హైదరాబాద్‌కు చెందిన అభిజ్ఞ వేమూరు కళ స్త్రీ త్వానికి ప్రాణం పోస్తుంది

by Daayi Srishailam |

అభిజ్ఞ కళా ప్రయాణం.. 'ఆమె'కు ప్రాణం.!

హైదరాబాద్‌కు చెందిన అభిజ్ఞ వేమూరు కళ స్త్రీ త్వానికి ప్రాణం పోస్తుంది
X

దిశ, ఫీచర్స్: కవితాత్మక పెయింటింగ్ ఎక్కువగా ప్రకృతి చుట్టూ తిరుగుతుంది. ఆచారాలు.. నాస్టాల్జియా గురించి ఉంటుంది. కానీ హైదరాబాద్‌కు చెందిన అభిజ్ఞ వేమూరు కళ మాత్రం స్త్రీ తత్వం.. స్త్రీ మానసిక ఆరోగ్యం.. ప్రసవానంతర ఒత్తిడి.. మౌనం వంటి వాటి చుట్టూ తిరుగుతూ ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుతోంది.

షికాగోలో కళా ప్రావీణ్యం..

అభిజ్ఞ హైదరాబాద్‌లోని భారతీయ విద్యా భవన్ పబ్లిక్ స్కూల్‌లో చదివింది. వాళ్ల నాన్న సాఫ్ట్‌వేర్ ఇన్నోవేటర్. అలా అభిజ్ఞకు చిన్నప్పటి నుంచే వివిధ రంగాల్లో ఆసక్తిని పెంచాడాయన. ఇంకోవైపు అభిజ్ఞ వాళ్ల అమ్మకు టెక్స్‌టైల్స్.. ఇంటీరియర్స్.. గ్యాస్ట్రానమీలో ప్రవేశముంది. పేరెంట్స్ ప్రభావంతో తను భారతీయ కళల ప్రాముఖ్యతను తెలుసుకుంది. 17 ఏళ్ల వయసులోనే షికాగోలోని స్కూల్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్లో అండర్ గ్రాడ్యుయేట్ చేసింది. అక్కడ మెరిట్ స్కాలర్‌షిప్ పొందిన ఆమె మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రైజ్‌ను గెలుచుకుంది. కళా వ్యక్తీకరణలో మెటీరియాలిటీ ప్రాముఖ్యత ఏంటో తనకు అక్కడే అర్థమైంది.

పిల్లల కోసం ఇండియాకు..

గ్రాడ్యుయేషన్ తర్వాత.. లండన్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌కి సెలెక్టయింది అభిజ్ఞ. లండన్ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలో ఐదేళ్లు గడిపింది. శాన్ ఫ్రాన్సిస్కోను కళాకారుల నగరం అంటుంటారు. ఆ నేపథ్యంలో స్ట్రీట్ ఆర్ట్.. క్రియేటివ్ కమ్యూనిటీ వంటి అంశాల్లో పట్టు సాధించింది. ఇలా షికాగో నుంచి లండన్.. ఆ తర్వాత శాన్ ఫ్రాస్కిస్కో వంటి ప్రపంచ మేటినగరాల ప్రభావం తనపై ఎంత ఉన్నా ఆమె మాత్రం తన కళ.. రచనలు భారతీయ ఆచారాలు.. సంప్రదాయాలు.. మూలాల చుట్టే తిరుగుతుంటాయి. బయట ఎన్నో మెరుగైన అవకాశాలున్నా తన పిల్లలు భారతీయ మూలాలకు దగ్గరగా పెరగాలని ఇండియా వచ్చేశారు.

జనవరి 10 వరకు..

హైదరాబాద్‌లోనే ఉంటున్న అభిజ్ఞ కళను వర్చువల్ రియాలిటీతో జోడిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని ఐకానిక్ ధూమిమల్ గ్యాలరీలో ‘స్కి(ఇ)న్ – రీ-మెంబరింగ్ ద సెల్ఫ్ థ్రూ స్కిన్ అండ్ థ్రెడ్’ అనే సోలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. 2026 జనవరి 10 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతోంది. ‘ది పోస్ట్‌నేటల్ టోర్సో’, ‘కారౌసల్ ఆఫ్ లైఫ్’, ‘ది ప్రోజెస్టిరోన్ షాట్’, ‘ఓడాలిస్క్’ ప్రత్యేకం. ‘కాళి’, ‘స్మృతి’, ‘మీనాక్షి’, ‘ఆర్య’, ‘సిస్టర్స్ ఆఫ్ ఆండాల్’, ‘ది హోమ్‌లెస్ గర్ల్ చైల్డ్’, ‘ది డెబ్యుటెంట్’ వంటి శక్తివంతమైన తన ఆల్బమ్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు పెట్టి వాటి ద్వారా స్త్రీ స్వయంప్రతిపత్తిని చాటిచెప్తోంది.

Next Story