- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎగతాళి ఎదురైనచోటే.. ఎదిగి చూపించాడు!
ఒకప్పుడు ‘గావ్ వాలే..’ అని ఎగతాళి చేసినవారే ఇప్పుడతని సలహాలు అడుగుతున్నారు. ఇది కదా సక్సెస్ అంటే..!

దిశ, ఫీచర్స్ : కలలు కనడం ఒక ఎత్తైతే.. వాటిని సాకారం చేసుకోవడం మరో ఎత్తు, మొదటిది సులువే.. రెండవదే జర కష్టం. అయినా సరే.. తప్పక సాధించాలన్న తపన ఉన్నవారు వాటిని సాకారం చేసుకుంటుంటారు. ఆ కోవకు చెందిన 24 ఏళ్ల యువకుడే ప్రిన్స్ రాజ్ శుక్లా. బిహార్‌లోని పూర్ణియా జిల్లాకు చెందిన ఇతను ఓ పేద రైతు కుటుంబం నుంచి సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం సంపాదించాడు. అది తనకు సంతృప్తినివ్వకపోవడంతో విదేశాలకు వెళ్లాలన్న కలను కూడా వదిలేసి స్వగ్రామనికి తిరిగి వచ్చి అనుకున్న లక్ష్యంవైపు అడుగులు వేశాడు. ఒకప్పుడు లక్ష రూపాలయతో ప్రారంభమైన అతని జర్నీ నేడు కోట్లల్లో టర్నోవర్ సాధిస్తోంది. ఇంతకీ అదెలా సాధ్యమనే కదా మీ సందేహం లెట్స్ గో అండ్ రీడ్ దిస్ స్టోరీ!
ఉద్యోగం వదిలేసి.. ఊరికి వచ్చేసి..
ప్రిన్స్ రాజ్ శుక్లా తండ్రి సాంప్రదాయ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తండ్రి సహాయంతో ప్రిన్స్ రాజ్ ఎమ్మెస్సీ చదివాడు. బాగా చదువుకొని, విదేశాలకు వెళ్లి పెద్ద పెద్ద ఉద్యోగాలను చేయాలని భావించాడు. ఇందులో భాగంగా బెంగళూరులో ఉద్యోగం చేయడం ప్రారంభించాడు. అయితే 2021లో అతని ఆలోచన మారింది. తాను చేస్తున్న ఉద్యోగం నచ్చలేదు. దీంతో తాను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన వ్యవసాయరంగం కోసం ఏదో ఒకటి చేయాలని భావించాడు. ఉద్యోగం వదిలేసి తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. అప్పుడతని వద్ద పెద్దగా పెట్టుబడి కూడా లేదు. తండ్రి సహకారంతో రూ.1 లక్ష రుణంగా తీసుకొని AGRATE అనే అగ్రి స్టార్టప్‌ను ప్రారంభించాడు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఆర్గానిక్ ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలు, ఆధునిక పరికరాలు అందించడం ద్వారా చిన్న రైతుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగాడు. వాటినే ఆదాయ వనరుగా మల్చుకున్నాడు.
రూ. 2.5 కోట్ల టర్నోవర్
ఉద్యోగం వదిలేసి, సొంతంగా స్టార్టప్ ప్రారంభించిన ప్రిన్స్ రాజ్ శుక్లా మొదట్లో అనేక ఇబ్బందులు, నష్టాలు ఎదుర్కొన్నాడు. అయినా సరే వెనకడుగు వేయలేదు. ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుందని బలంగా నమ్మాడు. రైతులకు శిక్షణ ఇవ్వడం, సస్టైనబుల్ ఫార్మింగ్ పద్ధతులు నేర్పడం ద్వారా వాళ్లల్లోనూ నమ్మకం సంపాదించాడు. దీంతో అతని జీవితం మలుపు తిరిగింది. ఇప్పుడు AGRATE సంస్థ 10,000కి పైగా రైతులకు సహాయం చేస్తోంది. ITC, పార్లే, గాడ్రెజ్ వంటి ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యం చేసుకుంది. దీని ద్వారా రైతులకు సహాయం చేస్తూ రూ. 2.5 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది. భవిష్యత్‌లో ₹10 కోట్లకు సాధించాలన్న టార్గెట్ పెట్టుకుంది. ఒకప్పుడు ప్రిన్స్‌రాజ్‌ను గావ్ వాలే (గ్రామీణుడు) అని ఎగతాళి చేసినవారే ఇప్పుడు అతని సలహాలు అడుగుతున్నారు. ఇది కదా సక్సెస్ అంటే.. అని పలువురు అతన్ని ప్రశంసిస్తున్నారు. ఉద్యోగం వచ్చినా.. రాకున్నా ఏదో ఒకటి సాధించాలనే తపన ఉన్నవారికి అతని జీవితమొక ప్రేరణగా, స్ఫూర్తిగా పేర్కొంటున్నారు.






