎండిపోయిన బావి, పొడి నీటి కాలవతో ఉండేది. అభిషేక్ పెర్మాకల్చర్‌ ద్వారా వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.

35 రకాల పంటలు..

పెర్మాకల్చర్ ద్వారా.. మామిడి, జామ, జాక్‌ఫ్రూట్ వంటి ఎత్తైన చెట్లు, మొరింగా వంటి నత్రజని స్థిరీకరణ మొక్కలు, చిలకడదుంప, బఠానీ, బ్రాహ్మీ వంటి నీటిని నిలుపుకునే నేల కవర్ మొక్కలను నాటాడు. నీటి కొరత పెద్ద సవాలుగా ఉండేది. వర్షపు నీటిని నిల్వ చేయడానికి స్వేల్స్ తవ్విండు. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లను పెట్టిండు. కోళ్లను తీసుకొచ్చి నేలను తవ్వించడం.. దానిని ఎరువుగా మార్చడం వంటివెన్నో చేసిండు. తేనెటీగలు పరాగసంపర్కానికి, కంపోస్ట్ పురుగులు ఆర్గానిక్ వ్యర్థాలను ఎరువుగా మార్చిండు. అలా 35 రకాల పంటలతో తన భూమిని సుస్థిర వ్యవసాయ శక్తిగా మార్చేశాడు.

మనాలికి మారాడు..

అభిషేక్ తన సాగు అనుభవాలను "సిల్లీ సెన్సాయ్" ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంటున్నాడు. 7 లక్షల మంది ఫాలోవర్లతో అతని పోస్టులు ఆకర్షిస్తున్నాయి. వ్యవసాయం నెమ్మదిగా లాభాలను ఇచ్చినా.. నెలకు రూ. 25,000 వచ్చినా మార్కెటింగ్, లేబర్, సమాజ ఒడిదుడుకులు అతన్ని ఆలోచింపజేశాయి. అందుకే ఇప్పుడు మనాలిలో కొండల ప్రశాంతతలో కొత్త వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభిస్తున్నాడు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చిన్న భూమిని.. సమాజంతో కలిసి పనిచేసే ప్రదేశాన్ని ఎంచుకున్నాడు.

Next Story